Speech Therapy
-
నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్
'కోయ్.. మిల్ గయా'.. బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ ఈ చిత్రంలో అమాయకపు పిల్లవాడిగా నటించాడు. ఈ మూవీలో జరిగిన కొన్ని సంఘటనలు అతడి నిజ జీవితంలోనూ జరిగాయట. హృతిక్ రోషన్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కోయ్.. మిల్ గయా. ఈ సినిమా వచ్చి నేటికి (ఆగస్టు 8) 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా చేస్తున్నప్పుడే దీనితో నేను బాగా కనెక్ట్ అయ్యాను. నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని ఈ సినిమా చేయలేదు. నా మనసుకు నచ్చి చేశాను. సినిమాకు సంతకం చేసేటప్పుడు రోహిత్‌గా నా పాత్ర ఎలా ఉంటుంది? దీనికోసం నేను ఏం చేయాలి? ఇలాంటివేవీ నేను ఆలోచించలేదు. తొలిసారి ఆ కథ విన్నప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ మొదలుపెట్టాక నన్ను నేను అన్వేషించుకున్నాను. ఒక నటుడిగా ఎలా ఉండాలి? ఎటువంటి సినిమాలు ఎంచుకోవాలి? ఎలాంటి కథలో భాగస్వామ్యం కావాలి? అనేది తెలుసుకున్నాను. రోహిత్ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. స్కూలుకు వెళ్లే రోజుల్లో నాకు నత్తి ఉండేది. అది చూసి అందరూ వెక్కిరించేవారు. నేనేం మాట్లాడినా ఎగతాళి చేసేవారు. సినిమాలో రోహిత్ స్కూటీని ధ్వంసం చేస్తారు. అది నా లైఫ్‌లో కూడా జరిగింది. కాకపోతే అప్పుడు నేను సైకిల్ తొక్కేవాడిని. చిన్నతనంలో అదంటే నాకు ప్రాణం. కొందరు సీనియర్స్ వచ్చి నా సైకిల్‌ను నాశనం చేశారు. చాలా బాధేసింది. రోహిత్‌లాగే నాకూ పట్టరానంత కోపం వచ్చింది. ఈ అనుభవం వల్లే సినిమాలో ఆ సీన్లో సహజంగా నటించగలిగాను. దాని తీవ్రతను అర్థం చేసుకోగలిగాను. తొలిసారి రేఖ మేడమ్‌తో నటించింది ఈ చిత్రంలోనే! ఓ సీన్లో ఆమె నా చెంప పగలగొట్టాల్సి ఉంటుంది. నిజంగా కొడితేనే ఎమోషన్స్ వాటంతటవే వస్తాయని చెప్పి మరీ కొట్టింది. చాలా గట్టిగా కొట్టింది. ఈ చెంపదెబ్బ ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని చెప్పుకొచ్చాడు హృతిక్. కాగా కోయ్.. మిల్ గయా సినిమాకు హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించి నిర్మించాడు. అతడి సోదరుడు రాజేశ్ రోషన్ సంగీతం అందించాడు. చదవండి: అనాథలా రేకుల షెడ్డులో జీవితం వెల్లదీసిన హీరోయిన్.. ప్రసాదంతో కడుపు నింపుకుని పస్తులు -
మీ పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నాయా? ఇలా చేశారంటే..
పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలై దాదాపు రెండేళ్ల వయసు నాటికి చాలావరకు కమ్యూనికేట్ చేస్తుంటారు. మూడేళ్లకు అన్ని మాటలూ వచ్చేస్తాయి. అయితే కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వినడానికి దోహదపడే వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు దోహదపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. ఆ పిల్లల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం దీనికి కారణం. ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ. ఇలా మాటలు రావడం ఆలస్యమైన సందర్భాల్లో సాధారణంగా స్కూల్లో చేర్చే ఈడు నాటికి పిల్లలు తమంతట తామే మాట్లాడతారు. ఇక కొందరిలో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలను (డిజార్డర్స్‌ను) సూచించే ఒక లక్షణం. ఉదాహరణకు వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు (ఎక్స్‌ప్రెసివ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ డిజార్డర్)... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల (గెష్చర్స్) ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే నిర్వహిస్తుంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. మరికొందరిలో భాషను నేర్చుకునే శక్తి కొంతమేరకు తక్కువగానే ఉంటుంది. వాళ్లలో మరికొన్ని కాంప్లికేషన్లూ వచ్చే అవకాశమూ ఉంటుంది. ఏం చేయాలి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంలో పూర్తి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాకపోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్‌కూ లేదా స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లిదండ్రుల భూమిక ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలో తామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతో పాటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
మాట్లాడడం నేర్పించే.. స్పీచ్ థెరపిస్ట్
విద్య నేటి కంటెంట్ జనరల్ స్టడీస్: ఎకానమీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్: జనరల్ అవేర్నెస్ పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. మనిషికి ప్రకృతి ప్రసాదించిన విలువైన వరం.. మాట. మాట్లాడడం ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేయొచ్చు. నేటి ఆధునిక సమాజంలో మాట శక్తివంతమైన సాధనంగా మారింది. తమ బుజ్జాయికి వయసు పెరుగుతున్నా మాటలు రాకపోతే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. కొందరు ఎంత వయసొచ్చినా మాట్లాడలేరు. ఇంకొందరికి మాటలు వస్తాయిగానీ, అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడలేరు. నోరు తిరగకపోవడం, నత్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందరిలాగే వీరి నోటినుంచి మాటలు రప్పించే నిపుణులే.. స్పీచ్ థెరపిస్ట్‌లు. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. స్పీచ్ థెరపీ. స్వయం ఉపాధి అవకాశాలు స్పీచ్ థెరపీ కోర్సులను పూర్తిచేసినవారికి ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్పెషల్ స్కూల్స్, ఓల్డేజ్ హోమ్‌లు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో కొలువులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉంటే స్వయంగా స్పీచ్ థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఈ సెంటర్లకు ఆదరణ లభిస్తోంది. స్పీచ్ థెరపీలో తగిన అనుభవం ఉంటే అధిక ఆదాయం ఆర్జించడానికి ఆస్కారం ఉంది. లక్షణాలు: స్పీచ్ థెరపిస్ట్‌లు అన్ని వయసుల రోగులకు ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంలో పేరు తెచ్చుకోవాలంటే శాస్త్రీయ దృక్పథం, ప్రభావవంతమైన ఇంటర్‌పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇది సేవా రంగం కాబట్టి రోగులతో వ్యవహరించేందుకు ఓర్పు, సహనం అవసరం. అర్హతలు: మనదేశంలో హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ పాథాలజీపై వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌ను పూర్తిచేసిన తర్వాత వీటిలో చేరొచ్చు. వేతనాలు: స్పీచ్ థెరపిస్ట్ ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు. తర్వాత అనుభవం, పనితీరును బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. ఈ రంగంలో ప్రొఫెషనల్స్‌కు నెలకు రూ.లక్షకుపైగానే అందుతుంది. స్పీచ్ థెరపీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ వెబ్సైట్: www.aiishmysore.in/en/index.html ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వెబ్సైట్: www.aiims.edu దేశవిదేశాల్లో అవకాశాలు శ్రీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయాలని, వైవిధ్యమైన కెరీర్‌ను ఎంపికచేసుకోవాలని భావించేవారికి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులన్నీ ప్రత్యేకమే. స్పీచ్, ఆడియాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసేందుకు వీలుంది. ఆడియాలజిస్టు, స్పీచ్ పాథాలజిస్టులకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. కొందరికి పుట్టుకతో మాటలు రాకపోతే స్పీచ్, ఆడియో థెరపీ ద్వారా సరిచేయవచ్చు. భావాల్ని వ్యక్తీకరించేందుకు వారిని సమాయత్తం చేయడమే ముఖ్యోద్దేశం. ఉద్యోగ విషయానికొస్తే ప్లేస్‌మెంట్స్ గ్యారంటీ. ఉన్నత చదువులతో కెరీర్లో ఉన్నత స్థాయికి చేరొచ్చు. -డాక్టర్ పి.హనుమంతరావు, చైర్మన్, స్వీకార్-ఉపకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్