మురిపాల మిఠాయిలు
ఎప్పటిలాగే ఆ రోజు కూడా శ్రీకృష్ణుడు ఇరుగుపొరుగు ఇళ్లలో నుంచి వెన్నపెరుగులు దొంగిలించి తిన్నాడు... అక్కడితో కడుపు నిండలేదు...
అమ్మని మీగడ పాలు అడిగితే తిడుతుందని భయం వేసి...
‘అమ్మా! పాలు తాగితే జుట్టు పెరుగుతుందన్నావుగా, కడివెడు పాలు ఇవ్వవూ’ అని గోముగా అడిగాడు. అవి తాగినా కడుపు నిండలేదు...
‘అమ్మా! పాలుపెరుగులతో ఏవైనా కొత్త మిఠాయిలు చేసిపెట్టవూ’ అన్నాడు మురిపెంగా...
చిన్నికృష్ణుని మాటలకు యశోద ముచ్చటపడింది.
అంతే క్షణంలో కొత్త కొత్త వంటలు చేసింది...
కన్నయ్యను ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమగా తినిపించింది...
పనీర్ ఖీర్
కావలసినవి:
పాలు - ఒకటిన్నర కప్పులు; పనీర్ తురుము - అర కప్పు; కండెన్స్డ్ మిల్స్ - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఏలకుల పొడి - అర టేబుల్ స్పూను; డ్రైఫ్రూట్స్ తరుగు - 3 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా)
తయారి:
పెద్ద పాత్రలో పాలు, పనీర్ తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, ఆపకుండా కలుపుతూ, పాలను మరిగించాలి
కండెన్స్డ్ మిల్క్ జత చే సి ఐదారు నిమిషాలు ఉంచి దించేయాలి
ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి తీసేయాలి
పిస్తా తరుగు పైన చల్లి చల్లగా అందించాలి.
చాకో స్వీట్
కావలసినవి:
డార్క్ చాకొలేట్ తురుము - 75 గ్రా; పల్లీలు + బాదం పప్పులు - రెండు టేబుల్ స్పూన్లు; తురిమిన పనీర్ - 150 గ్రా (కాటేజ్ చీజ్); కాఫీ పొడి - అర టీ స్పూను; కోకో పొడి - టీ స్పూను; పంచదార పొడి - 75 గ్రా.; బాదం పప్పులు - 8;
చాకో చిప్స్ - అలంకరిచండానికి తగినన్ని
తయారీ:
డార్క్ చాకొలేట్‌ను అవెన్‌లో ఒక నిమిషం ఉంచి కరిగించి బయటకు తీసి స్పూన్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చాకొలేట్ మౌల్డ్‌లో పల్చగా ఒక పొరలా పోయాలి
బాణలిలో పల్లీలు, బాదంపప్పులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి ముక్కలుముక్కలుగా వచ్చేలా చేయాలి
పనీర్‌ను పొడిపొడిలా చేసి రెండు నిమిషాలపాటు చేతితో మెత్తగా చేయాలి. పంచదార, కాఫీ పొడి, కోకో పొడి, పల్లీలు + బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా తయారుచేసి, చాకొలేట్ టార్ట్ మౌల్డ్స్‌లో ఉంచి, సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి
చాకో చిప్స్‌తో అలంకరించి చల్లగా అందచేయాలి.
మావా కాజు శాండ్విచ్
కావలసినవి:
మెత్తగా పొడి చేసిన కోవా - 150 గ్రా; పంచదార - 40 గ్రా; నెయ్యి - టీ స్పూను; ఖర్జూరాలు - 10 (పాలలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి); జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - కొద్దిగా
తయారి:
ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి
బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి
ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి
ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి
ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి
తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి
ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి.
స్ట్రాబెర్రీ శ్రీఖండ్
కావలసినవి:
నీరు పూర్తిగా తీసేసిన పెరుగు - కప్పు; మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు - అర కప్పు; క్రీమ్ - పావు కప్పు; పంచదార - 2 టీ స్పూన్లు; స్ట్రాబెర్రీలు - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
తయారి:
ఒక పాత్రలో ముందుగా పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి
క్రీమ్, మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు జత చేసి మరోమారు కలిపి, మూడు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి
స్ట్రాబెర్రీలతో అలంకరించి అందించాలి. (నాలుగు కప్పుల పెరుగును మూట గడితే ఒక కప్పు పెరుగు తయారవుతుంది)
మలై పేడా
కావలసినవి:
చిక్కటి పాలు - రెండున్నర కప్పులు; పల్చటి పాలు - రెండున్నర కప్పులు; కుంకుమ పువ్వు - కొద్దిగా; నిమ్మ ఉప్పు - పావు టీ స్పూను; కార్న్ ఫ్లోర్ - 2 టీ స్పూన్లు (పల్చటి పాలలో వేసి కరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; పంచదార - 4 టీస్పూన్లు; పిస్తా పప్పులు - టీ స్పూను (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
తయారీ:
నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలను పక్కన ఉంచి, మిగిలిన చిక్కటి పాలకు, పల్చటి పాలను జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అంచులకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. చిన్న పాత్రలో నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి
మూడు టేబుల్ స్పూన్ల నీళ్లలో నిమ్మ ఉప్పు వేసి కలిపి, మరుగుతున్న పాలలో చిలకరించాలి
నీళ్లలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార వేసి బాగా కలిపి చూడటానికి కోవాలా అయ్యేవరకు ఉంచాలి
కుంకుమ పువ్వు మిశ్రమం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి
ఈ మిశ్రమాన్ని పేడాలుగా చేసుకోవాలి
పిస్తా తరుగుతో అలంకరించి, సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీసిన పావు గంటకు అందించాలి
ఇవి రెండు మూడురోజులు తాజాగా ఉంటాయి.
సేకరణ: డా ॥వైజయంతి