కోర్టు శ్రీకాకుళంలో.. సాక్షులు అమెరికాలో!
రాష్ట్రంలోనే తొలిసారి ఆన్లైన్ విచారణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాక్షులు అమెరికాలో ఉన్నారు. కోర్టు శ్రీకాకుళంలో ఉంది. అయితేనేం.. సాంకేతిక పరిజ్ఞానం ఉరకలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో విచారణ ప్రక్రియకు దూరాన్ని చెరిపేస్తూ ఆన్లైన్లో సాక్షుల విచారణ జరిపారు న్యాయమూర్తులు. ఇలా ఆన్లైన్లో విచారణ చేపట్టడం రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత శ్రీకాకుళం కోర్టుకు దక్కింది. గృహ హింస చట్టం కింద నమోదైన కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి, ఫస్టుక్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వై.శ్రీనివాసరావు బుధవారం విచారణ చేశారు.
ఈ కేసులో అమెరికాలో ఉన్న సాక్షులను ఆన్లైన్లో విచారించారు. సుప్రీంకోర్టు పలు కేసుల సందర్భాల్లో వెలువరించిన మార్గదర్శకాలను అనుసరించి ఇందులో విచారణ చేపట్టి రుజువులను నమోదు చేశారు.దీంతో కోర్టుకు సమయం ఆదాతోపాటు.. కక్షిదారులకు సమయం ఆదా, నగదు వ్యయం కూడా ఆదా అవుతుంది.