sportsmens
-
ఆడేద్దాం అదిరేలా
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశంలోనే అతి పెద్ద మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తో క్రీడోత్సాహం ఉప్పొంగనుంది. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు మొదలవుతాయి. ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి ప్రభుత్వం క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగస్వాములను చేసింది. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. ప్రతి రోజు క్రీడోదయమే.. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాలను పోటీలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు మ్యాచ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించనున్నారు. 1.22 కోట్ల రిజిస్ట్రేషన్లు ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో దేహ దారుఢ్యం, శారీరక వ్యాయామం విలువను చాటిచెప్పడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తోంది. 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలను క్రీడల వైపు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే దాదాపు 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లతో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చరిత్ర సృష్టిస్తోంది. ఇందులో 34.19 లక్షల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. వీరిలో పది లక్షల మందికిపైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. కాంపిటీటివ్ విభాగంలోని ఐదు ప్రధాన క్రీడాంశాల్లో క్రికెట్లో అత్యధికంగా 13 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నాన్ కాంపిటీటివ్ విభాగంలోని మారథాన్, యోగ, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది (కాంపిటీటివ్ విభాగంలో ఉన్నవారితో కలిపి) ఆసక్తి చూపించారు. 5.09 లక్షల కిట్ల పంపిణీ గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.119.19 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారు. సుమారు రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. దాదాపు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లను ఇస్తున్నారు. ప్రొఫెషనల్స్ గుర్తింపు.. నియోజకవర్గ స్థాయిలో ఐదు రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్ హంట్ చేయనున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం వారికి వివిధ స్థాయిలో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మకం ఈవెంట్లో అవకాశం కల్పించే దృక్పథంతో పోటీలను నిర్వహిస్తోంది. ఏర్పాట్లను పరిశీలించిన యంత్రాంగం క్రీడోత్సవాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరు జిల్లా నల్లపాడు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సి.ప్రద్యుమ్న, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్–కలెక్టర్ ప్రకార్ జైన్, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆటలు పోటీల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. క్రీడాకారుల ఉజ్వల భవిత కోసం.. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఉజ్వల భవిత కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంతటి మహా క్రీడాయజ్ఞాన్ని తలపెట్టారు. ఇది క్రీడా చరిత్రలో అతిపెద్ద మైలురాయి. ఒకే ఈవెంట్లో 34 లక్షల మంది క్రీడాకారులు పోటీపడటం ఎప్పుడూ జరగలేదు. ‘ఆడుదాం ఆంధ్ర’ను మొక్కుబడిగా కాకుండా ప్రొఫెషనల్స్ గుర్తించి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నాం. జగనన్న ఏదైనా చెబితే కచ్చితంగా చేస్తారు. దేశానికి పతకాలు అందించే క్రీడా కార్ఖానాగా ఏపీని మారుస్తారు. 21 మంది రాష్ట్రస్థాయి బ్రాండ్ అంబాసిడర్లు, 345 మంది జిల్లా స్థాయి క్రీడాకారులు ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్నారు. – ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతిక యువజన శాఖ మంత్రి -
