సినిమాలో బ్రహ్మోత్సవం
చిలుకూరు బాలాజీ ఆలయ స్థల పురాణం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చిలుకూరు బాలాజీ’. అల్లాణి శ్రీధర్ దర్శకుడు. ఇందులో వెంకటేశ్వరస్వామిగా ‘శ్రీభాగవతం’ ఫేమ్ సునీల్‌శర్మ నటించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏకాదశ ప్రదక్షిణాలతో భక్తులకు మహర్దశను కలిగించే మహోన్నత పుణ్యక్షేత్రం చిలుకూరు.
ఈ స్థల పురాణంలో ఎన్నో ఆసక్తికరమైన ఘట్టాలున్నాయి. నాలుగొందల ఏళ్ల క్రితం భక్తుని కోరిక మేరకు ఏడుకొండలు దిగివచ్చి చిలుకూరులో వెలిసిన కోనేటి రాయని వృత్తాంతం ప్రేక్షకుల్ని తన్మయానికి లోను చేస్తుంది. ‘కదిలింది పాదం’ అనే పాటలో వైకుంఠం నుంచి శ్రీవారు తిరుమల గిరుల్లో కొలువవ్వడం, తర్వాత స్వయంగా ఆయనే... చిలుకూరు చేరుకోవడం లాంటి సన్నివేశాలు గ్రాఫిక్స్‌లో తీశాం. ఆ పాట సినిమాకే హైలైట్. చిలుకూరులో ప్రధాన ఆర్చకులైన కోవిదుల సౌందర్‌రాజన్ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి రచన జరిగింది.
ప్రస్తుతం చిలుకూరులో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను చిత్రీకరిస్తున్నాం. మగధీర, రుద్రమదేవి చిత్రాలకు గ్రాఫిక్స్ అందించిన మైండ్ విజన్ సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తోంది. మే నెలలో పాటలను, జూన్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుమన్, సాయికుమార్, ఆమని, భానుశ్రీ మెహ్రా తదితరులు ఇందులో ముఖ్య తారలు.