12 శాతం సంపాదన సంగీతానికే...
న్యూఢిల్లీ: సంగీతమంటే చెవి కోసుకునేవాళ్లు ఉంటారని విన్నాం.. మధురమైన సంగీతానికి ప్రకృతి కూడా స్పందిస్తుందనీ విన్నాం.. చెవికోసుకోవడం, స్పందించడం మాటేమోగానీ.. భారతీయులు సంగీతం కోసం తమ సంపాదనలో 12 శాతం వరకూ ఖర్చు చేస్తున్నారని మాత్రం ఇప్పుడే తెలుసుకుంటున్నాం. ఇదేంటి అంటారా? ప్రముఖ ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 23 పట్టణాల్లో 7,500 మందిని ప్రశ్నించి ఈ నిర్ధారణకు వచ్చారు. సగటున ఒక భారతీయుడు వారంలో 15 గంటలపాటు సంగీతం వింటున్నాడని సర్వే పేర్కొంది.
సంగీతానికి సంబంధించి దేశంలో స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది. పెద్ద నగరాల కంటే ఓ మోస్తరు నగరాల్లో ఉన్నవారే సంగీతాన్ని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుని వింటున్నారని సోనీ సంస్థ భారత ప్రతినిధి శ్రీధర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. మొత్తంగా 40 శాతం మంది యువత మ్యూజిక్ అప్డేట్ల కోసం నేరుగా ఫేస్బుక్ వంటి సామాజిక వెబ్సైట్లలో ఆయా సంగీత విద్వాంసులు, గాయకులను అనుసరిస్తున్నారని సర్వేలో వెల్లడైందని చెప్పారు. మీకు సంగీతం అంటే ఇష్టమా..? నచ్చిన పాటలు, సంగీతం కోసం ఎంతైనా ఖర్చుపెడతారా..? అయితే మీరూ ఈ జాబితాలో ఉన్నట్లే!