నిజాయితీకి అభినందనలు
మహానందిలో బ్యాగ్‌ను మరిచి వెళ్లిన భక్తులు
అందులో రూ. 39 వేలు, ఏటీఎం కార్డులు
పాదరక్షల కౌంటర్ యజమానికి దొరికిన బ్యాగ్
నాలుగు రోజుల తర్వాత బాధితులకు అప్పగింత
మహానంది : వంద రూపాయలు దొరికితే పక్కోడికి తెలియకుండా జేబులో వేసుకునే రోజులివి. నాలుగురోజుల క్రితం దొరికిన రూ. 39వేల నగదు, విలువైన కార్డులతో దొరికిన బ్యాగును నిజాయితీతో ఓ వ్యక్తి బాధితులకు అప్పగించాడు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన నరసింహ, మంజుల దంపతులు ఈ నెల 4న గురువారం మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడిని దర్శించుకున్న అనంతరం వారు ఇక్కడి నుంచి అదే రోజు రాత్రికి తిరుపతికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక ఓ బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. బ్యాగులో రూ. 39వేల నగదు, విలువైన ఏటీఎం కార్డులు, ఇతర పత్రాలు ఉన్నాయి.
వారి కుమార్తె ఇంటర్నెట్లో మహానంది సమాచారాన్ని తెలుసుకుని దేవస్థానం కార్యాలయం ఫోన్ నంబరుకు కాల్ చేసి వివరాలు చెప్పారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ ఓంకారం వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ మల్లయ్య మైక్‌లో అనౌన్స్ చేశారు. అప్పటికే పాదరక్షల కౌంటరు యజమాని కుమార్‌కు ఆ బ్యాగు దొరకడంతో సమాచారం తెలుసుకుని ఆలయ అధికారులకు అందించాడు. వారు బాధితులకు ఫోన్ ద్వారా బ్యాగ్ దొరికిన విషయం చెప్పడంతో వారు ఆనందించారు. ఆదివారం మహానందికి వచ్చి బ్యాగు, నగదును తీసుకున్నారు. దేవస్థానం అన్నదానం ఇన్చార్జ్ సుబ్బారెడ్డి, ప్రసాదాల ఇన్చార్జ్ బీకే స్వామిరెడ్డి, హోంగార్డులు రామచంద్రారెడ్డి, మధు, బాధితులు నిజాయితీగా బ్యాగ్‌ను అప్పగించిన కుమార్‌ను శాలువాతో సత్కరించారు.