అక్కడకంటే.. ఇక్కడే తక్కువ
సాక్షి, అమరావతి: తెలంగాణతో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నమ్మించబోయిన ‘ఈనాడు’ అడ్డంగా దొరికిపోయింది. మన రాష్ట్రంలో స్పినింగ్ మిల్లులకు తెలంగాణకంటే తక్కువకు విద్యుత్ సరఫరా చేస్తున్నా, అక్కడే తక్కువంటూ ఓ తఫ్పుడు కథనం ఇచ్చింది. ‘చిక్కుల్లో దారం.. సర్కారు చోద్యం’ శీర్షికన సోమవారం ఈనాడు ప్రచురించిన కథనం పచ్చి అబద్దమని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె. పద్మాజనార్ధనరెడ్డి చెప్పారు. ‘స్పిన్నింగ్ మిల్లులకు గతంలో యూనిట్ రేటు రూ.5.85 పైసలు ఉండేది. ఇప్పుడూ అదే రేటు వసూలు చేస్తున్నాం.
యూనిట్‌కి రూ.8.35 వసూలు చేస్తున్నారని ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం. ఇది ఈనాడు పత్రిక అవగాహన లేమికి నిదర్శనం. ఇలాంటి అసత్య కథనాలు విద్యుత్ సంస్థలు, పారిశ్రామిక వినియోగదారుల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తాయి. నిజానికి రాష్ట్రంలో యూనిట్ రేటు రూ.5.85 పైసలు ఉండగా తెలంగాణలో యూనిట్‌కు రూ.7.15 పైసలు వసూలు చేస్తున్నారు. ఇది తెలంగాణకంటే తక్కువకు సరఫరా చేస్తున్నట్లా? ఎక్కువకా? ఇలా తప్పుడు కథనాలతో ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? కేవలం స్పిన్నింగ్ మిల్లులకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఆ పరిశ్రమలపై ఏమాత్రం భారం లేకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.5.85 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది.
అలాగే విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలు, ఆదేశాల మేరకు వసూలు చేస్తాము. స్పిన్నింగ్ మిల్లులు మూతపడటానికి విద్యుత్ చార్జీల భారమే కారణమనడం కూడా సత్యదూరం. వాస్తవానికి ముడిసరుకు అందుబాటులో లేకపోవడం, మార్కెట్ దెబ్బతినడం, ఇతర దేశాల్లో యుద్ధ, అనిశ్చితి పరిస్థితులు, ఆర్ధిక ఇబ్బందులు వంటి కారణాలు స్పిన్నింగ్ పరిశ్రమల మనుగడపై ప్రభావం చూపి ఉండవచ్చు. దీనికి కరెంటు బిల్లులను ముడిపెట్టి రామోజీ తన పత్రికలో అర్ధం లేని కథనం ప్రచురించారు’ అని ఆయన తెలిపారు.