అమ్మ వయస్సు 68 ... ఆమె కోసం...
శ్రీకాళహస్తీశ్వరునికి వేడుకోలు
అన్నాడీఎంకే అభ్యర్థి - 68 కిలోల వెండికవచం
చెన్నై: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సహజంగా తమ గెలుపుకోసం దేవునికి మొక్కుకుంటారు. అయితే అన్నాడీఎంకేకు చెందిన అభ్యర్థి ఒకరు ఆర్కేనగర్ అభ్యర్థి జయలలిత కోసం మొక్కుకున్నారు.చెన్నై తిరువీకనగర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా నీలకంఠన్ (70) పోటీ చేస్తున్నారు. గత 2011 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు సేవ చేయాలని, ప్రస్తుత ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆమె 68 ఏళ్ల జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని మొక్కుకుని ఉన్నారు.
ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా తాను పొందిన రూ.34.4 లక్షల జీతభత్యాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి తన మొక్కును వివరించారు. మీరు కోరినట్లుగా నే మొక్కులు చెల్లించుకోండి అని జయలలిత చెప్పారు. దీంతో నగరంలోని ప్రముఖ బంగారు నగల దుకాణంలో 68 కిలోలతో వెండి కవచానికి ఆర్డర్ ఇచ్చారు. అయితే వెండికవచం సిద్ధమయ్యేలోగా ఎన్నికలు రావడంతో మొక్కు తీర్చడాన్ని వాయిదా వేసుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత జయలలితకు చూపించి శ్రీకాళహస్తీశ్వరునికి సమర్పిస్తానని నీలకంఠన్ చెప్పారు.