100 కోట్లతో వైజాగ్‌లో ఫుడ్ పార్క్
శ్రీనివాస హేచరీస్ గ్రూప్ ప్రమోటర్ల కొత్త వెంచర్
60 ఎకరాల్లో ఏర్పాటు
వాల్యుయేషన్ రావడం లేదనే డీలిస్టింగ్
ఇందుకోసం రూ. 30 కోట్ల కేటాయింపు
ఆరు నెలల్లో డీలిస్టింగ్ పూర్తి
శ్రీనివాస హేచరీస్ ఎండీ సురేష్ రాయుడు చిట్టూరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస హేచరీస్ ప్రమోటర్లు కొత్త వ్యాపార రంగాలపై దృష్టిసారిస్తున్నారు. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాస హేచరీస్ మేనేజింగ్ డెరైక్టర్ సురేష్ రాయుడు చిట్టూరి తెలిపారు. ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్న 300 ఎకరాల్లో 60 ఎకరాలను ఫుడ్ పార్క్ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.
ఫుడ్ పార్క్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్క్ ఏర్పాటుకు సుమారు రూ. 100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని సొంత నిధులు, బ్యాంకు రుణం, సబ్సిడీల రూపంలో సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఫుడ్ పార్క్ ఏర్పాటు ఇంకా ప్రణాళిక దశలోనే ఉందని, అన్ని అనుమతులు వచ్చి ప్రారంభం కావడానికి మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
వాల్యుయేషన్ రావడం లేదనే డీలిస్టింగ్
శ్రీనివాస హేచరీస్‌ను స్టాక్ మార్కెట్లో నమోదు చేసినప్పటికీ సరైన వాల్యూయేషన్ రాకపోవడంతో డీలిస్ట్ చేయాలని నిర్ణయించినట్లు రాయుడు తెలిపారు. 2001లో స్టాక్ మార్కెట్లో రూ. 95 వద్ద నమోదైనప్పటి నుంచి ఈ షేరు పుస్తక విలువ కంటే తక్కువ రేటుకే ట్రేడ్ అవుతోందని, ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రయోజనం తప్ప ఏమీ లభించకపోవడంతో డీలిస్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రధానమైన హేచరీస్ వ్యాపారం నుంచి ఇతర వ్యాపారాల వైపు దృష్టిసారించడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణంగా ఆయన పేర్కొన్నారు. డీలిస్టింగ్‌కు సంబంధించి ఇప్పటికే బోర్డు ఆమోదం తెలపగా, వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 104 ఉండగా, రూ. 110 చెల్లించి ఈ షేర్లను వెనక్కి తీసుకోనుంది. ఇన్వెస్టర్ల చేతిలో ఉన్న 25 శాతం వాటాను (24.44 లక్షల షేర్లు) కొనుగోలు చేయడానికి సుమారు రూ. 30 కోట్లు కేటాయించినట్లు రాయుడు తెలిపారు. మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలలు సమయం పడుతుందన్నారు.
జపాన్ ఆసక్తి..
ఆంధ్రప్రదేశ్‌లో తయారీ, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు రాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటనలో సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సురేష్ రాయుడు కూడా పర్యటించిన సంగతి తెలిసిందే. జపాన్ పర్యటన విశేషాలను తెలియచేస్తూ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం వెలువడితే పెట్టుబడులు రావడం మొదలవుతాయన్నారు.