శ్రీ కనకదుర్గ లో టీడీపీ పాలిట్రిక్స్
లోగుట్టు సీఎం పేషీకి ఎరుక
విమర్శించినవారే ఒక్కటయ్యారు
భారీగా మామూళ్ల మంత్రాంగం
టీడీపీ తీరుపై విపక్షాల మండిపాటు
విజయవాడ సెంట్రల్ : అబద్ధాన్ని గట్టిగా చెబితే తిమ్మిని బమ్మిని చేయొచ్చని భావిస్తున్నట్లున్నారు టీడీపీ పాలకులు. శ్రీ కనకదుర్గ లేఅవుట్‌కు సంబంధించి అక్రమాల లోగుట్టులోనూ అదే ట్రిక్ ప్లే చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేవాళ్లు కూడా ఒక్కటయ్యారు. ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్లు కలిసిపోయారు. సీఎం పేషీ ‘అభీష్ట’ం నెరవేరింది. లే అవుట్ నిబంధనలు మాయమైపోయాయి. శ్రీ కనకదుర్గ బిల్డింగ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ ఆమోదానికి రాజముద్ర పడింది. ఈ కథకు సీఎం పేషీ నుంచే స్క్రీన్‌ప్లే జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎన్జీవో నాయకుడిని సంతృప్తిపరిచేందుకే ఇంత తతంగం నడిపిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ అసమ్మతి జ్వాలలు ఏమయ్యాయ్?
ఈ ఏడాది మే నెల ఏడో తేదీన కౌన్సిల్ లేఅవుట్‌ను ఆమోదించింది. ఇది టీడీపీలో బ్లో అవుట్‌గా మారింది. స్పెషల్ మీటింగ్ వేసి దీనిని రద్దు చేస్తామంటూ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మీడియాకు చెప్పారు. ఉవ్వెత్తున ఎగిసిన అసమ్మతి జ్వాలలు అంతలోనే చప్పున చల్లారిపోయాయి. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో అంతా ఏకమైపోయారు. దీని వెనుక భారీగా మామూళ్ల మంత్రాంగం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం పేషీ సూచన మేరకే ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అంతా ఒక్కటైపోయారు...
సెంట్రల్, తూర్పు ఎమ్మెల్యేలతో మేయర్ కోనేరు శ్రీధర్‌కు సత్సంబంధాలు లేవు. మొదటి నుంచి మేయర్‌ను వ్యతిరేకించే ధోరణిలోనే వారిద్దరూ వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యం. డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, మేయర్ మధ్య కూడా సరైన అవగాహన లేదని ఆ పార్టీ కార్పొరేటర్లే చెబుతుంటారు. శ్రీ కనకదుర్గ విషయంలో మాత్రం వీరంతా ఒక్కటైపోయారు. మున్నెన్నడూ లేని విధంగా గోగుల రమణ మేయర్ శ్రీధర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తీర్మానంపై చర్చ ముగిసేవరకు ఉండి వెళ్లారు. పార్టీ అధిష్టానం తమ నోళ్లు కట్టేసిందని ఆ పార్టీ కార్పొరేటర్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గానికి మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా కనకదుర్గ డీల్ కుదుర్చుకున్నారని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. కొందరి లబ్ధి వల్ల పార్టీ అల్లరి అయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు బహిరంగ విమర్శలు గుప్పిస్తుంటే స్వపక్షం అంతర్గత విమర్శలకు పదును పెడుతోంది.
కనకదుర్గ లేఅవుట్పై న్యాయ పోరాటం : పుణ్యశీల
టీడీపీలో ‘శ్రీ కనకదుర్గ’ లే అవుట్ అడ్డగోలు ఆమోదంపై న్యాయపోరాటం చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బి.ఎన్.పుణ్యశీల స్పష్టం చేశారు. పార్టీ కార్పొరేటర్లతో కలసి గురువారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డెరైక్టర్ అండ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. భారీగా ముడుపులు ముట్టడం వల్లే మేయర్ కోనేరు శ్రీధర్ లే అవుట్‌కు పచ్చజెండా ఊపారన్నారు. అధికారాన్ని అతిక్రమించి కౌన్సిల్ ఆదాయానికి గండికొట్టే ప్రతిపాదనలు, నిర్ణయాలు తీసుకొనేవారు సెక్షన్ 679 సబ్ సెక్షన్స్ ఏ,బీ,సీ,డీ ప్రకారం పదవి లేదా అధికారం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కోర్టులో కేసు వేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ తాము తప్పు చేయలేదన్నారు. ప్రతిపక్షం సభలో ఉంటే తమ పప్పులుడకవనే భయంతోనే రోజంతా తమను సస్పెండ్ చేశారన్నారు.
మెజార్టీ ఉంది కాబట్టి కౌన్సిల్లో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో మేయర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కౌన్సిల్లో జరిగే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారన్నారు. డ్రెయినేజ్, వాటర్ చార్జీలను తగ్గిస్తామని చెప్పిన పాలకులు అధికారుల్ని అడ్డం పెట్టుకొని మరో ఏడు శాతం పెంచారన్నారు. త్వరలోనే ఆస్తిపన్నును 30 శాతం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, జె.పూర్ణమ్మ, బి.సంధ్యారాణి పాల్గొన్నారు.