10 విమానాలకు బాంబు బెదిరింపులు!
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. బాంబులు పేలుతాయేమోనని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. చెన్నై లోని కస్టమర్ కేర్ కు 10 ఇండిగో విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఇండిగో 6ఈ 853 అనే విమనానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు ఆ విమనాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని బాంబులు, ఏవైనా పేలుడు పదార్థాల కోసం ఇండిగో విమానంలో తనిఖీలు చేస్తున్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో భారత్ లో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.