'కోయ్.. మిల్ గయా'.. బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ ఈ చిత్రంలో అమాయకపు పిల్లవాడిగా నటించాడు. ఈ మూవీలో జరిగిన కొన్ని సంఘటనలు అతడి నిజ జీవితంలోనూ జరిగాయట. హృతిక్ రోషన్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కోయ్.. మిల్ గయా. ఈ సినిమా వచ్చి నేటికి (ఆగస్టు 8) 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా చేస్తున్నప్పుడే దీనితో నేను బాగా కనెక్ట్ అయ్యాను.
నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని ఈ సినిమా చేయలేదు. నా మనసుకు నచ్చి చేశాను. సినిమాకు సంతకం చేసేటప్పుడు రోహిత్‌గా నా పాత్ర ఎలా ఉంటుంది? దీనికోసం నేను ఏం చేయాలి? ఇలాంటివేవీ నేను ఆలోచించలేదు. తొలిసారి ఆ కథ విన్నప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ మొదలుపెట్టాక నన్ను నేను అన్వేషించుకున్నాను. ఒక నటుడిగా ఎలా ఉండాలి? ఎటువంటి సినిమాలు ఎంచుకోవాలి? ఎలాంటి కథలో భాగస్వామ్యం కావాలి? అనేది తెలుసుకున్నాను.
రోహిత్ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. స్కూలుకు వెళ్లే రోజుల్లో నాకు నత్తి ఉండేది. అది చూసి అందరూ వెక్కిరించేవారు. నేనేం మాట్లాడినా ఎగతాళి చేసేవారు. సినిమాలో రోహిత్ స్కూటీని ధ్వంసం చేస్తారు. అది నా లైఫ్‌లో కూడా జరిగింది. కాకపోతే అప్పుడు నేను సైకిల్ తొక్కేవాడిని. చిన్నతనంలో అదంటే నాకు ప్రాణం. కొందరు సీనియర్స్ వచ్చి నా సైకిల్‌ను నాశనం చేశారు. చాలా బాధేసింది. రోహిత్‌లాగే నాకూ పట్టరానంత కోపం వచ్చింది. ఈ అనుభవం వల్లే సినిమాలో ఆ సీన్‌లో సహజంగా నటించగలిగాను. దాని తీవ్రతను అర్థం చేసుకోగలిగాను.
తొలిసారి రేఖ మేడమ్‌తో నటించింది ఈ చిత్రంలోనే! ఓ సీన్‌లో ఆమె నా చెంప పగలగొట్టాల్సి ఉంటుంది. నిజంగా కొడితేనే ఎమోషన్స్ వాటంతటవే వస్తాయని చెప్పి మరీ కొట్టింది. చాలా గట్టిగా కొట్టింది. ఈ చెంపదెబ్బ ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని చెప్పుకొచ్చాడు హృతిక్. కాగా కోయ్.. మిల్ గయా సినిమాకు హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించి నిర్మించాడు. అతడి సోదరుడు రాజేశ్ రోషన్ సంగీతం అందించాడు.
చదవండి: అనాథలా రేకుల షెడ్డులో జీవితం వెల్లదీసిన హీరోయిన్.. ప్రసాదంతో కడుపు నింపుకుని పస్తులు
Comments
Please login to add a commentAdd a comment