Sri durgamallesvara Swami
-
పెండింగ్ ఫైళ్లు
అనుమతులకోసం దుర్గగుడి అధికారుల ఎదురుచూపులు కీలక నిర్ణయాల్లోనూ జాప్యం భక్తులకు తప్పని ఇబ్బందులు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం తీరిదీ సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన ప్రతి ఫైలూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం గడప దాటడం లేదు. గుడికి సంబంధించి పదుల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో దేవాదాయ శాఖ విభజన తదితర కారణాలవల్ల ఏడాదిన్నర కాలంగా ఫైళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. కీలక ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో దేవస్థానానికి ఆదాయం నష్టపోవడమే కాకుండా ఉద్యోగులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాదాయ శాఖ విభజన పూర్తయితే తప్ప ఫైళ్లు కదిలే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దేవస్థానానికి అత్యవసరం అనుకున్న ఫైళ్లను అధికారులు వ్యక్తిగతంగాా తీసుకువెళ్లి హైదరాబాద్లోనే నాలుగైదు రోజులు ఉండి, అక్కడ పనిచేసే కిందిస్థాయి సిబ్బందిని సంతృప్తిపరిస్తే చకచకా క్లియర్ అవుతాయని తెలిసింది. సిబ్బంది పదోన్నతులు, ఇంక్రిమెంట్ ఫైళ్లు ఈ విధంగానే సాగుతున్నాయని అంటున్నారు. గుడిబాట నిర్వహిస్తే.. గతంలో సుందరకుమార్ కమిషనర్గా ఉన్నప్పుడు.. కమిషనర్ కార్యాలయ సిబ్బందిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఫైళ్లు పరిశీలించి క్లియర్ చేశారు. ప్రాధాన్యత లేని ఫైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల నగరానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. దేవాలయాల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో గుడిబాట లేదా దేవాదాయశాఖ మేళా వంటి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. కమిషనర్ కార్యాలయం కేవలం అనుమతులు ఇస్తే సరిపోతుందని, నిధులను దేవస్థానం సొంత ఆదాయం నుంచే సమకూర్చుకుంటుదని అధికారులు చెబుతున్నారు. -
దుర్గగుడి అభివృద్ధి పనులపై ఉమా దృష్టి
ఇంజినీర్లపై ప్రశ్నల వర్షం భక్తులకు అసౌకర్యం కలిగించొద్దంటూ సూచన వ్యక్తిగతంగా పరిశీలిస్తానంటూ హెచ్చరిక సాక్షి కథనాలపై స్పందన సాక్షి,విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలపై తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టిపెట్టారు. సోమవారం ఉదయం తనను కలవడానికి వచ్చిన దేవస్థానం ఇంజినీర్లు, ఇతర అధికారులను దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రశ్నించారు. ఘాట్రోడ్డులో అభివృద్ధి పనులపై ఆయన ప్రశ్నిస్తూ రిటైనింగ్వాల్ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రతి ఏడాది మరమ్మతులు ఎందుకు చేయించాల్సి వస్తోందని, దాని కాంట్రాక్టర్ నుంచి డబ్బు రాబట్టకుండా దేవస్థానం నిధుల నుంచి ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే కొండపై నుంచి తరుచుగా కొండరాళ్లు పడుతూ ఉండటాయని, వాటి వల్ల భక్తులకు ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున భక్తులకు కావాల్సిన ప్రసాదాలు అందుబాటులో ఉంచుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రసాదాలు అందక నిరాశతో తిరిగి వెళ్లకుండా చూడాలని చెప్పారు. ఎండవేడిమి వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్దదేవాలయం కావడంతో అందరి దృష్టి దేవాలయంపై ఉంటుందని, అందువల్ల దేవాలయ ప్రతిష్ట కాపాడాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో తాను దేవాలయానికి వ్యక్తిగతంగా వచ్చి అభివృద్ధి పనుల్ని పరిశీలిస్తానని చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత,ప్రమాణాలను పాటించడంలో రాజీ పడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.