sribagh agreement
-
‘సీమ’ గర్జన: 1937 పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే..
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు రాయలసీమ వాసులు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల భారీ బహిరంగ సభకు వేదిక కానుంది.దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే.. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్ ఒప్పందం అటకెక్కింది. దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని, కేవలం పాలనా రంగంలోనే కాక జల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో నేడు(సోమవారం) చేపట్టిందే రాయలసీమ గర్జన. రాష్ట్ర విభజన సమయంలో సైతం ఇక్కడ ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు. -
కర్నూలులో హైకోర్టు ‘సీమ’వాసుల ఆకాంక్ష
సాక్షి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటనేది ‘సీమ’వాసుల ఆకాంక్ష. దశాబ్దాల తరబడి పాలకులు ఈ విషయంలో కర్నూలుకు న్యాయం చేయలేకపోయారు. రాయలసీమ అభివృద్ధి, ప్రయోజనాల నేపథ్యంలో పుట్టుకొచ్చిన సంఘాలు కూడా హైకోర్టు ఏర్పాటు చేయాలని, శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని వాణి విన్పిస్తూనే ఉన్నాయి. రాష్ట్రవిభజన సమయంలో, ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతి పేరును ప్రకటించే సమయంలో కూడా కర్నూలును రాజధానిగా ప్రకటించాలని గళం విప్పారు. అమరావతి పేరు ప్రకటించిన తర్వాత చివరకు హైకోర్టు అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదీ నెరవేరకపోగా..తుదకు హైకోర్టు బెంచ్‌ను కొన్ని పక్షాలు కోరాయి. అయితే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలా వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాలనా వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టుతో కూడిన న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి.. శాసనమండలికి పంపించారు. కానీ మండలిలో బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు పథకం ప్రకారం అడ్డుకున్నారు. పాలనా వికేంద్రీకరణ విషయంలో నెల రోజులుగా టీడీపీ జిల్లా ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. అభివృద్ధిని విస్మరించి.. రాజకీయాలే పరమావధిగా.. ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నేతలు ఇంతకుముందు రాజకీయాలు చేసేవారు. తమ ప్రాంతానికి నష్టం జరిగేలా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏవైనా చర్యలు తీసుకుంటే పదవులు, పార్టీలకు రాజీనామాలు చేసేవారు. ఇప్పుడు హైకోర్టు కర్నూలుకు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నా.. జిల్లాలో అధికార పార్టీ నేతలు మినహా తక్కిన రాజకీయపక్షాల నాయకులు నోరుమెదపడం లేదు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పుడు టీడీపీ అధిష్టానానికి విరుద్ధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటును టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఇతర టీడీపీ నేతలు స్వాగతించలేకపోయారు. పైగా అమరావతికి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. జిల్లావాసి అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా టీడీపీ బాటలోనే నడుస్తున్నారు. ఆయన తీరును స్వయాన సీపీఐ జిల్లా నాయకులు తప్పుబట్టినా, ఆయన మాత్రం చంద్రబాబును వీడడం లేదు. వీరితో పాటు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం కూడా “హైకోర్టు’ విషయంలో మాట్లాడకపోవడంపై పరిశీలకులు పెదవివిరుస్తున్నారు. జిల్లాకు మేలు జరిగే అంశంలో అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిస్తున్నారు. హైకోర్టుకు మద్దతుగా అలుపెరగని పోరు హైకోర్టుకు మద్దతుగా న్యాయవాదులు మోహన్‌రెడ్డి, గోపాలకృష్ణతో పాటు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల రిలేదీక్షలు చేపట్టారు. మండలిలో టీడీపీ వ్యవహారం తర్వాత ఆ పార్టీ తీరుకు నిరసనగా, ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల్లో నాయకులు, పార్టీ శ్రేణులు హైకోర్టుకు మద్దతుగా ర్యాలీలు చేశారు. రాయలసీమ విద్యార్థి, యువజన విభాగాలు జేఏసీగా ఏర్పడి.. పోరాటం చేస్తున్నాయి. రాయలసీమ ప్రజాసంఘాలు సైతం జేఏసీగా ఏర్పడి... శేషఫణి, సత్తెన్న ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నాయి. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా, కులసంఘాల నాయకులు పోరాడుతున్నారు. అయితే వీరికి అధికారపక్షం మినహా ఇతర రాజకీయపార్టీల నుంచి మద్దతు లభించడం లేదు. ‘నోటిదాకా వచ్చిన కూడును దూరం చేసినట్టు’ జిల్లా వరకూ వచ్చిన హైకోర్టును దూరం చేసేలా టీడీపీ వ్యవహరిస్తుంటే.. జిల్లా ప్రయోజనాలకు అనువుగా ఇతర పార్టీలు గళం విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిణామాన్ని మేధావులు, విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రాంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. హైకోర్టుకు మద్దతుగా కడప, అనంతపురం, తిరుపతిలో రోజూ ఉద్యమాలు చేస్తుంటే..కర్నూలులో అంతా మౌనంగా ఉండటం మంచిదికాదని, ఇది ‘మనకు మనం అన్యాయం చేసుకోవడమే’ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ హైకోర్టుకు మద్దతుగా వాణి విన్పించాలని సూచిస్తున్నారు. ‘శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాయలసీమ అభివృద్ధిపై ఇన్నాళ్లూ పాలకులు శీతకన్ను వేశారు. హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ఉద్యమం ఆగదు.’ కొన్నేళ్లుగా రాయలసీమ వాదుల ప్రకటనలు ఇవీ.. ‘పాలన ఒకేచోట కేంద్రీకృతమైతే అభివృద్ధి కూడా కేంద్రీకృతమవుతుంది. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది. అందుకే కర్నూలును న్యాయరాజధానిగా చేస్తూ హైకోర్టును ఏర్పాటు చేస్తున్నాం.’ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం ‘ఒకే రాజధాని ఉండాలి. అందులోనే చట్టసభలు, హైకోర్టు, సచివాలయం ఉండాలి. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం’ – జిల్లా వాసులైన సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత సోమిశెట్టి మాట ఇదీ.. స్వార్థంతో ఆలోచన చేస్తున్నారు జిల్లాలోని టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు వారి పార్టీలు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ తప్పా అందరూ వ్యతిరేకమే. ఇన్నాళ్లూ సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. చివరకు హైకోర్టు వచ్చే సమయంలో మిన్నకుండిపోయారు. ప్రజల అభిప్రాయంతో పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. – టి.చంద్రప్ప, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీమకు న్యాయం చేయాలన్నదే సీఎం ఆలోచన 2014లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా అమరావతిలో రాజధాని ప్రకటించారు. ఆనాడు అన్ని పార్టీలు కర్నూలులో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలని కోరాయి. అయినా పట్టించుకోలేదు. కర్నూలుకు 1956లో ఒకసారి, 2014లో మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. దీన్ని సరిదిద్దాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలి. – ఇందిరాశాంతి, లెక్చరర్, కేవీఆర్ కళాశాల, కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీల తీరు బాగోలేదు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీనాయుడు, ఫరూక్ మద్దతు తెలపకపోవడం అన్యాయం. కర్నూలుకు న్యాయం చేసుకునే అవకాశాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వీరిని చరిత్ర క్షమించదు. – రోషన్ అలీ, రిటైర్డ్ తహసీల్దార్ గళం విప్పాలి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావాలి. ఇందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా.. ఇతర పార్టీలు స్వాగతించకపోవడం తగదు. ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలి. – అంబన్న, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వెలిగొండ, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెంచాలని రాయలసీమ ఉద్యమ నేత, కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ ‘నిత్యం కరువు కాటకాలను ఎదుర్కొనే రాయలసీమ జిల్లాలకు గోదావరి జలాలను ఎక్కడి నుంచి తరలించినా మాకు సమ్మతమే. దీనిపై అనవసర రాజకీయాలు తగదు. ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ముందు రాయలసీమ అవసరాలు తీరాక కింది ప్రాంతాలకు వదలాలి. ఇప్పటికే రాజధాని, హైకోర్ట్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కోస్తాకే తరలించారు. కనీసం కరువు సీమకు నీళ్లిచ్చే విషయంలో అయినా రాజకీయాలు కాకుండా మానవతా కోణంలో ఆలోచించండి. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్దత కల్పించాలి. తెలంగాణాతో మాట్లాడి 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించాలని కోరారు. -
1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం చర్చలు
కర్నూలు(న్యూసిటీ) : కర్నూలును రాజధానిగా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం కలెక్టరేట్ ఎదుట రాయలసీమ విద్యార్థి సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కొత్త బస్టాండ్ నుంచి రాజ్‌విహార్, బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు అక్కడ నుంచి సీక్యాంప్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రశేఖర్, శ్రీరాములు మాట్లాడుతూ 1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం చర్చల ఫలితంగా కర్నూలును రాజధానిగా చేయాలని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీకి చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు కన్నభూమికి ద్రోహం చేశారని ఆరోపించారు. రాయలసీమలో కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు నాయుడును అడ్డుకుంటామని హెచ్చరించారు. -
