sri kalahastiswara swamy
-
ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు?
రాజుల్మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు, వారిచ్చు నం భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా బీజంబుల్, తదపేక్షచాలు, పరితృప్తింపొందితిన్, జ్ఞానల క్ష్మీజాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీకాళహస్తీశ్వరా! రాజులు గర్విష్ఠులు. వారిని ఆశ్రయించడం నరకంతో సమానం. ఆ రాజులిచ్చే స్త్రీలు, పల్లకీలు, గుర్రాలు, నగలు, మొదలైన కానుకలు మనస్సుకు దుఃఖం కలిగిస్తాయి. ఈ రాజులసేవ ఇకచాలు!!! పొందవలసిన తృప్తినిపొందాను. ఇక నాకు నువ్వు జ్ఞానలక్ష్మీ జాగ్రదావస్థను దయతో ప్రసాదించు. నీరూపంబు దలంపగా తుద మొదల్నే గాన వీవైనచో రారా రమ్మనియంచు చెప్పవు, వృధారంభంబు లింకేటికిన్ నీరన్ముంపుము పాలముంపుమిక నిన్నేనమ్మినాడంజుమీ శ్రీరామార్చితపాదపద్మయుగళా! శ్రీకాళహస్తీశ్వరా ! భావం: శ్రీకాళహస్తీశ్వరా! నీ రూపాన్ని తలచుకోవాలంటే, దాని తుద, మొదలు తెలియని అశక్తుడను. పోనీ, నీవైనా నామీద దయతలచి నన్ను రమ్మని పిలవవు. ఈ వృధా ప్రయత్నాలు ఇకనెందుకు? నిన్నే నమ్ముకున్నాను. నీట ముంచుతావో, పాలముంచు తావో, అది ఇక నీదయ! తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
నా ప్రార్థనను ఎందుకు మన్నించవు?
నిను నావాకిలి గావుమంటినొ? మరున్నీలాలక భ్రాంతి గుం టెన పొమ్మంటినొ, యెంగిలిచ్చితిను తింటేగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీకాళహస్తీశ్వరా! నా యింటిని కావలి కాయమని నిన్ను కోరానా? నిన్ను రాయబారిగా వెళ్లమన్నానా?నేను తిన్న ఎంగిలిపదార్థాన్ని నీకు పెట్టి,‘తింటావా? లేదా?‘అని, నిన్ను తొందర చేశానా? నిన్ను నమ్మిన మంచివాళ్లైన నీ భక్తులను రక్షించమని నేను వేడితే, నా ప్రార్థనను ఎందుకు మన్నించవు? ఱాలన్ రువ్వగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచు నే – చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేగాను, నా శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీమన్నారాయణునిచే పూజించబడు శ్రీకాళహస్తీశ్వరా! ఆ బోయవానిలా పూజ చేసేందుకు నీపై రాళ్లు విసర లేను. రమ్మని పిలిచి, కన్న కొడుకును చంపలేను. నా కన్నులను ఊడబెరికి ఇవ్వలేను. నా గురించి ఇంకా నేనేం చెప్పాలి? ఇక నీదయ!!! నా భాగ్యం!!! -తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
సంసార జీవితంతో వేగలేను
కాయల్గాచె వధూనఖాగ్రముల చే గాయంబు వక్షోజముల్ రాయన్రాపడె ఱొమ్ము మన్మథ విహారక్లేశవిభ్రాంతిచే ప్రాయంబాయెను బట్టగట్టెతల చెప్పన్ రోత సంసారమే చేయంజాలవిరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా ! భావం: శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీల గోటిగీట్లతో నా శరీరమంతా కాయలు కాసింది. వారి వక్షోజముల రాపిడికి నా గుండె మొద్దుబారి పోయింది. మన్మథలీలల బాధలతో, మోహంతో, నా యవ్వనమంతా గడచిపోయింది. బట్టతల వచ్చేసింది. చెప్పాలంటే ఈ సంసార జీవితం నాకిపుడు అసహ్యం వేస్తోంది. ఇక నేనీ సంసార జీవితంతో వేగలేను. నన్నింక వైరాగ్య జీవితంలోనికి మళ్లించు ప్రభూ! నిన్నే రూపముగా భజింతు మదిలో, నీరూపు మోకాలొ, స్త్రీ చన్నో కుంచమొ మేకపెంటికయొ యీసందేహముల్మాన్పినా కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగాజూపవే చిన్నీరేజ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా! భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మనోకమలంలో విహరించే తుమ్మెదవైన ఈశ్వరా! శ్రీకాళహస్తీశ్వరా! నిన్నేరూపంతో ఆరాధించేది? నీ ఆకారము మోకాలా? స్త్రీ వక్షోజమా? మేకపెంటికయా? కుంచమా? నా యీ సందేహాన్ని తొలగించి, నీ రూపాన్ని, సగుణాకారంగా, నా కన్నులారా నేను చూసేలా, నాకు చూపించు. -తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
నీతో యుద్ధం చెయ్యలేను
