గండి జనసంద్రం
చక్రాయపేట :
ప్రసిద్ధి గాంచిన శ్రీ గండి వీరాంజనేయస్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణ మాస ఆఖరి శనివారం కావడంతో జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి పాపాఘ్ని నదిలో వాటర్ షవర్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి క్యూలైన్లలో నిలుచున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్‌లు ఆంజనేయస్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా తమలపాకులు, పూలతో అలంకరించారు. త్రికాల ఆరాధన, అభిషేకం, మహా నైవేద్యం, కుంకుమార్చన, ఆకు పూజ తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, దేవస్థాన చైర్మన్ వి.రాజారావులతోపాటు పాలక మండలి సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటె వాహనంపై హనుమంతుడిని కొలువు దీర్చి క్షేత్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరుకు చెందిన చప్పిడి నాగార్జునరెడ్డి, గండి అంజన్న స్వామి శాశ్వత ఉభయదారులు రూ.1.50 లక్షలను ఉత్సవ విగ్రహానికి పూలమాలలు, బాణా సంచా, వివిధ రకాల వాటికి విరాళంగా ఖర్చు చేశారు. భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, బుర్రకథలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాపాఘ్ని నదిలో వివిధ రకాల రంగుల రాట్నాలు, వివిధ రకాల అడవి జంతువులు బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఆలయానికి వివిధ రకాల రూపంలో దాదాపు రూ.14 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు అసిస్టెంటు కమిషనర్ తెలిపారు. ఆలయ సమీపంలో చక్రాయపేట వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. పులివెందుల సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌ఐలు మధుమల్లేశ్వరరెడ్డి, గోవిందరెడ్డ, సయ్యద్ హాసం, అనిల్‌కుమార్, నరేంద్ర, మస్తాన్ బాషాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.