srinidhi loans
-
‘బి–పోస్ట్’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐటీ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీ బ్లాక్‌చెయిన్‌తో రూపొందించిన ‘బ్లాక్‌చెయిన్ – ప్రొటెక్షన్ ఆఫ్ స్త్రీ నిధి ట్రాన్జాక్షన్స్’(బీ–పోస్ట్)ను గురువారం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1.5 లక్షల మంది సంఘాలకు చెందిన మహిళలు ‘స్త్రీ నిధి’ద్వారా మంజూరయ్యే రుణాలకు క్రెడిట్ రేటింగ్ పొందే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుంది. హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటోచెయిన్ అనే స్టార్టప్ ‘బీ పోస్ట్’ను ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఈవిధానంతో రుణవితరణ, చెల్లింపులు సులువు కానున్నాయి. పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం: జయేశ్ రంజన్ పౌర సేవలను అందించే టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అ న్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి గురువారం ఆయన బీ–పోస్ట్‌ను ఆవిష్కరించారు. బ్యాంకు లావాదేవీలపై అవగాహన లేని నిరుపేద మహిళలకు బీ పోస్ట్ ద్వారా సమర్థవంతంగా సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో స్త్రీ నిధి రూరల్ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళలకు టోకరా
గత తెలుగుదేశం పాలనలో అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కనుసన్నల్లో ఆ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలకు తెరలేపారు. ఐదేళ్లలో చేపట్టిన ప్రతి పనిలోనూ పర్సంటేజీలు దండుకున్నారు. తమ అధినాయకుడి అండను చూసుకుని ఉరవకొండ ఎంపీపీ సుంకరత్నమ్మ డ్వాక్రా మహిళలకు సంబంధించిన సొమ్మును రూ.లక్షల్లో స్వాహా చేసినట్లు బయటపడింది. సాక్షి, ఉరవకొండ: ఉరవకొండ ఏరియా క్లస్టర్ పరిధిలోని ఆమిద్యాలలో ఐదు గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. టీడీపీ ఎంపీపీ సుంకరత్నమ్మ స్వగ్రామమైన ఆమిద్యాలలో తానే తన మద్దతుదారులతో సిరివెన్నెల గ్రామైక్య సంఘం (వీఓ) ఏర్పాటు చేసుకుంది. ఈ వీఓలో మొత్తం 34 స్వయం సహాయక పొదుపు (డ్వాక్రా) సంఘాలు ఉండగా.. ఇందులో 90 శాతం తన బినామీలను సభ్యులు ఏర్పాటు చేసుకుని రూ.లక్షలు స్వాహా చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఆమిద్యాలలోని జాబిలి, ఝాన్సీలక్ష్మి, ముద్దమందారం, మారుతీ ప్రసన్న, విజయ సంఘాల్లో ఎక్కవ శాతం అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అవినీతి జరిగిన సంఘాల్లో వీఓలో మారుతీ ప్రసన్న సంఘానికి ఎంపీపీ లీడర్‌గా ఉంది. గతంలో మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభం ఎంపీపీకి ఉండటంతో వీఓలకు ఎన్ని నిధులు వస్తాయో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. స్త్రీనిధి, సీఐఎఫ్ సొమ్ము స్వాహా సిరివెన్నెల గ్రామైక్య సంఘానికి రూ.20 లక్షల వరకు స్త్రీనిధి మొత్తం 2016–17లో మంజురు కాగా.. ఇందులో ఒక్క పైసా కుడా సంఘాలకు పంపిణీ చేయలేదు. 2011 నుండి 2013లో సామాజిక పెట్టుబడి నిధి కింద వీఓకు రూ.10 లక్షలు మంజూరైనా ఇప్పటివరకు ఒక్క పైసా రికవరీ చేయలేదు. 34 సంఘాల్లో ఉన్న రూ.3లక్షల పొదపు సొమ్ము మొత్తం ఎంపీపీ స్వాహ చేసినట్లు తెలిసింది. ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీ సంఘానికి జీవనోపాధుల కోసం రూ.5 లక్షల మంజూరైతే తనే ఎరికల సరస్వతీ మహిళా సంఘానికి మంజూరు చేసినట్లు చూపింది. అయితే ఆ సంఘానికి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. వాస్తవానికి ఆ సంఘానికి ఒక్క పైసా మంజూరు కాలేదని వెలుగు అధికారుల విచారణలో బయటపడింది. సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ నేతలు ఉరవకొండ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఎంపీపీ సుంకరత్నమ్మ ఆమె ప్రధాన అనుచరులైన టీడీపీ నాయకులు డ్వాక్రా సంఘాలను భ్రష్టు పట్టించారు. కొంతమంది యానిమేటర్లను ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచడానికి ఎంపీపీ వినియోగించినట్లు తెలుస్తోంది. అధికారం ఉంది కదా అని సంఘంలో మహిళలను బెదిరించి టీడీపీకి ఓటు వేయాలని ప్రలోభాలకు గురిచేసింది. స్త్రీనిధి సొమ్మును ఎంపీపీ ప్రోద్బలంతో కొంతమంది యానిమేటర్లు గ్రామైక్య సంఘాల ద్వారా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ప్రతి పైసా కక్కిస్తాం ఆమిద్యాల వీఓ పరిధిలోని ఆరు సంఘాల్లో అవినీతి జరిగినట్లు విచారణలో తేల్చాం. ఈ సొమ్మ కట్టాలని ఆయా సభ్యులకు అడిగితే తాము కడుతామని చెబుతున్నారు. సంఘాల పేరుతో ఒక వ్యక్తి సొమ్మను తీసుకుని వాడుకున్నట్లు తెలుస్తోంది. తిన్న ప్రతి పైసా కక్కిస్తాం. – రవీంద్రబాబు, ఏసీ, ఉరవకొండ క్లస్టర్ -
స్త్రీనిధి రుణం.. మహిళలకు వరం !
సాక్షి, నడిగూడెం : పొదుపు సంఘంలో సభ్యులుగా చేరి నెలసరి పొదుపు చేస్తూనే ప్రభుత్వం కల్పించిన స్త్రీ నిధి రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ, సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు పలు గ్రామాల మహిళలు. సంఘం ద్వారా వచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుంటూ నెలసరి పొదుపు పాటిస్తూ ఉపాధి పొందుతున్నారు. స్వయం ఉపాధిపై దృష్టి.. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంజూరైన స్త్రీ నిధి రుణాలతో పలువురు మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. కిరాణం, ఫ్యాన్సీ షాపులు, గొర్రెల పెంపకం, టైలరింగ్, గాజుల షాపులు ఇంకా పలు రంగాలను ఎంచుకొని లబ్ధిపొందుతున్నారు. స్వయం సహయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు చేసిన పొదపు సంఘం నిర్వహణను పరిగణలోకి తీసుకొని సంఘంలోని సభ్యులకు స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేస్తారు. ఒక్కో సంఘం పరిధిలో సభ్యులకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంతో మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగలో యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రూ. 1.69 కోట్లతో 445 మందికి రుణాలు.. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్త్రీనిధి పథకం కింద 445 మందికి రూ.1.69 కోట్లు ఇప్పటి వరకు రుణాలు సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందించారు. సకాలంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తే మరికొంత మందికి స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేయనున్నారు. సమభావన సంఘాల మహిళలు క్రమం తప్పకుండా పొదుపు పాటించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. టైలరింగ్‌తో ఉపాధి పొందుతున్నా : స్త్రీ నిధి కింద రూ.50 వేలు రుణం పొందాను. దీంతో ఆ డబ్బులను వృథా చేయకుండా టైలరింగ్ షాపు నిర్వహించుకుంటున్నాను. దీంతో ఉపాధి పొందుతున్నాను. నా కుటుంబానికి ఆసరాగా ఉంది. స్త్రీ నిధి పథకం మాలాంటి మహిళలకు తోడ్పాటునందిస్తుంది. – కాసర్ల శశిరేఖ, నారాయణపురం పొదుపులు చేసుకుంటున్నాము.. స్త్రీ నిధి పథకం ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నాను. ఆ డబ్బులతో గొర్రెలను పెంచుకుంటున్నాను. తీసుకున్న రుణంలో ఎప్పటికప్పుడు చెల్లించుకుంటున్నాను. అలాగే పొదుపులు కూడా ప్రతి నెలా చేసుకుంటున్నాము. మాలాంటి వారికి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. – నూకపంగు సామ్రాజ్యం, వల్లాపురం ప్రభుత్వ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి.. స్వయం సహయక సంఘాల కొరకు ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తుంది. సంబంధిత మహిళా సంఘాలు ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. – రామలక్ష్మి, ఏపీఎం, గ్రామీణాభివృద్ధి సంస్థ, నడిగూడెం -
16,250 మందికి స్త్రీనిధి జీవనోపాధి రుణాలు
