చెవిలో చెబితే.. కోరికలు తీర్చే స్వామి
సాక్షి, బిక్కవోలు (తూర్పుగోదావరి): చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసించే బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వినాయక చవితి వేడుకలకు ముస్తాబైంది. స్థానిక జెడ్పీ హైస్కూలును ఆనుకుని ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో రధ్దీగా ఉంటుంది. 1100 సంవత్సరాల చర్రిత కలిగిన ప్రాచీన ఆలయమిది. ఇక్కడ శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు శాఖ అంచనా వేసింది.
అప్పటి రాజులు ప్రత్యేక పూజలు చేసి, పనులు ప్రారంభిస్తే అనుకున్నట్టుగా జరిగేవని ప్రతీతి. ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ భక్తులు.. స్వామి వారి చెవిలో తమ కోర్కెలు చెప్పుకుంటారు. తొమ్మిదో శతాబ్దానికి చెందిన స్వామి వారి విగ్రహం కాలక్రమేణా భుస్థాపితమైంది. అనంతరం 19వ శతాబ్దంలో ఈ విగ్రహం పంట పొలాల్లో బహిర్గతమైంది. స్వామి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భక్తులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడే మందిరం నిర్మించి, పూజలు ప్రారంభించారు.
చవితి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
వినాయక చవితి సందర్భంగా శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో బుధవారం నుంచి సెప్టెంబర్ 9వ తేది వరకూ నవరాత్ర మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఏఎంసీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.52 గంటలకు తీర్థపు బిందె సేవతో స్వామి వారి చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 11.12 గంటలకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కలశ స్థాపన చేస్తారు. పదో తేదీన మహాన్నదానంతో ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ తొమ్మిది రోజులూ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.
స్వామి వారి ప్రత్యేకతలు
బిక్కవోలు శ్రీలక్ష్మీగణపతి స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున ఉంటుంది. భారీ కాయంతో ఉన్న స్వామి వారి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నాగాభరణం, నాగ మొలతాడు, నాగ యజ్ఞోపవీతం, బిళ్లకట్టు పంచెతో సుఖాశీనులైన స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా సుప్రసిద్ధుడు.
అంగరంగ వైభవంగా..
గడచిన రెండేళ్లూ కోవిడ్ కారణంగా ఉత్సవాలు సాదాసీదాగా జరిగాయి. ఈ ఏడాది పరిస్థితులు కుదుట పడటంతో చవితి ఉత్సవాలను భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు చవితి మినహా మిగిలిన రోజుల్లో అన్నదానం ఏర్పాటు చేశాం.
– తమ్మిరెడ్డి నాగ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్