Sri Venkateswara Vaibhovotsavams
-
హైదరాబాద్ లో శ్రీవారి వైభవోత్సవాలు...!
-
యూకే,యూరోప్‌లో వైభవంగా తితిదే శ్రీనివాస కళ్యాణోత్సవాలు
-
యూకే,యూరోప్‌లో అంగరంగ వైభవంగా తితిదే శ్రీనివాస కళ్యాణోత్సవాలు
యూకే, యూరోప్‌లో ఘనంగా జరుగుతున్న శ్రీనివాస కళ్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. వివరాల్లోకి వెళితే, తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు గత వారంలో మూడు (03) నగరాలలో జరిగాయి. నవంబర్ ౩వ తేదీన జర్మనీలోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్ నగరాలలో తితిదే అర్చకులు, వేదపండితులు ఆ దేవదేవుడి కళ్యాణం వైఖానస ఆగమం ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఇప్పటివరకు 9 నగరాలలో శ్రీవారి కళ్యాణాలు జరిగాయి. మునిక్ నగరంలో వారం మధ్యలో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం నిర్వహించినా, భక్త సందోహంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీ లో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీ పర్వతనేని హరీష్ దంపతులు, స్థానిక మేయర్ పాల్గొన్నారు. కళ్యాణాన్ని ఆశాంతం తిలకించి, మాటల్లో వర్ణించలేని అనుభూతి కలిగిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. పచ్చని ప్రకృతి, కొండల నడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, తితిదే చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవం వీక్షించిన భక్తులకు ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. శ్రీ వెంకటేశ్వర సెంటర్ (ఫ్రాన్స్) సభ్యులు కన్నాబిరెన్ మాట్లాడుతూ...గతంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించినప్పటికీ ఇంతపెద్ద ఎత్తున స్వామి వారి కళ్యాణం జరగడం ఇదే మొదటిసారి అని, మాటల్లో వర్ణించలేని మహత్తర కార్యక్రమమని సంతోషం వ్యక్తం చేసారు. ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. ప్రవాసులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. అన్ని నగరాలలో భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ...కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్య ధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారన్నారు. ఈ వారంతంలో అనగా 12వ తేదీన పెద్దఎత్తున ఇంగ్లాండ్ లోని లండన్, 13వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్లో కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీంతో యూకే యూరోప్ దేశాలలోని 11 నగరాలలో దేవదేవుడి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. కన్నులపండువలా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఏఈవో శ్రీ వెంకటేశ్వర్లు, యూకే తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కిల్లి సత్య ప్రసాద్, శివాలయం ఈ.వీ. సెంటర్ శర్మ, తదితరులు (మునిక్, జర్మనీ), మన తెలుగు అసోసియేషన్, జర్మనీ- ఈ.వీ. సభ్యులు, శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ (ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ) సభ్యులు మాణిక్యాంబ, జవాజి వెంకట కృష్ణ, వెంకటేశ్వర టెంపుల్ (పారిస్, ఫ్రాన్స్) సభ్యులు, ఆయా నగరాలలోని కార్యనిర్వాహకులు, తెలుగు, భారతీయ భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణోత్సవం
నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీవారి ఆనంద నిలయంలో శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీ, వీపీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం దేవదేవేరుల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్ ఎల్ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు కల్యాణ వధూవరులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ బద్ధంగా సాయంత్రం 6.30 గంటలకు వేదపండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాకంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని, సంకల్పం, భక్తసంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణో త్సవాన్ని నిర్వహించారు. అనంతరం నక్షత్రహారతి, మంగళహారతులతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. భక్తులు వేలాదిగా హాజరై కల్యాణ వేంకటేశ్వరుడిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందడోలికల్లో ఓలలాడారు. గోవింద నామస్మరణతో పులకింతులయ్యారు. అంతకు ముందు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకరణలో శ్రీనివాసుడు భక్తులను కరుణించారు. రాత్రి 10 నుంచి 10.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. తదుపరి రాత్రి 10.30 గంటల తర్వాత ఏకాంత సేవ జరిగింది. చివరి సేవతో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్ ఎల్ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుపతి ఎమ్పీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ కల్యాణచక్రవర్తి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, జేఈఓ సదాభార్గవి తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పుష్పయాగం సప్తవర్ణశోభితంగా భక్తులను కనువిందు చేసింది. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టీటీడీ, వీపీఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, న్యూఢిల్లీ ఎస్వీ టెంపుల్ ఎల్ఏసీ అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీనివాసుడికి నమూనా ఆనంద నిలయంలో శనివారం ఉదయం పుష్పయాగం నయనానందకరంగా జరిగింది. ఆ దివ్యమనోహర దృశ్యాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు. స్వామి, అమ్మవార్లకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు, నూరువరహాలు, కనకాంబరాలు తదితర 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి రెండు టన్నుల సుగంధభరిత పుష్పాలతో ఆద్యంతం శోభాయమానంగా సాగిన పుష్పయాగ మహోత్సవాన్ని కనులారా చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఉత్సవాల్లో, నిత్యకైంకర్యాల్లో అర్చకులు, అధికార, అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏదైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణతో సమస్తదోషాలు పరిహారమవుతాయని విశ్వాసం. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. నిత్యకైంకర్యాలు శ్రీవారికి ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులును వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. -
ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరియాలి
ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నగరంలో కన్నుల పండువగా వేంకటేశ్వర వైభవోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 12 వరకు వేడుకలు సాక్షి, హైదరాబాద్: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి భాగ్యనగరానికి రావడం మన అదృష్టమని, ఆయనను దర్శించుకునేందుకు నగరవాసులకు ఇది చక్కటి అవకాశమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వారు చక్కటి ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారని, పరిపుష్టంగా, ఉత్కృష్టంగా సాగే ఈ వేడుకలతో భాగ్యనగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. టీటీడీ, హిందూధర్మ ప్రచార పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించిన ‘శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవములు-2016’ అంకురార్పణకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాలుపంచుకున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆరు రోజుల పాటు జరుగను న్న ఈ వేడుకలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మందిరం, గుడి గోపురం, ఆలయ ప్రాంగణం, శ్రీలక్ష్మీ, భూదేవీ సమేతుడై కొలువుదీరిన ఏడుకొండలవాడి విగ్రహం భక్తజనసందోహాన్ని మంత్రముగ్ధులను చేశాయి. వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసిన హర్ష టయోటా అధినేత హర్షవర్ధన్, ఆయన మిత్రబృందాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత సంస్కృతి మహోన్నతమైంది కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మానవాళికి శాంతి, సుఖం, సౌభాగ్యం కలగడం కోసం యజ్ఞాలు, యాగాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని చెప్పారు. ప్రజల్లో ధర్మ అనురక్తి పెరగడం కోసం, మనసుకు శాంతిని, సంకల్ప బలాన్ని అందజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. సీఎం కేసీఆర్ మానవాళి శాంతి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఇటీవలే అయుత చండీయాగం చేశారని ఆయన గుర్తు చేశారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని, యావత్తు మానవాళి సంక్షేమం కోసం పాటుపడడం ఈ సంస్కృతి గొప్పతనమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేంద్రభారతి ప్రవచనములు ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూ ర్తి, ఈవో సాంబశివరావు, టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.