రూ. 5,900 కోట్లకు స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌లు
ముంబై: క్రీడలు, క్రీడాకారులకు లభించే స్పాన్సర్‌షిప్‌లు గతేడాది (2022) రెట్టింపయ్యాయి. రూ. 5,907 కోట్లకు చేరాయి. ఇందులో సింహభాగం వాటా 85 శాతాన్ని క్రికెట్టే దక్కించుకుంది. మీడియా ఏజెన్సీ గ్రూప్ఎం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో స్పోర్ట్స్ సెలబ్రిటీలు రూ. 729 కోట్ల మేర స్పాన్సర్‌షిప్‌లు పొందారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అత్యధికంగా అందుకున్న టాప్ క్రీడాకారుల్లో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్, నీరజ్ చోప్రాలతో పాటు పీవీ సింధు కూడా ఉన్నారు. గతేడాది మొత్తం మీద క్రీడలపై ఖర్చులు రూ. 9,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్లకు చేరినట్లు గ్రూప్ఎం తెలిపింది. ‘2021తో పోలిస్తే భారత్‌లో క్రీడల స్పాన్సర్‌షిప్‌లు అసాధారణంగా 105 శాతం మేర వృద్ధి చెందాయి‘ అని పేర్కొంది. ఐపీఎల్ దన్ను.. ► ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం, కొత్తగా మరో రెండు టీమ్‌లు వచ్చి చేరడం, ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు మారథాన్లు, కామన్వెల్త్ గేమ్స్ మొదలైనవి 2022లో క్రీడలపై చేసే ఖర్చు పెరగడానికి తోడ్పడ్డాయి. ► గతేడాది వచ్చిన స్పాన్సర్‌షిప్‌లలో క్రికెట్ 85% దక్కించుకోగా.. ఫుట్‌బాల్, కబడ్డీ మొదలైనవి 15 శాతంతో సరిపెట్టుకున్నాయి. కొత్త క్రీడలకు స్పాన్సర్‌షిప్‌లు భారీగా పెరుగుతున్నాయి. ► విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తలో 30 పైగా బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ తదితరులు కూడా పుంజుకుంటున్నారు. ► కొన్నాళ్లుగా క్రీడలపై వ్యయాలు వార్షికంగా సగటున 14 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. ఎకానమీలో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న రంగాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోంది. ► 2023 సీజన్ తర్వాత ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ల రెన్యువల్, బీసీసీఐ హోమ్ సిరీస్ టైటిల్, టీమ్ ఇండియా స్పాన్సర్షిప్, బీసీసీఐ హోమ్ సిరీస్ మీడియా హక్కులు, మార్చిలో జరిగిన డబ్ల్యూపీఎల్ ప్రారంభ సీజన్ మొదలైన వాటితో భారత్‌లో స్పాన్సర్‌షిప్‌లు ఈ ఏడాది తారా స్థాయికి చేరనున్నాయి. -
క్రీడాకారులు జాతీయ పతాకంతో సమానం
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులు జాతీయ పతాకంతో సమానంగా సరితూగుతారని, వారికి ఎనలేని ఆత్మాభిమానం ఉంటుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 9వ ఏపీ రాష్ట్ర సీనియర్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2022 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీ ఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ క్రీడాపోటీల నిర్వహణకు ప్రభుత్వాలతోపాటు దాతలు కూడా సహకరిస్తే మరింత విజయవంతం అవుతాయన్నారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కలిదిండి నరసింహరాజు, కన్వీనర్ వెంకటరామరాజు, సీఈవో సి.వెంకటేషులు, నిర్వహణ కమిటీ సభ్యులు ఎం.వి.రమణ, హరిధరరావు, లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకుడు చౌదరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆందోళన.. అవార్డులు తిరిగిచ్చేస్తాం..
