మున్సి‘పోల్స్’ లేనట్లే! | six villages merger Cancel Srikakulam municipality | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్’ లేనట్లే!

Published Tue, Nov 8 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

మున్సి‘పోల్స్’ లేనట్లే!

మున్సి‘పోల్స్’ లేనట్లే!

 సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ఆరు గ్రామాల విలీనాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను, ఇటీవలే 36 వార్డులను 50 డివిజన్‌లుగా పునర్విభజన చేసేందుకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పురపాలక శాఖ మంత్రి నారాయణ మిరచిపోయారు. సాంకేతిక సమస్యలు... న్యాయవివాదం... అంటూ పాత విషయాన్ని తెరపైకి తెచ్చారు. అయితే నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరగవని, వచ్చే మార్చి నెల తర్వాతే ఉంటాయన్న విషయాన్ని ‘సాక్షి’ మూణ్నెల్ల క్రితమే వెల్లడించింది. ప్రత్యక్ష ఎన్నికలలో ఓటమి భయంతోనే మంత్రి నారాయణ కుంటిసాకులు చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
 
 గ్రేడ్-1 మున్సిపాలిటీ అయిన శ్రీకాకుళాన్ని నగరపాలక సంస్థగా మార్పు చేయాలనే ప్రతిపాదన తొలుత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చింది. అప్పట్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవ తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఒక గ్రేడ్-1 మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేయాలంటే కనీసం లక్షా యాభై వేల జనాభా ఉండాలి. కానీ అప్పటికి శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1.25 లక్షల జనాభా మాత్రమే ఉంది. దీంతో మున్సిపాలిటీ పరిసర గ్రామ పంచాయతీలైన చాపరం, కిల్లిపాలెం, పెద్దపాడు, ఖాజీపేట, పాత్రునివలస, ఎచ్చెర్ల మండలంలోని తోటపాలం, కుశాలపురం గ్రామాలను విలీనం చేస్తూ 2012, ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో నం.30 జారీ చేసింది. వాటిలో పెద్దపాడు పంచాయతీ మాత్రమే విలీనానికి అంగీకరిస్తూ తీర్మానం చేసింది.
 
 మిగతా పంచాయతీలు విలీన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. నగరపాలక సంస్థ పరిధిలోకి వెళ్తే పన్నుల భారం పెరుగుతుందనే వాదనలను అప్పట్లో టీడీపీ నాయకులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పెద్దపాడు మినహా మిగిలిన పంచాయతీల్లో 2014 సంవత్సరంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. అలా ఎన్నికై న జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కూడా పంచాయతీల విలీనాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా పంచాయతీల విలీన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేస్తూ గత ఏడాది మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
 
 నెల క్రితమే ‘పునర్విభజన’ జీవో..
 రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల ఎన్నికలు డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణతో పాటు జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి పరిటాల సునీత కూడా నిన్నటివరకూ పదేపదే చెబుతూ వచ్చారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగానే శ్రీకాకుళం నగరంలోని 36 వార్డులను 50 డివిజన్‌లుగా పునర్విభజన చేయడానికి నెల రోజుల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలీన గ్రామాలను మినహయించి గత 36 వార్డుల పరిధిలోనే 50 డివిజన్‌లను ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులు ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు. వాస్తవానికి ఆ ముసాయిదాను ఈనెల 2వ తేదీలోగా విడుదల చేయాల్సి ఉంది.
 
 వ్యతిరేక పవనాల వల్లే వాయిదా?
 విశ్వసనీయ సమాచారం ప్రకారం... టీడీపీ ప్రభుత్వం పోలీసు ఇంటెలిజెన్‌‌స విభాగంతో, అలాగే ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జరిపిన సర్వేల్లోనూ, ఓ సామాజికవర్గం నాయకులు తమ అనుచరులతో ప్రత్యేకంగా చేయించిన అభిప్రాయ సేకరణలోనూ వ్యతిరేక ఫలితాలే వస్తాయని తేలింది. దీనికితోడు డివిజన్‌ల విభజనపై టీడీపీలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరులు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అనుచరుల మధ్య వర్గపోరు మొదలైంది. మంత్రి ఆదేశాలతో డివిజన్‌ల విభజన ఫైల్‌కు బ్రేక్ పడిందని ‘సాక్షి’ ఇప్పటికే వెల్లడించింది.
 
 ఇటీవలే విజయనగరం జిల్లా సారిక గ్రామ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సర్పంచిగా విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే భంగపడక తప్పదనే వాదన టీడీపీలోనే అంతర్గతంగా మొదలైంది. ఇక విశాఖ నగరంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం కావడం కూడా టీడీపీ నాయకులు వెనకడుగు వేయడానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వాయిదా వేయడానికి కారణమేదీ కనిపించక మంత్రి నారాయణ కుంటిసాకులు చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement