రామం... నా సంతోషం
రేడియో అంతరంగాలు
విజయవాడలో జర్నలిస్టుగా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టి ఆకాశవాణిలో రచయితగా, కళాకారుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ... తన సుదీర్ఘ రేడియో ప్రస్థానం గురించి ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ అడిగిన అనేక ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానమిచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
రేడియోతో అనుబంధం
ఆకాశవాణిలో ఉద్యోగం రాకముందు నుంచే నేను రేడియోలో ఔట్‌సైడ్ ఆర్టిస్ట్‌గా కార్యక్రమాలు చేసేవాణ్ణి. 1976లో విజయవాడ కేంద్రంలో రెగ్యులర్ స్టాఫర్‌గా నేను నా శాశ్వత రేడియో జీవితాన్ని ప్రారంభించాను. తీసుకోవడానికి నన్ను రచయితగా తీసుకున్నా ఓ వైపు స్క్రిప్ట్, పాటలు రాస్తూ మరో వైపు నాటకాల్లోనూ నటించేవాణ్ని. ఏనాడూ ఓ ఉద్యోగంలో కష్టపడుతున్నాననే భావన నాకు కలగలేదు. ఇరవై ఏళ్లు ఆకాశవాణిలో పని చేసి నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారిగా ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాను.
రేడియో నాటకాలు
1970లో ప్రసారమైన ‘వాయులీనం’ నా తొలి రేడియో నాటకం.. అదే ఏడాదిలో నా తొలి గేయకథాకావ్యం ‘శిలామురళి’ ప్రచురితమయింది. తర్వాత దాన్ని రేడియోలో మీరు (శారదాశ్రీనివాసన్), సుత్తివేలు గారు కలిసి నాటకం వేశారు. నేను, శ్రీరామమూర్తి కలిసి సుమారు యాభై కార్యక్రమాలు చేశాం. ఎప్పుడూ ఇద్దరం ఇంకెలాంటి సృజనాత్మక కార్యక్రమాలు చేద్దామా అని చర్చించుకునే వాళ్లం. నా ఇరవై ఏళ్ల రేడియో జీవితంలో రామంతో కలిసి పని చేయడం ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎన్నో విజయాలను తెచ్చి పెట్టింది. మొత్తం నేను పాలుపంచుకున్న రేడియో కార్యక్రమాల్లో పదిహేను ప్రోగ్రామ్స్‌కు ఆకాశవాణి వార్షిక జాతీయ పురస్కారాలు వచ్చాయి. అందులో ఏడు ప్రథమ బహుమతులు, మూడు ద్వితీయ బహుమతులు మరికొన్నింటికి యోగ్యతా పత్రాలు అందుకున్నాం. ప్రథమ బహుమతి అందుకున్న వాటిలో వర్షానందిని (సంగీతరూపకం), మెట్లు (సృజనాత్మకం), అమరారామం (డాక్యుమెంటరీ)లాంటి విభిన్న కార్యక్రమాలున్నాయి.
అమరారామం
ఈ డాక్యుమెంటరీ కోసం అమరావతి వెళ్లాను. దళితుడి దానం, కలశం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. అక్కడి దేవుడు అమరేశ్వరుడి పైనా చేశాను. నా డాక్యుమెంటరీ కోసం ఓవైపు పరిశోధన, రచన చేస్తూ సత్యంగారి ‘అమరావతి కథలు’లో నుంచి కొన్ని కథా భాగాలను నాటకీకరించి ఈ ‘అమరారామం’ పూర్తి చేశాను. 1982లో జాతీయస్థాయిలో ఇచ్చే ఆకాశవాణి పురస్కారాలలో దీనికి ప్రథమ బహుమతి వచ్చింది.
‘తిలక్’పై లైవ్ డాక్యుమెంటరీ
తణుకులో నేనూ ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తరచూ కలిసే వాళ్లం. అలా ఆయనపై ఉన్న అభిమానమే నన్నీ డాక్యుమెంటరీ చేసేలా చేసింది. ఆయన రాసిన పద్యాలు, నాటకాలు, పాటలు సేకరించి వాటితో దీన్ని తయారు చేశాను. తణుకులోని ఆయన ఇంట్లోనే ఓ గదిలో తిలక్ పాటలు పాడుకుంటూ, ఆయన గురించి మాట్లాడుకుంటూ ‘శిఖరావరోహణ’ పేరుతో చేశా. ఓ వ్యక్తిపై నేను చేసిన మొదటి డాక్యుమెంటరీ అది. తిలక్ నా మనసుకు అర్థమైన మనిషి, ఆత్మీయుడు.
‘కబుర్లు’ పెట్టుకున్నాం
నేను, రామ్మోహనరావు, నండూరి సుబ్బారావు కలసి రేడియోలో ఓ పదిహేనేళ్లు ‘కబుర్లు’ అనే కార్యక్రమం చేశాం. ఇందులో ఇద్దరిద్దరం వర్తమాన అంశాల్లోంచి ఏదో ఒక దానిపై ముచ్చటించే వాళ్లం. దానికి నేను స్క్రిప్ట్ రాస్తూ, నటించే వాణ్ణి. ఈ కార్యక్రమానికి శ్రోతల ఆదరణ బాగా లభించింది. అలాగే ‘కిటికీ’ అనే పదిహేను నిమిషాల కార్యక్రమం నిర్వహించాం. ఇందులో మూడు పాత్రలుండేవి. ఇది నలభై వారాల పాటు విజయవంతంగా నడిచింది. నాలుగు పాత్రలుండే ‘ఇరుగుపొరుగు’ అనే కార్యక్రమం నలభై ఏడు వారాలు నిర్వహించాం.
ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల
ఫోటోలు: నోముల రాజేశ్‌రెడ్డి
దేశభక్తిగీతాలు రాయనన్నా
నాకు విజయవాడ స్టేషన్ డెరైక్టర్ శ్రీనివాసన్‌గారితో ఉన్న చనువుతో ‘‘దేశభక్తి గీతాలు, ప్రచార కార్యక్రమాలకు పాటలు మాత్రం రాయమనకండి’’ అన్నాను. ఆయన నా అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించారు. కానీ కొన్ని సందర్భాల్లో దేశభక్తి గీతాలు రాయక తప్పలేదు. నేను రాసిన ‘‘తేనెల తేటల మాటలతో... మన దేశమాతనే కొలిచెదమా...’’ పాట నాకు పేరుతో పాటు ఆత్మసంతృప్తినీ ఇచ్చింది. మ్యూజిక్ కంపోజర్ ఎమ్మెస్ శ్రీరాంగారు అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉండేది. ఆయన నన్ను అడగ్గానే రాత్రికి రాత్రి రెండు పాటలు రాసిచ్చాను.