రాయలసీమలోనే రాజధాని
రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం వ్యవహరించాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని శ్రీబాగ్ ఒప్పందం (1937) ప్రకారం రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయల సీమ రాజధాని సాధన సమితి డిమాండ్ చేసింది. ఒకప్పటి రాయలసీమలోని ఆరు జిల్లాల్లో ఎక్కడ రాజధానిని నిర్మించినా తమకు అభ్యం తరం లేదని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్‌లో సమితి ఆధ్వర్యం లో ‘శ్రీబాగ్ ఒప్పందం అమలు- పెద్ద మనుషుల బాధ్యత- ఏపీ రాజధాని రాయలసీమ హక్కు’ పేరుతో డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భం గా మూడు తీర్మానాలను ఆమోదించారు. రాజధాని ఏర్పాటుతో పాటు రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం తాగు, సాగునీటి వనరులను అభివృద్ధి చేయూలని, ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు, విద్య-వైద్య సంస్థలు సీమలో ఏర్పాటు చేయాలని ఆ తీర్మానాలలో విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో బ్రహ్మిణీ స్టీల్స్ స్థానంలో సెయిల్ ఆధ్వర్యంలో కేంద్రమే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
లీకులతో మరోసారి విభజనకు ఆస్కారం ఇవ్వొద్దు: మైసూరా
ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో ఇక్కడ, కాదు అక్కడని లీకులు ఇవ్వడం ద్వారా మరోసారి రాష్ట్ర విభజనకు ఆస్కారం ఇవ్వొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమి టీ సభ్యుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి అన్నారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్రంలోని సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతు న్నారన్నారు. సీఎం, ప్రతిపక్ష నేత ఇద్దరు సీమ వారే ఉన్నా.. న్యాయం జరుగుతుందా లేదా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారన్నారు.
సీమకు అన్నింటా అన్యాయం: జస్టిస్ లక్ష్మణ్‌రెడి ్డ
‘రాయలసీమ అన్నింటా నాశనమైందని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పొందుపరిచింది. బళ్లారిని పోగొట్టుకున్నాం. మిగులు జలాలపై హక్కు లేకుండా పోయింది. 1956లో ఏపీ ఏర్పడిన తర్వాత అన్ని రం గాల్లో అన్యాయం జరిగింది. నీటి పారుదల రంగంలో అయితే చెప్పలేనంతగా నష్టపోయాం..’అని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, రాజధాని సాధన సమితి కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. సీమ ఉద్యమం వల్లే పోలవరానికి జాతీయ హోదా లభించిందని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణను రాయలసీమకు ఇవ్వాలని కోరారు.
ఏకాభిప్రాయం అవసరం: రాఘవులు
ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా చేసినవారిలో ఎక్కువమంది సీమ వారేనని, వారు చిత్తశుద్ధితో కృషి చేసి ఉంటే సీమ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండి ఉండేదని సీపీఎం సీనియర్ నేత బి.వి.రాఘవులు అన్నారు. ఇప్పుడైనా రాజధాని విషయంలో పాలకులు అన్ని రాజకీయ పక్షాల్లో ఏకాభిప్రాయానికి కృషి చేయూలని సూచించారు.
రాయలసీమలోనే రాజధాని ఉండాలన్న ఆ ప్రాంతవాసుల బలమైన కోరికను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం ఒకే ప్రాంతాన్ని రాజధానిగా సూచిద్దామని రాయలసీమ ఉద్యమ నేత వెంకటస్వామి పిలుపునిచ్చారు. సీమను అన్నింటా వదిలేస్తూ పోతే తెలుగుజాతి మూడు ముక్కలవడం ఖాయమని విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డి అన్నారు. విశ్రాంత ఐజీ హనుమంతరెడ్డి, సమితికి చెందిన శ్యామల, దశరథరామిరెడ్డి, ఏపీఎన్‌జీవో నేత గోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.