పద్యం 8 నీతో యుద్ధము చేయనోప, గవితానిర్మాణశక్తి న్నినున్ –– బ్రీతుం చేయగలేను, నీకొరకు తండ్రిం చంపగా జాల నా –– చేతన్ రోకటి నిన్ను మొత్త వెఱతున్ చీకాకు నాభక్తియే –– రీతి న్నాకిక నిన్ను జూడగ నగున్ శ్రీ కాళహస్తీశ్వరా ! భావం శ్రీ కాళహస్తీశ్వరా! నీతో యుద్ధం చెయ్యలేను.మంచి కవిత్వంతో నిన్ను మెప్పించలేను. నీ కోసం తండ్రిని చంపలేను.రోకలితో నిన్ను కొట్టడానికి నాకు భయం. నీపై నాకున్న భక్తి నన్ను చికాకు పెడుతోంది. మరి ఎలా నిన్ను దర్శించగలను ? పద్యం 9 ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం –– బేలా నామెడ గట్టినాడవిక నిన్నే వేళ జింతింతు, ని ––– ర్మూలంబైన మనంబులోనెగడు దుర్మోహాబ్ధిలో గ్రుంకి యీ –– శీలామాలపు జింతనెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా ! భావం శ్రీ కాళహస్తీశ్వరా ! భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము, అనే ఈ బంధాలను నా మెడకు ఎందుకు కట్టావు? ఇక నిన్ను ఏ సమయంలో ధ్యానించేది ? నిన్ను స్మరించడం మాని, ఈ మోహసముద్రం లోమునిగిన నా భరించరాని దుఃఖాన్ని ఎలా తొలగిస్తావు? -తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
నేను నీ మాట వినడం మానేశానా?
పద్యం 6 స్వామిద్రోహము చేసి, వేరొకని గొల్వంబోతినో, కాక నే –– ––నీమాట న్విన నొల్లకుండితినొ నిన్నే దిక్కుగా జూడనో! ––– ఏమీ యిట్టి వధాపరాధినగు నన్నున్ దుఃఖవారాశి వీ –– చీ మధ్యంబున ముంచియుంప ––దగునా శ్రీ కాళహస్తీశ్వరా ! భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా యజమానివైన నిన్ను, నేను ద్రోహం చేసి, మరొకరిని సేవించడానికి పోయానా? నేను నీ మాట వినడం మానేశానా? నువ్వే దిక్కని నేను భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను నీవు దుఃఖసముద్రపు కెరటాల మధ్య ముంచివేయడం భావ్యమా? పద్యం 7 దివిజక్ష్మారుహ ధేను రత్నఘన –భూతిన్ ప్రస్ఫురద్రత్న సా –– –నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖు డర్ణోరాశి కన్యావిభుం –– ––డు విశేషార్చకు డింక నీకెన ఘనుండున్ గల్గునే నీవు చూ– చి విచారింపవు లేమి నెవ్వ –డుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా ! భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కల్పవృక్షం, కామధేనువు, అను గొప్పసంపదలతో అలరే మేరుపర్వతం నీ విల్లు. సంపదలకు అధిపతియైన కుబేరుడు నీ మిత్రుడు. సముద్రునికి అల్లుడైన శ్రీ విష్ణువు నీకు విశేషార్చకుడు. నీకు సాటి ఎవరు? పరమేశ్వరుడవైన నీవు దయతలచకుంటే మా పేదరికాన్ని ఎవరు తొలగిస్తారు ? తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
అమ్మ వయస్సు 68 ... ఆమె కోసం...
శ్రీకాళహస్తీశ్వరునికి వేడుకోలు అన్నాడీఎంకే అభ్యర్థి - 68 కిలోల వెండికవచం చెన్నై: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సహజంగా తమ గెలుపుకోసం దేవునికి మొక్కుకుంటారు. అయితే అన్నాడీఎంకేకు చెందిన అభ్యర్థి ఒకరు ఆర్కేనగర్ అభ్యర్థి జయలలిత కోసం మొక్కుకున్నారు.చెన్నై తిరువీకనగర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా నీలకంఠన్ (70) పోటీ చేస్తున్నారు. గత 2011 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు సేవ చేయాలని, ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆమె 68 ఏళ్ల జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని మొక్కుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా తాను పొందిన రూ.34.4 లక్షల జీతభత్యాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి తన మొక్కును వివరించారు. మీరు కోరినట్లుగా నే మొక్కులు చెల్లించుకోండి అని జయలలిత చెప్పారు. దీంతో నగరంలోని ప్రముఖ బంగారు నగల దుకాణంలో 68 కిలోలతో వెండి కవచానికి ఆర్డర్ ఇచ్చారు. అయితే వెండికవచం సిద్ధమయ్యేలోగా ఎన్నికలు రావడంతో మొక్కు తీర్చడాన్ని వాయిదా వేసుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత జయలలితకు చూపించి శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పిస్తానని నీలకంఠన్ చెప్పారు.