special ordinance
-
Cryptocurrency Bill: క్రిప్టో బిల్లు ఇక లేనట్లేనా?
క్రిప్టోకరెన్సీ బిల్లు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు నుంచే మొదలైన హడావిడి. ప్రైవేట్ క్రిప్టో అడ్డుకట్టవేయడం, ఆర్బీఐ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాలకూ ఈ సమావేశాల్లోనే లైన్ క్లియర్ అవుతుందని అంతా భావించారు. అయితే బిల్లు డ్రాఫ్ట్ సర్వం సిద్ధమైందన్న ఆర్థిక మంత్రి ప్రకటన.. కేవలం ప్రకటనకే పరిమితం కావడం, మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. బిజినెస్ న్యూస్ ఏజెన్సీ బ్లూమరాంగ్.. క్రిప్టోకరెన్సీ బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రాకపోవచ్చనే ఓ కథనం ప్రచురించింది. మరో మూడు రోజుల్లో (డిసెంబర్ 23తో) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి సంబంధించిన విధివిధానాల గురించి కేంద్రం తుది నిర్ణయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మలమ్మ చెప్పినా కూడా.. ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలు మీడియాలో ప్రచారమైన నేపథ్యంలో ఆమధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని, కేబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు దాదాపు ఖరారు చేసేసుకున్నారు. కానీ, బిల్లు ఇప్పటికీ కేబినేట్ అనుమతి పొందలేదు. వేగిరపాటు వద్దనే.. సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావించారు. నిజానికి క్రిప్టో బిల్లు ప్రస్తావనను శీతాకాల సమావేశాల షెడ్యూల్లో చేర్చిన కేంద్రం.. పార్లమెంట్ వెబ్సైట్లో సైతం ఆ విషయాన్ని పేర్కొంది. కానీ, ఇప్పుడు క్రిప్టో బిల్లు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు చేర్పులతో ఆర్డినెన్స్గానీ, ప్రత్యేక ఆర్డర్‌గానీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక.. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం, నియంత్రణపై స్పష్టమైన చేర్పులతో కూడిన చట్టం చేయవచ్చనే(పార్లమెంట్ సమావేశాలు లేకున్నా చట్టం చేసే వెసులుబాటు ఉండడం) అంచనా. అంశాలు.. క్రిప్టోకరెన్సీ బిల్లు (నియంత్రణ)పై ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. అందులో అంశాల గురించి మాత్రం విస్తృత చర్చ జరిగింది. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కోరుతోంది. కానీ, కేంద్రం మాత్రం అందుకు సుముఖంగా లేదు. క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకరించిందని, క్రిప్టో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇరవై నుంచి యాభై కోట్ల జరిమానా, ఏడాదిన్నర శిక్ష.. ఇలాంటి అంశాలు చేర్చిందని గతంలో బ్లూమరాంగే ఓ కథనం ప్రచురించింది. అంతేకాదు క్రిప్టో కరెన్సీ నియంత్రణను ఆర్బీఐకి, క్రిప్టో ఆస్తుల పర్యవేక్షణ(నియంత్రణ)ను సెబీకి అప్పగించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. దాదాపు కోటిన్నరమంది ఇన్వెస్టర్లు.. 45 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఆస్తుల్ని కలిగి ఉన్నారు. -
‘బొగ్గు’లో సంస్కరణల బాజా
న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం.. బొగ్గుయేతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. అలాగే, అంతిమంగా బొగ్గు వినియోగంపైనా ఆంక్షలు ఉండవు. కేంద్ర క్యాబినెట్ భేటీ అనంతరం బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాలు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కనీస అర్హత గల ఏ కంపెనీ అయినా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. ఈ కొత్త నిబంధనల కింద జనవరిలోనే తొలి విడత వేలం నిర్వహించనున్నట్లు బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ చెప్పారు. మొదటి విడతలో 40 బొగ్గు బ్లాకుల దాకా వేలం వేయనున్నట్లు వివరించారు. మరోవైపు, మార్చి 31తో మైనింగ్ లీజు ముగిసిపోయే ముడి ఇనుము, ఇతర ఖనిజాల గనుల వేలాన్ని గడువులోగా నిర్వహించే ప్రతిపాదనకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. కోల్ ఇండియాకూ మద్దతు ఉంటుంది.. అవకతవకల ఆరోపణల కారణంగా.. 2014లో సుప్రీం కోర్టు 204 బొగ్గు బ్లాకుల కేటాయింపును రద్దు చేసింది. అయితే, అంతిమంగా వినియోగించే అంశానికి సంబంధించి పరిమితుల కారణంగా వాటిలో కేవలం 29 బ్లాకులను మాత్రమే వేలం వేయడం జరిగింది. తాజాగా ఆంక్షలను ఎత్తివేయడంతో మిగతా బ్లాకుల వేలానికీ మార్గం సుగమం అవుతుందని జోషి చెప్పారు. ఈ రంగంలో పోటీని పెంచేందుకు, బొగ్గు దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ రంగ కోల్ ఇండియా గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ చర్యలు ఉపయోగపడనున్నట్లు జైన్ చెప్పారు. అలాగని కోల్ ఇండియా ప్రాధాన్యాన్ని తగ్గించే యోచనేదీ లేదని, దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు దానికి తగినన్ని బ్లాక్‌లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు, 334 నాన్–క్యాప్టివ్ ఖనిజ గనుల లీజు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిపోనుంది. ఇవి మూతబడితే దాదాపు 60 మిలియన్ టన్నుల ముడి ఇనుము కొరత ఏర్పడవచ్చని జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉత్పత్తికి కోత పడకుండా గడువులోగా ఖనిజాల గనుల వేలాన్ని కూడా నిర్వహించాలని.. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు ఇతరత్రా అటవీ, పర్యావరణ అనుమతులు కూడా బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల రెండేళ్ల సమయం ఆదా అవుతుందని, ఎలాంటి అవరోధాలు లేకుండా ఉత్పత్తి యథాప్రకారంగా కొనసాగుతుందని చెప్పారు. అత్యంత భారీ సంస్కరణలు: ప్రధాన్ వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకూ అనుమతినిచ్చినప్పటికీ.. బొగ్గుపరిశ్రమయేతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. తాజా మార్పుచేర్పులు బొగ్గు పరిశ్రమలో అత్యంత భారీ సంస్కరణలని చమురు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ స్వాగతించారు. ‘ఏటా 15 బిలియన్ డాలర్లకు పైగా ఉంటున్న బొగ్గు దిగుమతులను తగ్గించుకోవడానికి గణనీయంగా ఉపయోగపడుతుంది. చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల తరుణంలో.. ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధికి తోడ్పడుతుంది‘ అని జిందాల్ చెప్పారు. అంతిమ వినియోగంపై ఆంక్షల ఎత్తివేత నిర్ణయం.. దేశీయంగా బొగ్గు నిల్వల వెలికితీతకు, మరిన్ని విదేశీ సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పడగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. బొగ్గు మైనింగ్ ఆర్డినెన్స్‌ను ఉక్కు పరిశ్రమ స్వాగతించింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది తోడ్పడగలదని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సంస్కరణల ఊతంతో దేశీ ఉక్కు పరిశ్రమ .. అంతర్జాతీయ స్థాయిలో మరింతగా పోటీపడగలదని తెలిపింది. నీలాచల్ ఇస్పాత్ విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్.. ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్)లో ఆరు ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి కూడా కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఎన్ఐఎన్ఎల్లో ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, బీహెచ్ఈఎల్, ఎంఈసీవోఎన్, ఐపీఐసీవోఎల్, ఒడిషా మైనింగ్ కార్పొరేషన్లకు వాటాలు ఉన్నాయి. మరోవైపు, నీలాచల్ ఇస్పాత్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనను ఉక్కు రంగ కార్మికుల సమాఖ్య ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ ఖండించింది. భూషణ్ స్టీల్, ఆధునిక్ స్టీల్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు మూతబడుతుంటే ప్రభుత్వ రంగంలోని సంస్థలు మెరుగ్గానే పనిచేస్తున్నాయని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.కె. దాస్ చెప్పారు. వాటాల విక్రయ ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మికులు సమ్మెకు దిగేందుకు సిద్ధమని తెలిపారు. -
నీట్ వాయిదా.. కేంద్రం ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఊరట లభించింది. వణికిస్తున్న నీట్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో మెడికల్, డెంటల్ సీట్లకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ మేనెజ్ మెంట్ సీట్లకు మాత్రం నీట్ ద్వారానే అడ్మిషన్లు జరగనున్నాయి. రాష్ట్రాల అభ్యంతరాల మేరకే ఆర్డినెన్స్ జారీ చేశామని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. ఇప్పటికే మే 1న తొలి విడత నీట్ పరీక్షను ఆరు లక్షలమంది విద్యార్థులు రాశారు. జైలై 24న రెండో విడత నీట్ జరగాల్సి ఉండగా అంతకుముందే ఆర్డినెన్స్ వచ్చాయి. మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మే 9న నీట్ కంపల్సరీ అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో నీట్ ప్రతిపాదనల కారణంగా విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు విలువ లేకుండా పోయింది. దీంతో మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులంతా నీట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అపరీక్షకు ఇప్పటికీ ఏ రాష్ట్రాల విద్యార్థులు కూడా సమాయత్తం కాలేదు. దీంతో ఈ విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నీట్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేశాయి. దాదాపు 14 రాష్ట్రాలు నీట్ వద్దని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఈ నిర్ణయం కోసం వేర్వేరు పార్టీలను కూడా సంప్రదించామని చెప్పారు. ఈ ఉత్తర్వులతో ఇప్పటికే ఎంసెట్ మెడికల్ పరీక్షలు నిర్వహించినవారైతే ఫలితాలు విడుదల చేసుకునేందుకు.. పరీక్ష నిర్వహించని వారు పరీక్ష నిర్వహణకు అవకాశం లభించినట్లయింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరీక్ష పూర్తయి ఫలితాలకోసం చూస్తుండగా ఇక తెలంగాణలో పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మొత్తానికి కేంద్రం నిర్ణయం పలు రాష్ట్రాల విద్యార్థులకు కొంత ఊరటను కల్పించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. నీట్ పరీక్షపై ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల్సిందేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.