Srikakulam municipality
-
మున్సి‘పోల్స్’ లేనట్లే!
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఆరు గ్రామాల విలీనాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను, ఇటీవలే 36 వార్డులను 50 డివిజన్లుగా పునర్విభజన చేసేందుకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పురపాలక శాఖ మంత్రి నారాయణ మిరచిపోయారు. సాంకేతిక సమస్యలు... న్యాయవివాదం... అంటూ పాత విషయాన్ని తెరపైకి తెచ్చారు. అయితే నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరగవని, వచ్చే మార్చి నెల తర్వాతే ఉంటాయన్న విషయాన్ని ‘సాక్షి’ మూణ్నెల్ల క్రితమే వెల్లడించింది. ప్రత్యక్ష ఎన్నికలలో ఓటమి భయంతోనే మంత్రి నారాయణ కుంటిసాకులు చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రేడ్-1 మున్సిపాలిటీ అయిన శ్రీకాకుళాన్ని నగరపాలక సంస్థగా మార్పు చేయాలనే ప్రతిపాదన తొలుత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చింది. అప్పట్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవ తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఒక గ్రేడ్-1 మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేయాలంటే కనీసం లక్షా యాభై వేల జనాభా ఉండాలి. కానీ అప్పటికి శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1.25 లక్షల జనాభా మాత్రమే ఉంది. దీంతో మున్సిపాలిటీ పరిసర గ్రామ పంచాయతీలైన చాపరం, కిల్లిపాలెం, పెద్దపాడు, ఖాజీపేట, పాత్రునివలస, ఎచ్చెర్ల మండలంలోని తోటపాలం, కుశాలపురం గ్రామాలను విలీనం చేస్తూ 2012, ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో నం.30 జారీ చేసింది. వాటిలో పెద్దపాడు పంచాయతీ మాత్రమే విలీనానికి అంగీకరిస్తూ తీర్మానం చేసింది. మిగతా పంచాయతీలు విలీన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. నగరపాలక సంస్థ పరిధిలోకి వెళ్తే పన్నుల భారం పెరుగుతుందనే వాదనలను అప్పట్లో టీడీపీ నాయకులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పెద్దపాడు మినహా మిగిలిన పంచాయతీల్లో 2014 సంవత్సరంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. అలా ఎన్నికై న జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కూడా పంచాయతీల విలీనాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా పంచాయతీల విలీన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేస్తూ గత ఏడాది మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. నెల క్రితమే ‘పునర్విభజన’ జీవో.. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల ఎన్నికలు డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణతో పాటు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్చార్జి పరిటాల సునీత కూడా నిన్నటివరకూ పదేపదే చెబుతూ వచ్చారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగానే శ్రీకాకుళం నగరంలోని 36 వార్డులను 50 డివిజన్లుగా పునర్విభజన చేయడానికి నెల రోజుల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలీన గ్రామాలను మినహయించి గత 36 వార్డుల పరిధిలోనే 50 డివిజన్లను ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులు ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు. వాస్తవానికి ఆ ముసాయిదాను ఈనెల 2వ తేదీలోగా విడుదల చేయాల్సి ఉంది. వ్యతిరేక పవనాల వల్లే వాయిదా? విశ్వసనీయ సమాచారం ప్రకారం... టీడీపీ ప్రభుత్వం పోలీసు ఇంటెలిజెన్స విభాగంతో, అలాగే ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జరిపిన సర్వేల్లోనూ, ఓ సామాజికవర్గం నాయకులు తమ అనుచరులతో ప్రత్యేకంగా చేయించిన అభిప్రాయ సేకరణలోనూ వ్యతిరేక ఫలితాలే వస్తాయని తేలింది. దీనికితోడు డివిజన్ల విభజనపై టీడీపీలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరులు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అనుచరుల మధ్య వర్గపోరు మొదలైంది. మంత్రి ఆదేశాలతో డివిజన్ల విభజన ఫైల్‌కు బ్రేక్ పడిందని ‘సాక్షి’ ఇప్పటికే వెల్లడించింది. ఇటీవలే విజయనగరం జిల్లా సారిక గ్రామ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సర్పంచిగా విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే భంగపడక తప్పదనే వాదన టీడీపీలోనే అంతర్గతంగా మొదలైంది. ఇక విశాఖ నగరంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం కావడం కూడా టీడీపీ నాయకులు వెనకడుగు వేయడానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వాయిదా వేయడానికి కారణమేదీ కనిపించక మంత్రి నారాయణ కుంటిసాకులు చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
బాబు, అచ్చెన్నలకు ధర్మాన సవాల్
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు బహిరంగ సవాల్ విసిరారు. శ్రీకాకుళం మున్సిపాలిటీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ధర్మాన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసి... ఉప ఎన్నికల్లో గెలవాలని ధర్మాన ప్రసాదరావు సవాల్ విసిరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే... సైకిల్ పార్టీ ఓటమి తప్పదన్నారు. గురువారం శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రెడ్డి శాంతితోపాటు పలువురు జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
శ్రీకాకుళం ఇక కార్పొరేషన్!