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయంలో నూతన చట్టాలను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్ నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆరు రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. ఇంకా ఆందోళనను ఉధృతం చేశారు. తాజాగా రైతుల ఆందోళనలకు పంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు కోచ్ లు మద్దతు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమకు వచ్చిన అవార్డులు,మెడల్స్ అన్నింటినీ తిరిగిచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన క్రీడాకారులలో రెజ్లర్ మరియు పద్మశ్రీ అవార్డీ కర్తార్ సింగ్, అర్జున అవార్డ్ గ్రహీత మరియు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్, అర్జున అవార్డ్ గ్రహీత హాకీ ఆటగాడు గుర్మైల్ సింగ్, ఒలంపిక్ హాకీ ఆటగాడు, అర్జున అవార్డ్ గ్రహీత సజ్జన్ చీమా, గోల్డెన్ గర్ల్ గా పిలువబడే మాజీ ఇండియన్ హాకీ కెప్టెన్ రజ్బిట్ కౌర్ కూడా ఉన్నారు. మంగళవారం జలంధర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఈ క్రీడాకారులందరూ డిమాండ్ చేశారు. మరోవైపు, రైతుల ఆందోళనలు విరమించేలా ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో మంగళవారం 36మంది రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మూడవ రౌండ్ చర్చలు ప్రారంభించింది. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పంజాబ్ కి చెందిన రైతులు, హర్యానా నుంచి ఇద్దరు రైతు సంఘాల ప్రతినిధులు, ఏఐకేఎస్ సీసీ లీడర్ యోగేంద్ర యాదవ్, ఉత్తరప్రదేశ్ కి చెందిన మరో నాయకుడు పాల్గొన్నారు. రైతులు ఆందోళనలను విరమింపచేసేలా తగిన వ్యూహాన్ని సిద్దం చేసేందుకు ఇవాళ ఉదయం టాప్ బీజేపీ లీడర్లు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువరు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేవమై చర్చించిన విషయం తెలిసిందే. -
తైక్వాండోలో తళుక్కు
వారికి రెండు కాళ్లు.. రెండు ఆయుధాల లాంటివి. రెప్పపాటు సమయంలో కాళ్లను వేగంగా తిప్పుతూ ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు వినూత్న రీతిలో నైపుణ్యం ప్రదర్శిస్తుంటారు. ఆత్మవిశ్వాసంతో పోటీల్లో నెగ్గుతూ పతకాలు సాధిస్తుంటారు. బాక్సింగ్ తరహాలో కనిపించే తైక్వాండో క్రీడలో రాణిస్తూ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతున్న విద్యార్థులు, యువ క్రీడాకారులపై కథనం. – వరంగల్ స్పోర్ట్స్ ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతోందనేది ఒకప్పటి మాట. అయితే కరాటేతోపాటు తైక్వాండోతో కూడా శత్రువుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెబుతున్నారు ఓరుగల్లుకు చెందిన పలువురు విద్యార్థులు, క్రీడాకారులు. చేతులను తక్కువగా ఉపయోగిస్తూ కాళ్లతోనే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే సాహస క్రీడగా పేరొందిన తైక్వాండోలో వారు రాణిస్తూ జిల్లాకు పేరు తీసుకొస్తున్నారు. వివరాల్లోకి వెళితే..క్రీస్తు పూర్వం 37వ శతాబ్దంలో కొరియాలోని కుగుర్మో రాజవంశీయులు తైక్వాండో క్రీడకు రూపకల్పన చేసినట్లు చరిత్ర చెబుతోంది. తర్వాత సిల్లా వంశీయులు ఈ క్రీడ అభివృద్ధికి పాటుపడ్డారు. తైక్వాండోలో 90 శాతం కాళ్లు, 10 శాతం చేతులను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి ఆత్మరక్షణ పొందేందుకు నేర్చుకున్న ఆర్మీ అధికారులకు కొరియా దేశం ప్రోత్సాహం అందించింది. 1980లో ఇండియాలో గుర్తింపు 1973లో మొదటిసారిగా తైక్వాండోను జిమ్మి ఆర్ జగిత్యానిగామ అనే మాస్టర్ వియత్నాం నుంచి వచ్చి భారతదేశానికి Sపరిచయం చేశారు. 1980లో భారత ప్రభుత్వం తైక్వాండోకు అధికారికంగా గుర్తింపు ఇచ్చింది. 