ముఖ్యమంత్రా? మేనేజరా?
అభిప్రాయం
పుష్కరాల నిర్వహణకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటం, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ఇతర వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయటం విషయంలో చూపలేదు.
ఢిల్లీలో కొలువై ఉన్న అధిష్టానానికి జోహుకుం అంటున్న నాటి ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డిపై విమర్శలు చేస్తూ కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు తన సంపాదకీయంలో ‘సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. చెప్పులు మోసేవాడు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారట. ఇప్పుడు ఈవెంట్ మేనేజర్లలా మారిన తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తే నార్ల ఏమనేవారో? ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు తనను తాను రాష్ట్రానికి సీఈవోగా అభివర్ణించుకున్న బాబు.. ఇటీవలి పుష్క రాల సమయంలో ఈవెంట్ మేనేజర్ అవతారం ఎత్తటాన్ని చూస్తే నార్ల ఏమనేవారో?..
గోదావరి, కృష్ణా పుష్కరాలు బాబుకు అంది వచ్చిన అవకాశంగా మారాయి. అధికారిక లెక్కల ప్రకారం రూ.1,143 కోట్లతో 156 ఘాట్లు, 59 పుష్కర ప్రాంతాలతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో చేపట్టిన పనులను చక్కబెట్టటంలో బాబు ఈవెంట్ మేనేజర్‌గా తలమునకలయ్యారు. ఒకవైపు భక్తి ప్రచారం హోరెత్తుతుండగా.. మరోవైపు భక్తు లకు సౌకర్యాల కల్పన పేరుతో తమ వర్గీయులకు, అనుయాయులకు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు. కనీసం టెండర్లు పిలవకుండా రూ.168 కోట్ల విలు వైన ఘాట్ పనులను సోమా ఎంటర్ప్రైజెస్, సూర్య కన్ స్ట్రక్షన్స్, విన్లెద్ సంస్థలకు అప్పగించారు.
గోదావరి పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కి సలాటలో 29 మంది చనిపోయిన ఘటనలో దోషులు ఇంకా నిగ్గుతేలలేదు. మరణించిన వారంతా పేద కుటుంబాలకు చెందినవారు కావ టంతో విచారణలో నిర్లక్ష్యం ఉందనే ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, ప్రభుత్వం పర స్పర రక్షణలో మునిగి ఉండటం చూస్తే చివరికి ఈ దుర్ఘటనపై పూర్తి బాధ్యత గోదావరిదే అన్నట్టు వ్యవ హరిస్తున్నారు. పైగా గోదావరి పుష్కరాల సంద ర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నాణ్యత లేకుండా పనులు చేయడం వల్ల.. సంవత్సరం గడవ కముందే రోడ్లు కుంగిపోవడం, పైప్ లైన్లు లీకవడం, ఘాట్లు బీటలు వారడం బహిరంగ రహస్యం.
వాస్తవంగా చూస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వాధి నేతగా చేయాల్సిన చట్టబద్ధపాలన, మౌలిక వస తుల కల్పన, అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించటం వంటి వాటిని వదిలేసి పుష్కరాల వంటి వాటిని ఈవెంట్లుగా మలుస్తూ, సీఎం ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తూ ప్రజల్ని పక్క దోవ పట్టిస్తున్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించిన తీరు ఆధునిక పాలనా సూత్రాలన్నిటినీ తుంగలో తొక్కి ప్రజలను భ్రమ ల్లోకి నెట్టింది. పుష్కరాలలో స్వార్థ రాజకీయ ప్రయో జనాల కోసం వెచ్చించిన వేలకోట్ల డబ్బు పెడితే పోలవరం కొంతైనా వేగంగా పూర్తయి ఉండేది.
పుష్కరాలనేవి ఒక మతంవారు ఎన్నో శతా బ్దాలుగా నిర్వహించుకునే సాధారణ ఆచారం. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పుష్కరాలను జరుపుకుం టాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రభు త్వాలు ఏవీ చంద్రబాబు చేసిన హడావుడి చేయ లేదు. గోదావరి పుష్కరాల్లో ఈవెంట్ మేనేజర్లా బాబుతో పోటీపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ తర్వాత కొంత తగ్గి కృష్ణా పుష్కరాల్లో తన బాధ్యత మేరకు వ్యవహరించారు. బాబు మాత్రం వ్యక్తిగత ప్రచారానికి, రాజకీయ అవసరాలకి వెగటుపుట్టే స్థాయిలో వీటిని ఉపయోగించుకున్నారు. పుష్కరాల సమయంలో విజయవాడ ప్రాంతంలో మాంసం అమ్మకాలపై సైతం నిషేధం విధించిన ముఖ్య మంత్రి కేవలం మాంసం అమ్మకాల మీదే బతికే చిరువ్యాపారుల పరిస్థితేమిటో కూడా ఆలోచించ లేదు. మరోవైపున మద్యం అమ్మకాలపై మాత్రం ఎటువంటి నిషేధమూ విధించలేదు. ఎంత దశ–దిశ లేని పాలన ఇది! కేవలం ఓటు బ్యాంకు రాజకీ యాలు, ప్రచార ఆర్భాటం, పనుల పేరుతో కోట్లు దండుకోవటం తప్ప పుష్కర కార్యక్రమాల సారాంశం ఏమిటి?
అధికారులు నిర్వహించాల్సిన పనులను తానే స్వయంగా భుజాలపై ఎత్తుకుని నిర్వహిస్తున్నట్టు నటించడానికిచ్చిన ప్రాధాన్యత రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటం, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ఇతర వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయటం మీద బాబు పెట్టలేదు. ఈ క్రమంలో ఆధ్యాత్మికతకు, మత విశ్వాసాలకు తేడా లేకుండా చేశారు. అందులో ప్రభుత్వాన్ని కలగలిపారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో చేయకూడని రీతిలో వ్యవహ రించారు. పుష్కరాల ఖర్చుపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇకనైనా బాబు తన కేంద్రీకృత పాలనను, ఈవెంట్ మేనేజ్మెంట్ సంçస్కృతిని వీడి ప్రజాస్వామిక ముఖ్యమంత్రిలా వ్యవహరించటం మొదలు పెట్టాలి.
(వ్యాసకర్త శ్రీనివాస్ కూసంపూడి లోక్‌సత్తా పార్టీ అధికార ప్రతినిధి మొబైల్ : 90001 65971)