శ్రమకు సలామ్
సగటు నగరవాసికి సిటీలోని రూట్లు ఎంత క్లియర్‌గా తెలుసో.. ఏ మూలన ఏ గుంత ఉందో కూడా అంతే బాగా తెలుసు. గతుకుల దారిలో ముక్కుతూ మూల్గుతూ జర్నీ చేస్తాడే తప్ప.. వాటిని బాగుచే సే బాధ్యత ప్రభుత్వానిదనుకుంటాడు. కానీ, మన దారిని మనమే బాగు చేయాలనే ఆలోచన వచ్చిన వ్యక్తి ఒకరున్నారు.
సిటీలో ఆయన వెళ్లే దారిలో గుంత కనిపిస్తే చాలు దాన్ని పూడ్చకుండా కదలరు. ఆరుపదుల వయసు దాటిన ఆ పెద్దాయన పేరు బాలగంగాధర తిలక్. రైల్వే ఉద్యోగిగా రిటైర్ అయిన ఆయన గుంతలు పూడ్చడం కోసం ప్రత్యేకంగా ‘శ్రమదాన్ ఫౌండేషన్’ను ప్రారంభించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లిపోతున్నారు. దూరదేశానికి వె ళ్తున్నా.. తన ఫౌండేషన్ ద్వారా గుంతల పూడ్చివేత కార్యక్రమం కొనసాగుతుందంటున్న బాలగంగాధర తిలక్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది.
నేను హైదర్ షా కోట గ్రామంలో ఉండేవాడిని. 2010 జనవరి 18న ఉదయం ఆఫీస్‌కు బయల్దేరాను. ముందురోజు రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా బురదమయమైంది. గుంతలో నీరు మడుగులు కట్టింది. ఎంత జాగ్రత్తగా నడిపినా సరే కారు చక్రం మడుగులో పడడం.. బురదనీరు స్కూల్‌కు వెళ్తున్న పిల్లలపై చిందడం జరిగిపోయాయి. అప్పుడు ఆందోళనగా కారు ఆపా. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలనుకున్నా. అప్పటికే వారు ఓ రకంగా చూసిన చూపులు నన్ను కదిలించాయి. మర్నాడే ఆరు ట్రక్కుల మట్టితో శ్రామికులను పెట్టి గుంతలను పూడ్చా. అదే పిల్లలు వచ్చి కృతజ్ఞతలు తెలపడం ఎప్పటికీ మరచిపోలేను.
మరెన్నో ఘటనలు..
ఇవే కాదు గుంతలు పడి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద మరణాలు నన్ను మరింత ఆలోచింపజేశాయి. ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా ఈ గోతులను ఎవరైనా పూడ్చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగేవి కాదు కదా అనిపించింది. అప్పటి నుంచి రోడ్డు మీద ఎక్కడ గొయ్యి కనిపించినా పూడ్చటమే పనిగా పెట్టుకున్నాను. నా కారు డిక్కీలో చిన్న పలుగు, పార, చేతికి వేసుకోవడానికి గ్లవుజ్‌లు సిద్ధంగా ఉంటాయి.
1,070 గుంతలు..
గతంలో హైదరాబాద్ రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలు కనిపించేవి. రెండు నెలల క్రితం అనారోగ్యం కారణంగా అమెరికాలో స్పిరిట్ కమ్యూనికేషన్స్‌లో సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నా కుమారుడు రవికిరణ్ వద్దకు వెళ్లా. రెండు నెలల కిందట సిటీకి వచ్చాను. నేను తిరిగి అమెరికా రానేమోనని అనుకున్న నా కుమారుడు కూడా నాతోపాటే ఇక్కడికి వచ్చాడు. అయితే రోడ్లపై గుంతలు చూడగానే మళ్లీ పలుగు, పారా పట్టుకున్నాను. జేఎన్టీయూ రోడ్డు వద్ద గొయ్యిల్ని, గచ్చిబౌలి ఫ్లైఓవర్ గుంత పూడ్చాను. దీంతో నేను పూడ్చిన గుంతల సంఖ్య 1,070కి చేరింది. ఇప్పుడు నేను నా కొడుకుతో కలసి మళ్లీ యూఎస్ వెళ్తున్నా.
ఇంతటితో ఆగొద్దు..
నేనిక్కడ లేకున్నా, నా ఫౌండేషన్ తరఫున వాలంటీర్లు ఎక్కడ గుంతలు కనిపించినా శ్రమదానం చేస్తారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మా కుటుంబసభ్యులు నన్నీ పని చేయవద్దంటున్నారు. అయితే ఈ పనిని మాత్రం ఫౌండేషన్ కొనసాగించేలా ప్రణాళిక రూపొందించాం. గుంతలు లేని హైదరాబాద్‌ను చూడాలనేదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందనుకుంటున్నా. దీనికి జీహెచ్ఎంసీ సహకారం ఉండాలి.
బాలగంగాధర తిలక్