sravana month
-
గండి జనసంద్రం
చక్రాయపేట : ప్రసిద్ధి గాంచిన శ్రీ గండి వీరాంజనేయస్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణ మాస ఆఖరి శనివారం కావడంతో జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి పాపాఘ్ని నదిలో వాటర్ షవర్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి క్యూలైన్లలో నిలుచున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్‌లు ఆంజనేయస్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా తమలపాకులు, పూలతో అలంకరించారు. త్రికాల ఆరాధన, అభిషేకం, మహా నైవేద్యం, కుంకుమార్చన, ఆకు పూజ తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, దేవస్థాన చైర్మన్ వి.రాజారావులతోపాటు పాలక మండలి సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటె వాహనంపై హనుమంతుడిని కొలువు దీర్చి క్షేత్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరుకు చెందిన చప్పిడి నాగార్జునరెడ్డి, గండి అంజన్న స్వామి శాశ్వత ఉభయదారులు రూ.1.50 లక్షలను ఉత్సవ విగ్రహానికి పూలమాలలు, బాణా సంచా, వివిధ రకాల వాటికి విరాళంగా ఖర్చు చేశారు. భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, బుర్రకథలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాపాఘ్ని నదిలో వివిధ రకాల రంగుల రాట్నాలు, వివిధ రకాల అడవి జంతువులు బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఆలయానికి వివిధ రకాల రూపంలో దాదాపు రూ.14 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు అసిస్టెంటు కమిషనర్ తెలిపారు. ఆలయ సమీపంలో చక్రాయపేట వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. పులివెందుల సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐలు మధుమల్లేశ్వరరెడ్డి, గోవిందరెడ్డ, సయ్యద్ హాసం, అనిల్‌కుమార్, నరేంద్ర, మస్తాన్ బాషాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
శుభకార్యాల శ్రావణం
కడప కల్చరల్ : శ్రావణమాసం అనగానే పండుగలు, శుభ కార్యాల మాసమని భావిస్తారు. ఆగస్టు 2న అమావాస్య అనంతరం 3వ తేది బుధవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమైంది. సెప్టెంబరు 2వ తేదీ వరకు ఈ మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో శనివారాలు ఎంతో పవిత్రమైనవని విశ్వసిస్తారు. శుక్ర వారాలు కూడా అంతే పవిత్రంగా భావించి వ్రతాలు నిర్వహిస్తారు. సోమవారాలు సైతం శివాలయాలలో పూజలు చేస్తారు. ఈ సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు శనివారాలు (ఆగస్టు 6, 13, 20, 27), నాలుగు శుక్రవారాలు (ఆగస్టు 5, 12, 19, 26), నాలుగు సోమవారాలు (ఆగస్టు 7, 14, 21, 28) రానున్నాయి. దాదాపు శుక్ర, శనివారాలన్నీ వ్రతాలు, ఆలయాలలో విశేష పూజలతో సందడిగా ఉంటాయి. సోమవారాలు సైతం మహిళలు మంగళ గౌరీమాతకు విశేష వ్రతాలు జరుపుతారు. ఇందులో రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అంత్యంత భక్తిశ్రద్ధలతో సామూహికంగా నిర్వహిస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజని, ఆరోజున వ్రతం చేస్తే పుణ్య ఫలాలు తప్పక లభిస్తాయని భక్తుల విశ్వాసం. మిగతా శుక్ర వారాలు కూడా వ్రతాలు నిర్వహించేందుకు మంచి రోజులుగా భావిస్తారు. శివాలయాల్లో..... శ్రావణమాసం వైష్ణవులకు మాత్రమే పవిత్రమైన మాసమని ఎక్కువమంది భావిస్తారు. కానీ శివాలయాలలో సైతం ఈ మాసంలోని ఐదు సోమవారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పార్వతీమాతను మంగళగౌరీగా అలంకరించి శ్రీ మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తారు. శ్రావణపౌర్ణమి నాడు శ్రీ గాయత్రీదేవికి వ్రతాలు నిర్వహిస్తారు. కొందరు భక్తులు మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని జరుపుతారు. అదేరోజున నోములు నోచుకుంటారు. ఈ మాసం శివకేశవులకు అభేదాన్ని సూచిస్తుంది. ఈ మాసంలో 9న మంగళగౌరి వ్రతం, 12న శ్రీ వరలక్ష్మివ్రతం, 18న శ్రావణపౌర్ణమి (రక్షా బంధనం), 24న శ్రీకృష్ణజన్మాష్టమి పండుగలు రానున్నాయి. ఇన్ని పండుగలు వస్తాయి గనుక ఈ మాసాన్ని పండుగల మాసంగా పేర్కొంటారు. ముహూర్తాలు ఏప్రిల్ తర్వాత హిందువుల వివాహాలకు సంబంధించి ముహూర్తాలు లేకపోవడంతో అడపా దడపా దేవాలయాల్లోనూ వివాహాలు నిర్వహించుకున్నారు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రావణమాసం మంచి అవకాశాలను ఇస్తుంది. ఈ మాసంలో వివాహాలు చేసుకోవడం శుభప్రదంగా కూడా భావిస్తారు. శ్రావణమాసం దాదాపు పూర్తిగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు మొదటి రెండు వారాలు కూడా అడపాదడపా ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత దసరా పండుగ తర్వాతే ముహూర్తాలు ఉన్నాయి. దీంతో దసరా వరకు వేచి ఉండడం మంచిది కాదన్న భావనతో పలువురు ఈ మాసంలోనే వివాహాలు నిర్వహించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.