14 వేల మెగావాట్ల విద్యుత్‌పై ప్రభుత్వ దృష్టి
- సంప్రదాయేతర వనరుల ద్వారా ఉత్పత్తికి ప్రణాళిక
- ఈ నెల 12న పునరుత్పాదక విధానంపై ప్రకటన
ముంబై: సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో సంప్రదాయేత రఇంధన వనరుల ద్వారా 14,400 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మే 12న ఇందుకు సంబంధించి కొత్త పునరుత్పాదక శక్తి విధానాన్ని ప్రకటించనుంది. ఈ విధానం ద్వారా సౌర, పవన విద్యుత్ ఉత్పాదకాలకు ఊతమిచ్చినట్టవుతుంది. సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రధాని మోదీ లక్ష్యం నిర్దేశించారని ఇంధన శాఖ మంత్రి చంద్రశేఖర్ బవన్‌కులే చెప్పారు. ఇందులో సౌర శక్తి ద్వారా 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. (ఒక గిగావాట్= 1,000 మెగా వాట్లు). ‘ప్రస్తుతం సంప్రదాయేత ఇంధన వనరుల ద్వారా 6,155 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
అయితే ప్రభుత ్వం వచ్చే ఐదేళ్లలో 14,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది’ అని చెప్పారు. సంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే కాలుష్యం జరగదని అందుకే ప్రభుత ్వం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. 2008లో రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విధానాన్ని రూపొందించిందని, అది 2013లో ముగిసిపోయిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధమైన సోలార్ విధానం లేదని చెప్పారు. ఈ 14,400 మెగావాట్లలో 7,500 మెగావాట్లు సౌరశక్తి ద్వారా, మిగిలిన 5,000 మెగావాట్లు పవన శక్తి ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. చెరకు పిప్పి ద్వారా 1,000 మెగా వాట్లు, ఇతర చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. వ్యవసాయ వ్యర్థాల ద్వారా మరో 300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు.