నిఘా నీడలో 'శ్రీరంగం'
తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయ వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. దీంతో ఆలయ పరిసరాల్ని, శ్రీరంగం పట్టణాన్ని నిఘా నీడలోకి తెచ్చారు.
చెన్నై: వైష్ణవ క్షేత్రాల్లో తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఒకటి. ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం అతి పెద్దప్రాకారంతో, దేదీప్యమానంగా కన్పిస్తుంటుంది. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు, 50 సన్నిధులు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు ముగిసి , కుంభాభిషేక వేడుకలు గతనెల కోలాహలంగా జరిగాయి.
భక్తులు ఆలయానికి రాక పెరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఆలయం ముస్తాబు అవుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఆలయ వెబ్సైట్ హ్యాక్‌కు గురైంది. ఉదయం రెండన్నర గంటల సమయంలో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన వ్యక్తులు, కశ్మీర్ కైవసం తమ లక్ష్యం అంటూ, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండటంతో కలవరం బయలు దేరింది.
దీంతో ఆలయ అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. ఈ వెబ్ సైట్‌ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారో ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వైకుంఠ ఏకాదశి వివరాలను ప్రజలకు అందించడం కష్టతరంగా మారింది. ఇక, ఈ హ్యాక్‌తో శ్రీరంగం ఆలయం, పరిసరాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదే వరకే తిరుచ్చి కలెక్టర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు సైతం వచ్చి ఉన్న దృ ష్ట్యా, ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆలయ పరిసరాల్లో తనిఖీలు ముమ్మరం చేసి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు భారీ భద్రత నిమిత్తం మదురై నుంచి బలగాలను రంగంలోకి దించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఇదిలా ఉండగా, చెన్నైలోని హిందూ మున్నని ప్రధాన కార్యాలయానికి సైతం బాంబు బూచి రావడంతో ఉత్కంఠ బయలు దేరింది. చింతాద్రి పేటలో ఉన్న ఆ కార్యాలయానికి సిమీ తీవ్ర వాదుల పేరిట వచ్చిన లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకనప్పటికీ, ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేయక తప్పలేదు.