రిమ్స్‌క్యాంపస్:శ్రీకాకుళం మున్సిపాలిటీకి నగర శోభ పట్టనుంది. స్థాయి పెరిగి పురపాలక సంఘం నుంచి నగరపాలక సంఘం స్థాయికి ఎదగనుంది. మున్సిపాలిటీ స్థాయిని పెంచుతూ కార్పొరేషన్‌గా మార్చేందుకు సోమవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై అధికారికంగా గ్రీన్ సిగ్నల్ రానుంది. ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్‌లో ఉంది. దీని తరువాత స్పెషల్ గ్రేడ్, ఆ తరువాత సెలక్షన్ గ్రేడ్‌కు చేరి తరువాత కార్పొరేషన్ కావాల్సి ఉంది. కాని మంత్రి వర్గం నిర్ణయంతో ఇవేవీ లేకుండానే నేరుగా కార్పొరేషన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. 1885లో ఏర్పడిన ఈ మున్సిపాలిటీ ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్తా ముందంజలోనే ఉంది. నష్టాలేవీ లేకుండా కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో కార్పొరేషన్ అయితే మరింత అభివృద్ధి సాధ్యమంటున్నారు మున్సిపల్ అధికారులు. అయితే ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ప్రజలకు తప్పవు. పన్నులు విపరీతంగా పెరగడం, భూమి ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు అవకాశం ఉంది. కలువనున్న పలు గ్రామాలు ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపాలిటీలో 36 వార్డులు, పెద్దపాడు పంచాయతీ ఉండగా, లక్షా 30 వేల మంది జనాభా ఉంది. సాధారణంగా కార్పొరేషన్ స్థాయికి పెంచాలంటే ప్రస్తుతమున్న జనాభా, విస్తీర్ణం సరిపోదు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న 30 నుంచి 40 గ్రామాల వరకు శ్రీకాకుళంలో కలువనున్నాయి. అలాగే పంచాయతీల పరిధిలో ఉన్న బిల్లు కలెక్టరు వంటి సిబ్బంది కూడా కార్పొరేషన్లోనే విలీనం కానున్నారు. స్మార్ట్ సిటీగా సుమారు రూ. వంద కోట్లు శ్రీకాకుళం కార్పొరేషన్‌గా మారితే స్మార్ట్ సిటీ పథకం కింద సుమారు వంద కోట్ల రూపాయల వరకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే శ్రీకాకుళం మరింత అభివృద్ధి చెందనుంది. వచ్చే రూ. వంద కోట్లు నిధులతో రోడ్లు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. కార్పొరేషన్ పరిధిలోకి చేరే గ్రామాలు కూడా అభివృద్ధి బాట పట్టనున్నాయి. రాష్ర్టంలో మిగిలి ఉన్నవి రెండే జిల్లాలు జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ఉన్న మున్సిపాల్టీలను కార్పొరేషన్ స్థాయికి పెంచారు. ఇంకా కేవలం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కేంద్రాలు మాత్రమే కార్పొరేషన్ కాలేదు. మంత్రి వర్గం తాజా నిర్ణయంతో శ్రీకాకుళం కూడా ఆ జాబితాలో చేరనుంది. పెరగనున్న అధికారులు శ్రీకాకుళాన్ని కార్పొరేషన్ చేయటంతో అధికారులు పెరగనున్నారు. ప్రస్తుతం చైర్మన్ స్థాయి మెయిర్‌కు, వార్డు కౌన్సిలర్ల స్థాయి కార్పొరేటర్లకు పెరుగుతుంది. అలాగే ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించటంతో పాటు ఒక అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అదనంగా రానున్నారు. ప్రస్తుతం ఉన్న ఈఈ స్థాయి ఎస్ఈకి, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) స్థాయి అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)కు, సీనియ ర్ అకౌంట్ ఆఫీసర్ స్థాయి అకౌంట్ ఆఫీసర్స్థాయికి పెరగనుంది. 010 అకౌంట్ ద్వారానే వేతనాలు కార్పొరేషన్ అంటే దానికి వచ్చే ఆదాయం నుంచే ఉద్యోగుల వేతనాలను ఇస్తారనుకుంటారు. వాస్తవంగా అలానే ఇస్తారు కూడా. అయితే కేవలం విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లను మహానగర పాలక సంస్థలుగా పేర్కొంటూ ఆ రెండింటికీ మాత్రమే వాళ్లకు వచ్చే ఆదాయం నుంచే వేతనాలను ఇస్తున్నారు. మిగిలిన కార్పొరేషన్ల అన్నింటికీ 010 పద్ధ్దతిలోనే వేతనాలను చెల్లిస్తున్నారు. శ్రీకాకుళం మున్సిపాల్టీని కార్పొరేషన్ చేసిన 010 పద్ధ్దతిలోనే వేతనాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి జరుగుతుంది శ్రీకాకుళాన్ని కార్పొరేషన్ చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కేంద్రం నుంచి నిధులు రావటమే కాకుండా విస్తీర్ణం పెరిగి కొన్ని గ్రామాలు విలీనం కానున్నాయి. అధికారుల స్థాయి కూడా పెరగనుంది. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా వ్యవహరిస్తారు. 010 పద్ధతిలోనే వేతనాలు వచ్చే అవకాశం ఉంది. - బాపిరాజు, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కింద వేతనాలు చెల్లించాలి శ్రీకాకుళాన్ని కార్పొరేషన్ స్థాయికి పెంచటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. సాధారణంగా స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్‌కు వెళ్లిన తరువాత కార్పొరేషన్ స్థాయికి వెళ్లాలి. కాని నేరుగా స్థాయి పెంచాతామంటున్నారు. మరి ఎలా సాధ్యమో పాలకులే అలోచించాలి. కార్పొరేషన్ చేస్తే కచ్చితంగా 010 పద్ధతిలోనే జీతాలు చెల్లించాలి. - ఎం.వి.పద్మావతి, మున్సిపల్ మాజీ చైర్‌పర్శన్ పన్నులు పెరుగుతాయి మున్సిపాల్టీని కార్పొరేషన్ స్థాయికి పెంచితే పన్నులు పెరిగి సామాన్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. ప్రస్తుత పన్నులు చెల్లించటమే సామాన్య ప్రజానికానికి కష్టంగా ఉన్న తరుణంలో మరింత పన్నులు పెరిగితే నరకమే. - శృంగవరపు వెంకట సూర్యనారాయణ, శ్రీకాకుళం