నీట్ వాయిదా.. కేంద్రం ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఊరట లభించింది. వణికిస్తున్న నీట్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో మెడికల్, డెంటల్ సీట్లకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ మేనెజ్ మెంట్ సీట్లకు మాత్రం నీట్ ద్వారానే అడ్మిషన్లు జరగనున్నాయి. రాష్ట్రాల అభ్యంతరాల మేరకే ఆర్డినెన్స్ జారీ చేశామని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది.
ఇప్పటికే మే 1న తొలి విడత నీట్ పరీక్షను ఆరు లక్షలమంది విద్యార్థులు రాశారు. జైలై 24న రెండో విడత నీట్ జరగాల్సి ఉండగా అంతకుముందే ఆర్డినెన్స్ వచ్చాయి. మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మే 9న నీట్ కంపల్సరీ అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో నీట్ ప్రతిపాదనల కారణంగా విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు విలువ లేకుండా పోయింది. దీంతో మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులంతా నీట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అపరీక్షకు ఇప్పటికీ ఏ రాష్ట్రాల విద్యార్థులు కూడా సమాయత్తం కాలేదు. దీంతో ఈ విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నీట్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేశాయి.
దాదాపు 14 రాష్ట్రాలు నీట్ వద్దని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఈ నిర్ణయం కోసం వేర్వేరు పార్టీలను కూడా సంప్రదించామని చెప్పారు. ఈ ఉత్తర్వులతో ఇప్పటికే ఎంసెట్ మెడికల్ పరీక్షలు నిర్వహించినవారైతే ఫలితాలు విడుదల చేసుకునేందుకు.. పరీక్ష నిర్వహించని వారు పరీక్ష నిర్వహణకు అవకాశం లభించినట్లయింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పరీక్ష పూర్తయి ఫలితాలకోసం చూస్తుండగా ఇక తెలంగాణలో పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మొత్తానికి కేంద్రం నిర్ణయం పలు రాష్ట్రాల విద్యార్థులకు కొంత ఊరటను కల్పించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. నీట్ పరీక్షపై ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల్సిందేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.