క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
లింగపాలెం : క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర యోగా, క్రీడల సమన్వయకర్త పేరం రవీంద్రనాథ్ తెలిపారు. లింగపాలెం మండలం శింగగూడెంలో గురువారం ప్రారంభమైన చింతలపూడి జోనల్‌స్థాయి బాలికల క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాల ఏర్పాటుకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో 175 వికాస కేంద్రాలకు గాను నేటికి 70 నియోజకవర్గాల్లో వీటిని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రాంతీయ క్రీడా అకాడమీలను రాష్ట్రంలో «మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్రీడా నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు.
గతంలో క్రీడలకు నిధులటూ ఉండేవికాదన్నారు. నేడు క్రీడల అభివృద్ధికి ప్రతి హైస్కూల్‌కు ఆర్ఎంఎస్ నిధుల కింద రూ.10 వేలు, సర్వశిక్ష అభియాన్ నిధుల కింద రూ.5 వేలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వ్యాయామంపై విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా కెనడా సహకారంతో ఏపీలో కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ 820 విద్యార్థులకు ఒక పీఈటీ ఉంటే.. ఇకపై 400 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండేలా త్వరలో నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల మంది పీఈటీలు ఉన్నారని మరో 3 వేల పోస్టులు భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. గతంలో మండలానికి ఒక పీడీ పోస్టు ఉండేదన్నారు. రెండు రోజులక్రితం 1,200 మంది పీఈటీలకు పదోన్నతి కల్పించి పీడీలుగా నియమించినట్టు చెప్పారు. ప్రతి హైస్కూల్లో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి పరిచేందుకు ఉపాధి హామీ పథకంలో రూ.5 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. విద్యార్థుల వ్యాయమ బాధ్యతలు గతంలో పీఈటీలకు మాత్రమే ఉండేదని, నేడు పాఠశాల హెచ్ఎంలకు కూడా బాధ్యత కల్పించామన్నారు. ప్రతి విద్యార్థికి 6 రకాల క్రీడా నైపుణ్య పరీక్షలు నిర్వహించి వివరాలను ఆధార్ కార్డు నెంబర్‌తో అన్లైన్ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన క్రీడాకారులకు పరీక్షల్లో 6 శాతం మార్కులు కలుపుతామన్నారు. అంతేకాకుండా ఈ క్రీడాకారులకు స్కాలషిప్ ఇవ్వనున్నట్టు రవీంద్ర వివరించారు.