తిరుమలలో ఉప్పొంగిన భక్తజన తరంగం
–గరుడసేవ వీక్షణకు పోటెత్తిన భక్తులు
– కిక్కిరిసి గ్యాలరీలు, బ్యారికేడ్లు
– మాడవీధుల్లో మహా సందడి
– ఆలయం చుట్టూ పోలీసుల పద్మవ్యూహం
– వీఐపీలు, భక్తుల మధ్య తోపులాట
–వైభవంగా సాగినlదేవదేవుని ఊరేగింపు
నత్యాలు..సంగీత వాయిద్యాల హోరు..కోలాటాలు..చెక్కభజనలు..సాంస్కతిక ప్రదర్శనలు ..ముందు సాగుతుండగా.. దేవదేవుడు మహా విష్ణువు తన ప్రియతమ సేవకుడైన గరుడారూడుడై కదులుతుండగా ..భూగోళ భక్తిశిఖామణులే కాకుండా నిఖిలదేవ..గంధర్వ సిద్ధ సాధ్యగణాలు భక్తిపారవశ్యమయ్యాయి. సర్వలోకేశ్వరుని బ్రహోత్సవంలో ఈ మనోహర కీలక ఘట్టం వీక్షిస్తున్న భక్తకోటి చేసిన ‘గరుడ వాహనా..గోవిందా..స్మరణలతో తిరుమల హోరెత్తింది. శేషాచలం భక్తిభావనతో పులకించిపోయింది. శుక్రవారం రాత్రి ఏడున్నరకు ఆరంభమైన గరుడవాహన సేవ ఊరేగింపు ఆధ్యంతరం భక్తితరంగాలతో పోటెత్తింది.
సాక్షి,తిరుమల:
అసంఖ్యాక భక్త జన సందోహం నడుమ తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై శుక్రవారం నాలుగు మాడ వీధుల్లో విహరించారు. చిన్నపాటి తోపులాట సంఘటనల మినహా వాహనసేవ అంతా ప్రశాంతంగానే ముగిసింది. గరుడ వాహన సేవను చూసి తరించడానికి శుక్రవారం ఉదయం నుండే భక్తుల రావడం కనిపించింది. ఉదయం మోహినీ అవతారం ఊరేగింపులోనే నాలుగు మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వాహనం ముగిసినా చాలామంది అలాగే కూర్చున్నారు. భక్తజనం తండోపతండాలు గరుడ వాహన సేవ కోసం ఉదయం 11 గంటల నుంచే ఆలయ మాడ వీధుల్లోకి రావడానికి క్యూ కట్టారు. ఎండను లెక్క చేయలేదు. సాయంత్రం 4 గంటలకే మాడ వీ«ధుల్లోని గ్యాలరీలు నిండాయి. వాహన సేవను నిర్ణీత సమయం రాత్రి 7.30 గంటలకే ప్రారంభించారు. గరుడవాహనం వాహన మండపం నుంచి వెలుపలకు వచ్చి గ్యాలరీలో వేచిఉన్న భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించారు. వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఉత్సవమూర్తి దర్శనభాగ్యం కల్పించారు.
–భక్తులు అధికంగా నిరీక్షించే ప్రాంతాల్లో హారతులతో కూడిన దర్శనం కల్పించారు.
కూడళ్ళలో ఎక్కువ సమయం వాహనాన్ని నిలిపారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించటంలో ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు సఫలీకతులయ్యారు.
–వాహన సేవను నిదానంగా ముందుకు సాగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్యాలరీలు, బ్యారికేడ్ల నుంచి జనం స్వామిని దర్శించుకుని తన్మయత్వం పొందారు.
–కల్యాణకట్ట నుంచి అఖిలాండం మార్గంలోను, రాంభగీచా అతిథి గహం నుంచి నాలుగు మాడ వీధుల్లోకి రాక పోకలు నిలిపి వేశారు. వాహనసేవ ప్రారంభమయ్యే వాహన మండపం సమీపానికి, భక్తులు కూర్చునే బ్యారికేడ్లలోకి ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి అనుమతించారు. లగేజీతో భక్తులను అనుమతించలేదు.
– గ్యాలరీల్లో భక్తులకు మంచినీరు, పులిహోర, ఉప్మా, సాంబరన్నం, ఇతర అన్నప్రసాదాల ప్యాకెట్లు, పాలు, తేనీరు సరఫరా చేశారు. కొందరు భక్తులుఅన్నప్రసాదాలు అందలేదని ఫిర్యాదు చేయటం గమనార్హం.
– అలిపిరి నుంచి తిరుమల వరకు అనేక సంస్థలు, వ్యక్తులు, సంఘాలు భక్తులు అన్నదానం చేశాయి. ఆలయ వీధుల్లో పారిశుద్ధ్యంపై ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.
–వాహన సేవలో వీఐపీల హడావిడి, తోపులాట కనిపించింది. ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర ప్రముఖులు చాలా మంది సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చారు. దీంతో వాహన సేవకు ముందు వీరే అధికంగా కనిపించారు.
రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకరరావు, టీటీడీ సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్ , తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్పి జయలక్ష్మి బందోబస్తును పర్యవేక్షించారు.
– 5 వేల మంది పోలీసు సిబ్బందిని ఆలయ నాలుగు మాడవీధులు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాల్లో మోహరించారు.ముందు జాగ్రత్త చర్యగా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పాటు క్విక్ రియాక్షన్ టీంలను రంగంలోకి దించారు. వందలాది మంది పోలీసులు మఫ్టీలో నిఘా వేశారు. ఆక్టోపస్ కమాండో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించింది.
–కొందరు పోలీసు సిబ్బంది తమవారిని దొడ్దిదారుల్లో అనుమతించటం కనిపించింది. చాలా చోట్ల సామాన్య భక్తులను అడ్డుకున్నారు. నాలుగు మాడ వీధుల చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. సామాన్యులు లోపలికి ప్రవేశించడం కష్టంగా మారింది.
–ఆర్టీసీ బస్సులు అధికంగా ఏర్పాటు చేసినా, రద్దీ వల్ల డిమాండ్ ఏర్పడింది. బస్సుల్లో సీట్లకోసం భక్తులు అష్టకష్టాలు పడ్డారు. ఆలయం నుంచి బస్టాండు, ఇతర ప్రాంతాల్లో బస్సులు వేచి ఉండే ప్రాంతానికి భక్తులు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ ట్యాక్సీలు, జీపులపైనే ప్రయాణీకులు ఆధార పడాల్సి వచ్చింది.
–ప్రైవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రైవేట్ వాహనాల ప్రయాణ చార్జి ఎక్కువగా వసూలు చేశారు. ఘాట్ రోడ్డులో ఒక్క సారిగా వేలాది వాహనాలు రావడంతో తిరుపతి నుండి తిరుమల మధ్య ప్రయాణ కాలం ఎక్కువ సేపు పట్టింది.