1985లో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్‌లో గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ప్రతి ఏటా ఎస్జీఎఫ్ఐ, ఆర్జీకేఏ, యూనివర్సిటీ స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆట విధానం 12 మీటర్ల దీర్ఘచతురస్రాకార బోట్లో తైక్వాండో పోటీలను నిర్వహిస్తుంటారు. జాతీయస్థాయి పోటీల్లో మూడు నిమిషాల కాలవ్యవధి.. మూడు రౌండ్లు, రాష్ట్రస్థాయి పోటీల్లో మూడు నిమిషాలు.. రెండు రౌండ్లు, జిల్లాస్థాయి పోటీల్లో రెండు నిమిషాలు.. రెండు రౌండ్లు నిర్వహిస్తుంటారు. మ్యాచ్‌లో ముఖంపై తగిలిన కిక్కు మూడు పాయింట్లు, చాతిపై తగిలితే ఒక పాయింట్, రిబ్స్, పొట్టపై తగిలితే ఒక పాయింట్ ఇస్తారు. అలాగే ప్రత్యేకమైన కొన్ని కిక్‌లపై మూడు లేదా రెండు పాయింట్లు ఇస్తారు. తైక్వాండో పోటీలో ప్రత్యర్థిని గట్టిగా పట్టుకోవడం, నెట్టివేయడం, వెనకవైపు కిక్ చేయడం, ఎరీనా దాటడం లాంటివి చేస్తే మైనస్ పాయింట్లు ఇస్తారు. అఖిల్.. అదర హో యువ క్రీడాకారుడు అఖిల్ తైక్వాండోలో అదరగొడుతున్నాడు. కోచ్‌ల పర్యవేక్షణ లో కఠోర శిక్షణ పొందుతున్న ఆయన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు. 2014లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్–17లో బ్రాంజ్, 2015లో హైదరాబాద్‌లో జరిగిన అండర్–19 రాష్ట్ర స్థాయి పోటీల్లో సిల్వర్, దారువాడ్లో జరిగిన రీజినల్ పోటీల్లో కన్సొలేషన్ బహుమతి పొందాడు. వీటితోపాటు ఇప్పటివరకు మూడు రాష్ట్రస్థాయి, రెండు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. పవన్.. మెరిసెన్ మానుకోటకు చెందిన పవన్ తైక్వాండో లో ప్రతిభ కనబరుస్తున్నాడు. పవన్ 2014లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–17 జాతీయస్థాయి పోటీల్లో, 2015లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటాడు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరి గిన అండర్–19 రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గతంలో ౖహె దరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో వెండి, 2014లో ప్రకాశంలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో వెండి పతకం సాధించాడు. సత్తాచాటుతున్న సాత్విక తొర్రూరుకు చెందిన సీహెచ్. సాత్వికారెడ్డి తైక్వాండోలో మూడేళ్లుగా శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది. 2013లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీ ల్లో గోల్డ్ మెడల్, 2015లో పంజాబ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్, దారువాడ్లో జరిగిన జాతీయస్థాయిలో బహుమతి సాధించింది. 2012లో కేరళలో పైకా నిర్వహించిన జాతీయస్థాయి, ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో 2013లో జరిగిన జాతీయస్థాయి అండర్–17, 2014లో మహబూబ్‌నగర్ లో జరిగిన అండర్–17 పైకా జాతీయస్థా యి, మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్–19 జాతీయస్థాయి, 2015లో మహారాష్ట్రలో జరిగిన ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి పోటీలకు హాజరైంది. -
సాఫ్ట్‌బాల్ టోర్నీకి జిల్లా క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: పంజాబ్ రాష్ట్రం జలందర్‌లో వచ్చేనెల 6 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీకి జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలకృçష్ణ (రాచాల), విజయ్ (కొత్లాబాద్), హకీం (మహబూబ్‌నగర్), అబూబకర్ (జానంపేట)లు ఇటీవలే నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన అంతర్జిల్లా సాఫ్ట్‌బాల్ టోర్నీలో మెరుగైన ప్రతిభ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నేటి నుంచి వచ్చేనెల 4 వరకు జరిగే కోచింగ్ క్యాంప్‌లో పాల్గొననున్నారు. వీరిని సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అభినందించారు. జాతీయస్థాయి టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భవిత కళాశాల డైరెక్టర్ విద్యాసాగర్, కోచ్ సాధిక్ అలీ, పీఈటీ నాగరాజు, సీనియర్ క్రీడాకారుడు సర్దార్ పాల్గొన్నారు.