భక్తులను తన్నుతున్న వీరభద్ర స్వామి అవతారి
- చిన్నహోతూరులో ఆకట్టుకున్న వేడుక
ఆస్పరి : చిన్నహోతూరు గ్రామంలో గురువారం పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం.. కుడుములు ఆట, తన్నుల సేవ, వసంతోత్సవం వైభవంగా జరిగాయి. సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన పెద్దలు ఆడవేషంలో ఉన్న వ్యక్తిని శాంతింప జేస్తూ , ఆటు ఇటు తిప్పుతూ బుక్కు పిండిని ఒకరిపై ఒకరు వేసుకున్నారు. ఆతరువాత ఇరువర్గాల వారు కుడుములతో ఆడుకున్నారు. ఇరువర్గాల పెద్దలు పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. అనంతరం పార్వతీ, పరమేశ్వరుల ఉత్సవ విగ్రహలను మేళతాళాలతో ఊరేగించారు. పెళ్లి సమయంలో అలిగిన పార్వతీ దేవిని శాంతింప జేయడానికి పరమేశ్వరునిపై కుడుములు వేసి అవమానించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు.
ఆ తరువాత దేవాలయం దగ్గర వీరభద్ర స్వామి అవతారంలో వున్న పూజారి తలపై తట్ట పెట్టుకుని, త్రిశూలం చేత పట్టుకుని కేకలు వేసుకుంటు భక్తులను తన్నుతూ తిరగడం ఆకట్టుకుంది. ఆయన తన్ను కోసం భక్తులు ఎగబడ్డారు. అనంతరం ఉగ్రుడైన వీరభద్ర స్వామి అవతారిని గ్రామస్తులు మిరప కాయల పొగబెట్టి శాంతింపజేశారు. పార్వతీ, పరమేశ్వరుల పెళ్లి చేసే విషయంలో విఫలమయ్యారని వీరభద్ర స్వామి ఉగ్రుడై గ్రామ పెద్దలను ఇలా తన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నామన్నారు. గ్రామస్తులు ఆనందోత్సవాల మధ్య వసంతోత్సవాన్ని జరుపుకున్నారు.
గ్రామంలో అన్ని వర్గాల వారికి సంబంధించి ఐదు పెద్ద రంగుల గుంతలు ఉన్నాయి. వీటిలో గులాబీ రంగును కలిపి.. ఒక కడవతో దేవాలయానికి తీసుకెళ్లి సిద్ధరామేశ్వర స్వామికి పూజలు చేశారు. ఇక రంగుల వేసుకోవడం దేవాలయం నుంచి మొదలు పెట్టారు. ఆలయ నిర్వాహకులు మంజునాథ్‌గౌడ్, వీరభద్రగౌడ్, సర్పంచ్ మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు మారెప్ప, గ్రామ పెద్దలు వరదరాజులు, నారాయణ, బసవరాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.