
దుర్గగుడి అభివృద్ధి పనులపై ఉమా దృష్టి
- ఇంజినీర్లపై ప్రశ్నల వర్షం
- భక్తులకు అసౌకర్యం కలిగించొద్దంటూ సూచన
- వ్యక్తిగతంగా పరిశీలిస్తానంటూ హెచ్చరిక
- సాక్షి కథనాలపై స్పందన
సాక్షి,విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలపై తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టిపెట్టారు. సోమవారం ఉదయం తనను కలవడానికి వచ్చిన దేవస్థానం ఇంజినీర్లు, ఇతర అధికారులను దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రశ్నించారు.
ఘాట్‌రోడ్డులో అభివృద్ధి పనులపై ఆయన ప్రశ్నిస్తూ రిటైనింగ్‌వాల్ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రతి ఏడాది మరమ్మతులు ఎందుకు చేయించాల్సి వస్తోందని, దాని కాంట్రాక్టర్ నుంచి డబ్బు రాబట్టకుండా దేవస్థానం నిధుల నుంచి ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే కొండపై నుంచి తరుచుగా కొండరాళ్లు పడుతూ ఉండటాయని, వాటి వల్ల భక్తులకు ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున భక్తులకు కావాల్సిన ప్రసాదాలు అందుబాటులో ఉంచుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రసాదాలు అందక నిరాశతో తిరిగి వెళ్లకుండా చూడాలని చెప్పారు. ఎండవేడిమి వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
రాష్ట్రంలో రెండవ అతిపెద్దదేవాలయం కావడంతో అందరి దృష్టి దేవాలయంపై ఉంటుందని, అందువల్ల దేవాలయ ప్రతిష్ట కాపాడాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో తాను దేవాలయానికి వ్యక్తిగతంగా వచ్చి అభివృద్ధి పనుల్ని పరిశీలిస్తానని చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో నాణ్యత,ప్రమాణాలను పాటించడంలో రాజీ పడితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.