spring carnival
-
ప్రతిష్టాత్మక వరంగల్ నిట్ లో పండుగకు వేళాయే
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులచే నిర్వాహకులుగా మూడు రోజుల వసంతోత్సవ సంబురం, సంస్కృతి సంప్రదాయాలను పంచుకునే వేదికగా నిలుస్తున్న స్ప్రింగ్ స్ప్రీ–23 ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. నిత్యం విద్యతో కుస్తీ పడుతూ ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న నిట్ విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకుంటూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌గా ఏర్పాటు చేసుకుని మూడు రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 20వేల మంది విద్యార్థులు ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చ రల్ ఫెస్ట్గా నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ నిలుస్తుంది. ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో.. నిట్ వరంగల్ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న స్ప్రింగ్‌స్ప్రీ వసంతోత్సవ వేడుకలకు ప్రత్యేక థీంను రూపొందిస్తారు. ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ–23కి కళాధ్వనిగా నామకరణం చేశారు. 2019లో కళాక్షేత్ర, 2020లో మితియాస్, 2022లో సృష్టి, 2023లో కళాధ్వనిగా నామకరణం చేశారు. 55కు పైగా ఈవెంట్స్.. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీలో 55కు పైగా ఈవెంట్స్‌తో అలరించనుంది. తొలిరోజు 7న టాలీవుడ్ నైట్ పేరిట టాలీవుడ్ సింగర్స్ నిట్ మైదానంలో అలరించనున్నారు. రెండో రోజు 8న డీజే నైట్, సన్‌బర్న్ పేరిట డీజేలు వివిధ రకాల పాటలతో అలరించనున్నారు, మూడో రోజు 9న బాలీవుడ్ నైట్ పేరిట బాలీవుడ్ సింగర్స్ ఉర్రూతలూగించనున్నారు. వీటితో పాటు మూడురోజుల పాటు ప్రొ షోలు, స్పాట్ లైట్స్, స్యాండ్ ఆర్ట్, సైలెంట్ డీజేస్, మాస్టర్ చెఫ్, జుంబాడ్యాన్స్, కొరియో నైట్, వార్ ఆఫ్ డీజెస్, ఐడల్, అల్యూర్లతో వసంతోత్సవం కలర్ ఫుల్‌గా సాగనుంది. ప్రతిష్టాత్మకంగా స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని నిట్ వరంగల్‌లో నిర్వహించనున్న మూడు రోజుల స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిని ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. బుధవారం నిట్‌లోని సుభాష్‌చంద్రబోస్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు 200 మంది విద్యార్థులు నిట్‌లోని వివిధ క్లబ్స్‌తో మమేకమై కోర్టీంలుగా ఏర్పడి ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ హీరాలాల్, కోర్ టీం వంశీ కిషార్, అజయ్‌కుమార్, పీయూష్‌కుమార్, సాయిగురునాథ్ పాల్గొన్నారు. నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 6న ముఖ్యఅతిథిగా పాల్గొని స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకలను నిట్ మైదానంలో ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఇప్పటికే క్రేజ్ మొదలైంది. స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లను నిట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్లతో అందజేస్తున్నారు. -
వైభవోపేతంగా వసంతోత్సవం
– అశ్వవాహనంపై ప్రహ్లాదవరదుడు అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిలేశుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు సోమవారం అశ్వవాహన ఉత్సవంతో ముగిశాయి. సోమవారం తెల్లవారు జామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరద స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దివ్య దర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాదవరదస్వాములను వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచి వేద పండితులు స్వామి, అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో విహరింపజేశారు. రాత్రి ప్రహ్లాదవరద స్వామి అశ్వవాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వసంతోత్సవంలో స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
వసంతోత్సవం...తన్నుల సేవ
- చిన్నహోతూరులో ఆకట్టుకున్న వేడుక ఆస్పరి : చిన్నహోతూరు గ్రామంలో గురువారం పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం.. కుడుములు ఆట, తన్నుల సేవ, వసంతోత్సవం వైభవంగా జరిగాయి. సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన పెద్దలు ఆడవేషంలో ఉన్న వ్యక్తిని శాంతింప జేస్తూ , ఆటు ఇటు తిప్పుతూ బుక్కు పిండిని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. ఆతరువాత ఇరువర్గాల వారు కుడుములతో ఆడుకున్నారు. ఇరువర్గాల పెద్దలు పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. అనంతరం పార్వతీ, పరమేశ్వరుల ఉత్సవ విగ్రహలను మేళతాళాలతో ఊరేగించారు. పెళ్లి సమయంలో అలిగిన పార్వతీ దేవిని శాంతింప జేయడానికి పరమేశ్వరునిపై కుడుములు వేసి అవమానించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఆ తరువాత దేవాలయం దగ్గర వీరభద్ర స్వామి అవతారంలో వున్న పూజారి తలపై తట్ట పెట్టుకుని, త్రిశూలం చేత పట్టుకుని కేకలు వేసుకుంటు భక్తులను తన్నుతూ తిరగడం ఆకట్టుకుంది. ఆయన తన్ను కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం ఉగ్రుడైన వీరభద్ర స్వామి అవతారిని గ్రామస్తులు మిరప కాయల పొగబెట్టి శాంతింపజేశారు. పార్వతీ, పరమేశ్వరుల పెళ్లి చేసే విషయంలో విఫలమయ్యారని వీరభద్ర స్వామి ఉగ్రుడై గ్రామ పెద్దలను ఇలా తన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామన్నారు. గ్రామస్తులు ఆనందోత్సవాల మధ్య వసంతోత్సవాన్ని జరుపుకున్నారు. గ్రామంలో అన్ని వర్గాల వారికి సంబంధించి ఐదు పెద్ద రంగుల గుంతలు ఉన్నాయి. వీటిలో గులాబీ రంగును కలిపి.. ఒక కడవతో దేవాలయానికి తీసుకెళ్లి సిద్ధరామేశ్వర స్వామికి పూజలు చేశారు. ఇక రంగుల వేసుకోవడం దేవాలయం నుంచి మొదలు పెట్టారు. ఆలయ నిర్వాహకులు మంజునాథ్‌గౌడ్, వీరభద్రగౌడ్, సర్పంచ్ మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు మారెప్ప, గ్రామ పెద్దలు వరదరాజులు, నారాయణ, బసవరాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
స్ప్రింగ్ కార్నివాల్
నగరంలోని షాపింగ్ ప్రియులకు ఓ సరికొత్త అనుభూతినిచ్చింది బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం నిర్వహించిన ‘స్ప్రింగ్ కార్నివాల్’. ఫుడ్, మ్యూజిక్, వస్త్రాలు, యాక్సెసరీస్, జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ వెరైటీలెన్నో కొలువుదీరిన ఈ ఫ్లీ మార్కెట్ విశేషంగా ఆకట్టుకుంది. నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నచ్చిన ఐటెమ్స్‌ను ముచ్చటగా కొనుక్కున్నారు.