sriram pur
-
27 రోజులే..
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కౌంట్ డౌన్ మొదలైంది. కంపెనీ వార్షిక ఉత్పత్తి లక్ష్యం సాధించడానికి ఇంకా 27 రోజులు మాత్రమే ఉంది. సమయం తక్కువగా ఉండటం, లక్ష్యం అధికంగా ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వరుసగా 13 ఏళ్లుగా 100 శాతం ఉత్పత్తి సాధిస్తూ వస్తున్న సింగరేణి ఈసారి ఎలా గట్టెక్కుతుందో అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈసారి లక్ష్యాన్ని చేరుకోలేమని అధికారులే స్వయంగా చెబుతున్నారు. దీంతో ఉత్పత్తి లక్ష్యం సాధించేదిగా ముద్ర పడ్డ సింగరేణి కొత్త రాష్ట్రం ఆరంభంలోనే ప్రతిష్ట కు మసక బారే పరిస్థితులు కనబడుతున్నాయి. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అప్పటిలోగా కంపెనీ నిర్దేశించిన 54.3 మిలి యన్ టన్నుల ఉత్పత్తి సాధించాలి. ఇప్పటి వరకు నిర్దేంచిన లక్ష్యం 49.4 మిలియన్ టన్నులు ఉంటే అందులో సాధించింది 44.4 మిలియన్ టన్నులే. ఇంకా ఐదు మిలియన్ టన్నుల లోటు ఉంది. ఇంత భారీ లోటు ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా కంపెనీ చవిచూడలేదు. మిగిలిన 27 రోజుల్లో రోజు వారి 100 శాతం ఉత్పత్తి సాధించడంతోపాటు ఐదు మిలియన్ టన్నుల లోటు కూడా పూడ్చాలి. ఇది ఏమాత్రం సాధ్యం కాదని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. లక్ష్య సాధన అసాధ్యం ప్రస్తుతం రోజు వారి ఉత్పత్తి లక్ష్యం కంపెనీ వ్యాప్తంగా 2 లక్షల టన్నులు ఉంటే 1.90 లక్షల నుంచి 2 లక్షల టన్నుల వరకు వస్తుంది. ఎంత కష్టపడ్డా కూడా 2 లక్షల టన్నులకు మించి రాదు. కావున ఉన్న లోటు మార్చి 31 వరకు అలాగే ఉండే అవకాశం ఉంది. ఇక ఉత్పత్తి సాధించలేమని భావించిన యాజమాన్యం ఉన్న వార్షిక లక్ష్యాన్ని అంతర్గతంగా కుదించి 50.3 మిలియన్ టన్నుకు చేసింది. తెలంగాణ కోసం 2014 సెప్టెంబర్ నెలలో 37 రోజులపాటు కార్మికుల సమ్మె చేసి బొగ్గు ఉత్పత్తి సాధించిన కూడా కార్మికులు, అధికారులు కలిసి కష్టపడి చివరికి 100 శాతం ఉత్పత్తిని సాధించారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లీలో ఉత్పత్తి లోటు ఉన్న చివరికి మార్చి 31 నాటికి లోటు పూడ్చి 100 శాతం ఉత్పత్తి సాధించడం పరిపాటి. కానీ ఈసారి ఏమాత్రం అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. కారణాలు అనేకం ఉత్పత్తి లోటుకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. మొదట వర్షాలు, ఇటీవల సమ్మక్క-సారలమ్మ జాతర, సింగరేణి ఎన్నికల వల్ల కార్మికుల హాజరుశాతం తగ్గి ఉత్పత్తి దెబ్బతింది. ప్రధానంగా ఓబీ సమస్య. ఓసీపీ ఓబీలు నిర్ణీత సమయంలో టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు ఆలస్యమై ఉత్పత్తికి ఆటకం కలిగింది. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు, భూపాలపల్లి, మణుగూరు, మేడిపల్లి వంటివి వాటిల్లో ఓబీ సమస్య వల్లే ఉత్పత్తిని నష్టపోయాయి. అంతే కాకుండా బెల్లంపల్లి ఓసీపీ 2, మణుగూరు ఓసీపీ 2కొత్త ప్రాజెక్టులకు అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం జరిగింది. కొండాపూర్ భూగర్భగని కూడా అంతే. రామకృష్ణపూర్ ఓసీపీ కూడా అనుకున్న సమయంకు మొదలు కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యం ఇచ్చినప్పటికి ప్రస్థుతం ఓబీ మాత్రమే తీస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి మొదలు కాలేదు. రూ.1,200 కోట్లతో చేపట్టిన ఆడ్రియాల ప్రాజెక్టు కూడా నిర్ధేశించిన లక్ష్యంలో ఇప్పటికి 17 శాతమే ఉత్పత్తి సాధించిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది. అన్నింటిలో కొరతే.. సింగేణిలో అధికారులకు పుష్కలంగా ఉన్న పని చేసే కార్మికులు తక్కువగా ఉన్నారు. ఉత్పత్తికి సరిపడా మ్యాన్ పవర్ లేదు. ఫేస్ వర్కర్ల రిక్రూట్మెంట్ లేదు. సూపర్వైజర్ల కొరత తీవ్రంగా ఉంది. కంపెనీ వ్యాప్తంగా 600 మంది సూపర్వైజర్ల కొరత ఉంది. దీంతో ఉత్పత్తే కాకుండా రక్షణ చర్యలు కూడా నామమాత్రంగా ఉన్నాయి. కొత్త పనిస్థలాలు లేవు. ఉన్నవాటిలోనే పని చేయిస్తున్నారు. ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఎస్డీఎల్ యంత్రాల పని గంటలు కూడా తగ్గుతున్నాయి. యంత్రాలు మరమ్మతుకు వస్తే సకాలంలో అవి రిపేర్ అవ్వడం లేదు. కారణం పరికరాలు, స్పేర్స్ కొతర తీవ్రంగా ఉంది. చిన్న స్పేర్ లేని కారణంగా ఎస్డీఎల్స్నే ఆపేస్తున్నారు. దీనికి ఉన్నత అధికారుల్లో జవాబుదారితనం లోపించింది. కంపెనీ తనదిగా భావించి పని చేసే నాటి అధికారుల పని సంస్కృతికి నేడు ఉన్న వారిలో లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. -
జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : రూ.20లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ సాధనలో భాగంగా టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ ఉపాధ్యక్షుడు బంటు సారయ్య మాట్లాడుతూ గని ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికులకు రూ.20లక్షలు, విధుల్లో ఉండి ఏ కారణంతోనైనా సహజ మరణం చెందితే రూ.15లక్షల గ్రాంటు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోలిండియాలో ఎక్స్‌గ్రేషియా సాధించాల్సిన బాధ్యత జాతీయ సంఘాలపై ఉందని, అక్కడ పోరాడకుండా సింగరేణిలో లేని ఎక్స్‌గ్రేషియాను ఇప్పించాలని తమపై ఒత్తిడి తేవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ఆయా సంఘాలు తమ వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఏజీఎం మహమ్మద్ అబ్బాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతిరాజు, కె.సురేందర్ రెడ్డి, నాయకులు శేషగిరిరావు, చిలువేరు సదానందం, బుస్స రమేశ్, ముస్కె సమ్మయ్య, ఫిట్ సెక్రెటరీలు రాళ్లబండి రాజన్న, తిరుపతిరావు, కంది సమ్మిరెడ్డి, కొలిపాక సమ్మయ్య, రవీందర్‌రెడ్డి, నీలం సదయ్య, తాటి బాపు పాల్గొన్నారు.