'ఆ జీవోల రద్దుతో అవినీతికి గేట్లు తెరిచినట్లే'
కదిరి: దేవాలయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన ఆరు జీఓలను ప్రస్తుత చంద్రబాబునాయుడు సర్కారు ఎందుకు రద్దు చేసిందని హిందూ దేవాలయ ప్రతిష్టాన పీఠం పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామిజీ ప్రశ్నించారు. స్వామిజీ క్రిష్టమందిరంలో మంగళ వారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ జీఓలను విడుదల చేశారని, వాటిని రద్దు చేయాల్సిందే అన్న మూర్ఖపు ఆలోచనలు చేస్తే దేవాలయాలు మరుగున పడిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. దేవాదాయ శాఖలో పనిచేసే కొందరు అవినీతి ఉద్యోగుల ప్రోద్భలంతోనే ఆరు జీఓలు రద్దు చేశారని తెలుస్తోందని, అది మంచిది కాదని హితవు పలికారు. ఆలయ ఉద్యోగుల నియామకం, పదోన్నతులు, కామన్గుడ్ ఫండ్, టెండర్లు తదితర వాటికి సంబంధించిన జీఓలు( జీఓ నెం 337, 927, 419, 420, 424, 426) రద్దు చేయడం అవినీతికి గేట్లు తెరవడమేనన్నారు. రద్దు చేసిన జీఓలపై ప్రభుత్వం తక్షణం పునరాలోచించకపోతే ఉద్యమ బాట తప్పదని స్వామీజీ హెచ్చరించారు.