శ్రీకాకుళం ఇక కార్పొరేషన్! | Srikakulam district longer Corporation | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం ఇక కార్పొరేషన్!

Published Tue, Feb 17 2015 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

శ్రీకాకుళం ఇక కార్పొరేషన్!

శ్రీకాకుళం ఇక కార్పొరేషన్!

 రిమ్స్‌క్యాంపస్:శ్రీకాకుళం మున్సిపాలిటీకి నగర శోభ పట్టనుంది. స్థాయి పెరిగి పురపాలక సంఘం నుంచి నగరపాలక సంఘం స్థాయికి ఎదగనుంది. మున్సిపాలిటీ స్థాయిని పెంచుతూ కార్పొరేషన్‌గా మార్చేందుకు సోమవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై అధికారికంగా గ్రీన్ సిగ్నల్ రానుంది. ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్‌లో ఉంది. దీని తరువాత స్పెషల్ గ్రేడ్, ఆ తరువాత సెలక్షన్ గ్రేడ్‌కు చేరి తరువాత కార్పొరేషన్ కావాల్సి ఉంది. కాని మంత్రి వర్గం నిర్ణయంతో ఇవేవీ లేకుండానే నేరుగా కార్పొరేషన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. 1885లో ఏర్పడిన ఈ మున్సిపాలిటీ ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్తా ముందంజలోనే ఉంది. నష్టాలేవీ లేకుండా కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో కార్పొరేషన్ అయితే మరింత అభివృద్ధి సాధ్యమంటున్నారు మున్సిపల్ అధికారులు. అయితే ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ప్రజలకు తప్పవు. పన్నులు విపరీతంగా పెరగడం, భూమి ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు అవకాశం ఉంది.
 
 కలువనున్న పలు గ్రామాలు
 ప్రస్తుతం శ్రీకాకుళం మున్సిపాలిటీలో 36 వార్డులు, పెద్దపాడు పంచాయతీ ఉండగా, లక్షా 30 వేల మంది జనాభా ఉంది. సాధారణంగా కార్పొరేషన్ స్థాయికి పెంచాలంటే ప్రస్తుతమున్న జనాభా, విస్తీర్ణం సరిపోదు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న 30 నుంచి 40 గ్రామాల వరకు శ్రీకాకుళంలో కలువనున్నాయి. అలాగే పంచాయతీల పరిధిలో ఉన్న బిల్లు కలెక్టరు వంటి సిబ్బంది కూడా కార్పొరేషన్‌లోనే విలీనం కానున్నారు.
 
 స్మార్ట్ సిటీగా సుమారు రూ. వంద కోట్లు
 శ్రీకాకుళం కార్పొరేషన్‌గా మారితే స్మార్ట్ సిటీ పథకం కింద సుమారు వంద కోట్ల రూపాయల వరకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే శ్రీకాకుళం మరింత అభివృద్ధి చెందనుంది. వచ్చే రూ. వంద కోట్లు  నిధులతో రోడ్లు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి  చేయనున్నారు. కార్పొరేషన్ పరిధిలోకి చేరే గ్రామాలు కూడా అభివృద్ధి బాట పట్టనున్నాయి.
 
 రాష్ర్టంలో మిగిలి ఉన్నవి రెండే జిల్లాలు
 జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ఉన్న మున్సిపాల్టీలను కార్పొరేషన్ స్థాయికి పెంచారు. ఇంకా కేవలం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కేంద్రాలు మాత్రమే కార్పొరేషన్ కాలేదు. మంత్రి వర్గం తాజా నిర్ణయంతో శ్రీకాకుళం కూడా ఆ జాబితాలో చేరనుంది.
 
 పెరగనున్న అధికారులు
 శ్రీకాకుళాన్ని కార్పొరేషన్ చేయటంతో అధికారులు పెరగనున్నారు. ప్రస్తుతం చైర్మన్ స్థాయి మెయిర్‌కు, వార్డు కౌన్సిలర్ల స్థాయి కార్పొరేటర్లకు పెరుగుతుంది. అలాగే ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించటంతో పాటు ఒక అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అదనంగా రానున్నారు. ప్రస్తుతం ఉన్న ఈఈ స్థాయి ఎస్‌ఈకి, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) స్థాయి అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)కు, సీనియ ర్ అకౌంట్ ఆఫీసర్ స్థాయి అకౌంట్ ఆఫీసర్‌స్థాయికి పెరగనుంది.
 
 010 అకౌంట్ ద్వారానే వేతనాలు
  కార్పొరేషన్ అంటే దానికి వచ్చే ఆదాయం నుంచే ఉద్యోగుల వేతనాలను ఇస్తారనుకుంటారు. వాస్తవంగా అలానే ఇస్తారు కూడా. అయితే కేవలం విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లను మహానగర పాలక సంస్థలుగా పేర్కొంటూ ఆ రెండింటికీ మాత్రమే వాళ్లకు వచ్చే ఆదాయం నుంచే వేతనాలను ఇస్తున్నారు. మిగిలిన కార్పొరేషన్ల అన్నింటికీ 010 పద్ధ్దతిలోనే వేతనాలను చెల్లిస్తున్నారు. శ్రీకాకుళం మున్సిపాల్టీని కార్పొరేషన్ చేసిన 010 పద్ధ్దతిలోనే వేతనాలు వచ్చే అవకాశం ఉంది.
 
 అభివృద్ధి జరుగుతుంది
 శ్రీకాకుళాన్ని కార్పొరేషన్ చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కేంద్రం నుంచి నిధులు రావటమే కాకుండా విస్తీర్ణం పెరిగి కొన్ని గ్రామాలు విలీనం కానున్నాయి. అధికారుల స్థాయి కూడా పెరగనుంది. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా వ్యవహరిస్తారు. 010 పద్ధతిలోనే వేతనాలు వచ్చే అవకాశం ఉంది.
 -  బాపిరాజు, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్
 
 కింద వేతనాలు చెల్లించాలి
 శ్రీకాకుళాన్ని కార్పొరేషన్ స్థాయికి పెంచటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. సాధారణంగా స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్‌కు వెళ్లిన తరువాత కార్పొరేషన్ స్థాయికి వెళ్లాలి. కాని నేరుగా స్థాయి పెంచాతామంటున్నారు. మరి ఎలా సాధ్యమో పాలకులే అలోచించాలి. కార్పొరేషన్ చేస్తే కచ్చితంగా 010 పద్ధతిలోనే జీతాలు చెల్లించాలి.
  - ఎం.వి.పద్మావతి, మున్సిపల్  మాజీ చైర్‌పర్శన్
 
  పన్నులు పెరుగుతాయి
 మున్సిపాల్టీని కార్పొరేషన్ స్థాయికి పెంచితే పన్నులు పెరిగి సామాన్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. ప్రస్తుత పన్నులు చెల్లించటమే సామాన్య ప్రజానికానికి కష్టంగా ఉన్న తరుణంలో మరింత పన్నులు పెరిగితే నరకమే.  
 
 - శృంగవరపు వెంకట సూర్యనారాయణ,
 శ్రీకాకుళం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement