నోట్ల రద్దుతో మహిళలపై ప్రభావం
1.43 లక్షల దరఖాస్తులు పెండింగ్
ఆందోళనలో స్వయం సహాయక సంఘాలు
సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల రద్దు’ ప్రభావం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలపైనా తీవ్రంగా పడింది. లక్షలాది మంది మహిళలు తమ జీవనోపాధి కోసం అవసరమైన రుణాలు పొందేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని వివిధ స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.43 లక్షల మంది మహిళలు సూక్ష్మ, మధ్యస్థాయి, డైరీ రుణాల కోసం రెండు నెలల కిందే గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారు. వారికీ రూ.354 కోట్ల మేర రుణాలు మంజూరు చేసేందుకు ‘స్త్రీనిధి’ అధికారులు కూడా ఆమోదం తెలిపారు. అయితే ‘నోట్ల రద్దు’ పరిణామాలతో స్థానికంగా ఉండే బ్యాంకులు మహిళలకు రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. రుణాలను మంజూరు చేసిన తేదీ నుంచీ 13.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండే నేపథ్యంలో.. స్థానిక బ్యాంకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా రుణాల మంజూరుకు ‘స్త్రీనిధి’ అధికారులు బ్రేక్ వేసినట్లు తెలిసింది. మొత్తంగా సకాలంలో రుణాలు అందకపోవడంతో చిన్న చిన్న అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తోందని స్వయం సహాయక సంఘాల మహిళలు వాపోతున్నారు.
జీవనోపాధి కోసం రుణాలు..
గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల బారిన పడకుండా.. వారి జీవనోపాధి కోసం ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వమే స్త్రీనిధి బ్యాంకును నిర్వహిస్తోంది. గ్రామాల్లో చిన్న హోటళ్లు, కిరాణ దుకాణాలు, కూరగాయలు పండించడం, విక్రయించడం, పేపర్ ప్లేట్ల తయారీ, టైలరింగ్.. తదితర వ్యాపారాలు, వృత్తులు చేసుకునే స్వయం సహాయక సంఘాల మహిళలకు చిన్నచిన్న మొత్తాల్లో ‘స్త్రీనిధి’ బ్యాంకు రుణాలు అందిస్తుంది. వాటిని 13.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి. అయితే సకాలంలో తిరిగి చెల్లిస్తే.. వడ్డీలేని రుణాలు పథకం కింద ప్రభుత్వం వారు చెల్లిం చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి వారికి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే నోట్ల రద్దు ప్రభావంతో రెండు నెలలుగా మహిళల దరఖాస్తులను స్త్రీనిధి బ్యాంకు పెండింగ్‌లో పెట్టింది. రుణ మొత్తాలకు సరిపడా లబ్ధిదారులకు కొత్తనోట్లు ఇస్తామని స్థానిక బ్యాంకులు తెలిపే వరకు రుణాలను మంజూరు చేయలేమని స్త్రీనిధి అధికారులు చెబుతున్నారు.
స్త్రీనిధి రుణాలకూ కష్టకాలం!
Published Fri, Dec 23 2016 1:28 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
Advertisement