జలుమూరు: స్వయం శక్తి సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించి ఆదాయం మరింత మెరుగుపరుచుకునేందుకు స్త్రీనిధి జీవనోపాధి రుణాలు మంజూరు చేస్తున్నామని స్త్రీ నిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అల్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం జలుమూరు ఐకేపీ కార్యాలయంలో స్త్రీ నిధి రుణాల రికార్డులు పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 16,250 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేలు నుంచి రూ.లక్ష రుణం ఇస్తున్నామన్నారు. దీని కోసం రూ.62 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటి వరకూ 1600 మందికి రూ.7.50 కోట్లు ఇచ్చామన్నారు. సాధారణ రుణాలు 12 వేల మందికి రూ.24 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. స్త్రీనిధి జీవనోపాధుల పథకానికి సంబంధించి ఒక్కో పంచాయతీ నుంచి 25 మంది సభ్యులు నుంచి అధికంగా వారు రుణాలు తీసుకొనే అర్హత బట్టి కేటాయింపులు చేస్తున్నామని వివరించారు. రుణాలు తిరిగి చెల్లిస్తే వారు కట్టిన మొత్తం వడ్డీలేని రుణంగా పరిగణించి తిరిగి రాయితీ మొత్తం వారి ఖాతాకే జమచేస్తామన్నారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ ఎస్.రాజ్‌కుమార్, స్త్రీనిధి మేనేజర్ నాగరాజు, సీసీలు ప్రభావతి, బుద్దమ్మ, బొడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్త్రీనిధి రుణాలకూ కష్టకాలం!
నోట్ల రద్దుతో మహిళలపై ప్రభావం 1.43 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఆందోళనలో స్వయం సహాయక సంఘాలు సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల రద్దు’ ప్రభావం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలపైనా తీవ్రంగా పడింది. లక్షలాది మంది మహిళలు తమ జీవనోపాధి కోసం అవసరమైన రుణాలు పొందేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని వివిధ స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.43 లక్షల మంది మహిళలు సూక్ష్మ, మధ్యస్థాయి, డైరీ రుణాల కోసం రెండు నెలల కిందే గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. వారికీ రూ.354 కోట్ల మేర రుణాలు మంజూరు చేసేందుకు ‘స్త్రీనిధి’ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. అయితే ‘నోట్ల రద్దు’ పరిణామాలతో స్థానికంగా ఉండే బ్యాంకులు మహిళలకు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. రుణాలను మంజూరు చేసిన తేదీ నుంచీ 13.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండే నేపథ్యంలో.. స్థానిక బ్యాంకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా రుణాల మంజూరుకు ‘స్త్రీనిధి’ అధికారులు బ్రేక్ వేసినట్లు తెలిసింది. మొత్తంగా సకాలంలో రుణాలు అందకపోవడంతో చిన్న చిన్న అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తోందని స్వయం సహాయక సంఘాల మహిళలు వాపోతున్నారు. జీవనోపాధి కోసం రుణాలు.. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడకుండా.. వారి జీవనోపాధి కోసం ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వమే స్త్రీనిధి బ్యాంకును నిర్వహిస్తోంది. గ్రామాల్లో చిన్న హోటళ్లు, కిరాణ దుకాణాలు, కూరగాయలు పండించడం, విక్రయించడం, పేపర్ ప్లేట్ల తయారీ, టైలరింగ్.. తదితర వ్యాపారాలు, వృత్తులు చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు చిన్నచిన్న మొత్తాల్లో ‘స్త్రీనిధి’ బ్యాంకు రుణాలు అందిస్తుంది. వాటిని 13.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి. అయితే సకాలంలో తిరిగి చెల్లిస్తే.. వడ్డీలేని రుణాలు పథకం కింద ప్రభుత్వం వారు చెల్లిం చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి వారికి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే నోట్ల రద్దు ప్రభావంతో రెండు నెలలుగా మహిళల దరఖాస్తులను స్త్రీనిధి బ్యాంకు పెండింగ్‌లో పెట్టింది. రుణ మొత్తాలకు సరిపడా లబ్ధిదారులకు కొత్తనోట్లు ఇస్తామని స్థానిక బ్యాంకులు తెలిపే వరకు రుణాలను మంజూరు చేయలేమని స్త్రీనిధి అధికారులు చెబుతున్నారు.