Rayalaseema: మన రాయలసీమది ఘన చరిత్ర
రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథ కాదు. నాటి నిజాం, ఆంగ్లేయుల పాలనతోనే కరువుసీమగా మారింది. నిజాం తమ అవసరాల కోసం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబర్ 18.
1800 సంవత్సరానికి పూర్వం రాయలసీమ రతనాల సీమ. రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం, వరుస దాడుల కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠాలతో యుద్ధ భయం ఉన్న నిజాం ఆంగ్లేయులతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహారం ఇవ్వలేక సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలి వేసినాడు. బలమైన సైనిక సామర్థ్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన పాలెగాళ్లు నిలువలేకపోయినారు. అయినా ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలెగాళ్లు తొలి స్వాతంత్య్రోద్యమాన్ని నిర్వహించారు. అయినా ఈనాటికీ వారికి ఆ స్థానం లభించలేదు. ఆంగ్లే యులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీడెడ్ జిల్లాలుగా పిలిచారు. తెలుగులో దత్తమండలం అని పిలిచినా, సీడెడ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్థం సరికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అనడం కన్నా, ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్ననలను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు.
నంద్యాల సభలో కీలక నిర్ణయం
1913లో ప్రారంభమైన ఆంధ్ర మహసభలు 1928లో నవంబర్ 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు దత్తమండలం సమస్యలపై అవకాశం ఇస్తేనే సహకరిస్తామన్న ఈ ప్రాంత నేతల ఒత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రథమ దత్తమండల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న చిలుకూరి నారా యణరావు గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదనీ, రేనాడు రాజులు, విజయనగర రాజులు పాలించిన నేపథ్యం ఉన్నందున రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందనీ ప్రతిపాదించినారు. దాన్ని పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నాటి నుంచి రాయలసీమ పేరు వాడుకలోకి వచ్చింది.
అన్నమయ్య, వేమన లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం రాయలసీమ. పప్పూరి తెలుగు ప్రజలు గర్విం చదగ్గ దేశభక్తుడు. వారి జయంతిని ప్రభుత్వం అధికారి కంగా నిర్వహిస్తే సముచితంగా ఉంటుంది. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని తెలుస్తున్నా, ఆ వైపుగా కేంద్రం దగ్గర అధికారిక గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వం దైవ కార్యక్రమం అయిన కృష్ణ పుష్కరాలను నది ప్రారంభమైన శ్రీశైలం దగ్గర కాకుండా సముద్రంలో కలిసే దగ్గర నిర్వ హించింది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ ముఖ ద్వారం ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పుష్కరాలు నిర్వహిం చారు. శ్రీశైలంలో నిర్వహిస్తే ప్రజలు పాల్గొని మన రాయల సీమలో పుష్కలంగా నీరు ప్రవహిస్తుందన్న చైతన్యం ప్రజలలో వస్తుంది.
1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే, ఆంధ్రప్రాంతంతో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు నడుస్తున్న రోజు లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో స్థాపించాలని 1926లో జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానాన్ని, మద్రాసు శాసనసభ తీర్మానాన్ని సైతం ఉల్లంఘించి అనం తలో ఉండాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ, అటు పిమ్మట వైజాగ్ తరలించారు. గత అనుభవాన్ని మరిచి అమాయక సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం అవగాహనతో ఆంధ్ర రాష్ట్రంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాలకే తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్గా మారినపుడు పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన ‘కర్నూలు రాజధాని’ డిమాండును వదులుకున్నారు. కీలక సమయం వచ్చినపుడు తప్పుటడు గుల కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ 2014లోనైనా సీమకు రాజధాని రావాల్సి ఉంది. కానీ కనీసం హైకోర్టు కూడా రాలేదు.
వికేంద్రీకరణలో న్యాయం జరగాలి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ విధానంలో భాగంగా రాజధానిలోని మూడు కీలక వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుతో బాటు న్యాయ స్వభావం ఉన్న కార్యాలయాలను కర్నూలులో నెలకొల్పడానికి ముందుకు వచ్చారు. ఈ వెసులుబాటును కూడా రాయలసీమకు రావాడాన్ని వ్యతిరేకించే పరిస్థితులు నెల కొన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ‘కేఆర్ఎంబీ’ని కర్నూలులో ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వంలో రోజు వారీ సమీక్షతో సంబంధం లేని పలు కమిషనరేట్లు రాయలసీమలో ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా శ్రీభాగ్ ఒప్పందంలో కీలకమైన కృష్ణా, తుంగభద్ర నీటిని రాయలసీమకు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అది జరగాలంటే సిద్ధేశ్వరం, గుండ్రేవుల, పోతిరెడ్డిపాడు వెడల్పు, కాల్వల సామర్థ్యం పెంపు, చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలి. కృష్ణా నీటిలో ఏపీ వాటానుంచి తమకు అధికంగా కేటాయింపులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో రాయలసీమ ప్రాజెక్టులైన గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ నిర్మాణం పూర్తి చేసి, రాష్టానికి నీటి అవసరాల ప్రాధాన్యతను కోర్టుల ముందుంచాలి. లేకపోతే రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు ప్రశ్నగా మిగిలిపోతుంది. (క్లిక్ చేయండి: సంక్షోభం నుంచి సంక్షేమం లోకి...)
- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
వ్యాసకర్త సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం
(నవంబర్ 18 ‘రాయలసీమ’గా నామకరణం జరిగిన రోజు)