రాయలసీమలోనే రాజధాని
రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం వ్యవహరించాలి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని శ్రీబాగ్ ఒప్పందం (1937) ప్రకారం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయల సీమ రాజధాని సాధన సమితి డిమాండ్ చేసింది. ఒకప్పటి రాయలసీమలోని ఆరు జిల్లాల్లో ఎక్కడ రాజధానిని నిర్మించినా తమకు అభ్యం తరం లేదని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లో సమితి ఆధ్వర్యం లో ‘శ్రీబాగ్ ఒప్పందం అమలు- పెద్ద మనుషుల బాధ్యత- ఏపీ రాజధాని రాయలసీమ హక్కు’ పేరుతో డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మూడు తీర్మానాలను ఆమోదించారు. రాజధాని ఏర్పాటుతో పాటు రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం తాగు, సాగునీటి వనరులను అభివృద్ధి చేయూలని, ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు, విద్య-వైద్య సంస్థలు సీమలో ఏర్పాటు చేయాలని ఆ తీర్మానాలలో విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో బ్రహ్మిణీ స్టీల్స్ స్థానంలో సెయిల్ ఆధ్వర్యంలో కేంద్రమే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లీకులతో మరోసారి విభజనకు ఆస్కారం ఇవ్వొద్దు: మైసూరా ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో ఇక్కడ, కాదు అక్కడని లీకులు ఇవ్వడం ద్వారా మరోసారి రాష్ట్ర విభజనకు ఆస్కారం ఇవ్వొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమి టీ సభ్యుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతు న్నారన్నారు. సీఎం, ప్రతిపక్ష నేత ఇద్దరు సీమ వారే ఉన్నా.. న్యాయం జరుగుతుందా లేదా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారన్నారు. సీమకు అన్నింటా అన్యాయం: జస్టిస్ లక్ష్మణ్రెడి ్డ ‘రాయలసీమ అన్నింటా నాశనమైందని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచింది. బళ్లారిని పోగొట్టుకున్నాం. మిగులు జలాలపై హక్కు లేకుండా పోయింది. 1956లో ఏపీ ఏర్పడిన తర్వాత అన్ని రం గాల్లో అన్యాయం జరిగింది. నీటి పారుదల రంగంలో అయితే చెప్పలేనంతగా నష్టపోయాం..’అని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. సీమ ఉద్యమం వల్లే పోలవరానికి జాతీయ హోదా లభించిందని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణను రాయలసీమకు ఇవ్వాలని కోరారు. ఏకాభిప్రాయం అవసరం: రాఘవులు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా చేసినవారిలో ఎక్కువమంది సీమ వారేనని, వారు చిత్తశుద్ధితో కృషి చేసి ఉంటే సీమ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండి ఉండేదని సీపీఎం సీనియర్ నేత బి.వి.రాఘవులు అన్నారు. ఇప్పుడైనా రాజధాని విషయంలో పాలకులు అన్ని రాజకీయ పక్షాల్లో ఏకాభిప్రాయానికి కృషి చేయూలని సూచించారు. రాయలసీమలోనే రాజధాని ఉండాలన్న ఆ ప్రాంతవాసుల బలమైన కోరికను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం ఒకే ప్రాంతాన్ని రాజధానిగా సూచిద్దామని రాయలసీమ ఉద్యమ నేత వెంకటస్వామి పిలుపునిచ్చారు. సీమను అన్నింటా వదిలేస్తూ పోతే తెలుగుజాతి మూడు ముక్కలవడం ఖాయమని విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డి అన్నారు. విశ్రాంత ఐజీ హనుమంతరెడ్డి, సమితికి చెందిన శ్యామల, దశరథరామిరెడ్డి, ఏపీఎన్జీవో నేత గోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. -
'రాజధానికి శ్రీబాగ్ ఒప్పందాన్నిఅమలు చేయండి'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాయలసీమ రాజధాని సాధన సమితి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి సహా ఇతరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయని లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీరు, విద్య, అభివృద్ధిలో రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉందన్నారు. అప్పటి ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటం సమయంలో రాయలసీమ ప్రజలు పాల్గొనకపోవడంతో పెద్దమనుషుల ఒప్పందం కుదిరిందన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అంటూ ఒకటి ఏర్పడితే రాజధాని రాయలసీమ జిల్లాల్లోనూ ఉండాలని ఒప్పందం కుదిరిందన్నారు.హైకోర్టును కోస్తా జిల్లాల్లో పెట్టాలని కూడా అప్పుడే ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఒప్పందం కుదిరిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నారని,అప్పటి ఒప్పందం ప్రకారమే కర్నూలును రాజధానిగా పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు కూడా ఆ ఒప్పందం ప్రకారమే నడుచుకోవాలన్నారు.