sriramanavai
-
మోదీ, అమిత్ షా ఇలాఖాలో దాడులు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందర్బంగా చోటుచేసుకున్న ఘర్షణలపై రౌత్.. ‘సామ్నా’ పత్రిక వేదికగా స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలను ఎండగట్టారు. కాగా, దేశంలో మతకల్లోలాలను రేకెత్తించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బీజేపీ వ్యూహమని సంజయ్ రౌత్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో జరుగుతున్న పరిణామాలను చూసి శ్రీరాముడే విసుగెత్తిపోయాడని ఎద్దేవా చేశారు. పండుగ సందర్భంగా చెలరేగిన హింస శ్రీరాముడి ఆలోచనకే వ్యతిరేకమని అన్నారు. రామ మందిర ఉద్యమాన్ని మధ్యలోనే నిలిపేసిన వారే, ఇప్పుడు శ్రీరాముడి పేరుతో కత్తులు దూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మతకల్లోలాలను రేకెత్తించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగానే కొన్నేళ్ల క్రితం శ్రీరామ నవమి వేడుకలు సంస్కృతికి వారధిగా ఉండేవని, ఇప్పుడు మత విద్వేషాలకు రెచ్చగొట్టేందుకు వేదిక అయ్యాయని విమర్శించారు. ఇలాంటి పనులు శ్రీరాముడి ఆలోచనలకే విరుద్ధమని తెలిపారు. ‘అసలు శ్రీరామనవమి రోజు ఎందుకు హింస జరిగింది? ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సొంత ఇలాఖా అయిన గుజరాత్లో శ్రీరామ నవమి యాత్రపై ముస్లింలు దాడి చేస్తారని ఎవరైనా నమ్ముతారా?’ అంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నవమి రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఇది మంచి సంకేతం కాదని రౌత్ పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని రౌత్ ఆరోపించారు. -
అల్లర్ల ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ బృందం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన అల్లర్ల పరిస్థితి అధ్యయనంపై నలుగురు సభ్యుల బీజేపీ ప్రతినిధి బృందం అసన్సోల్లో ఆదివారం పర్యటించింది. బాధిత ప్రాంతాల్లో పర్యటించి నివేదిక సమర్పించాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ప్రతినిధి బృందం సభ్యులైన ఓం మాధుర్, షాన్వాజ్ హుస్సేన్, రూపా గంగూలీ, బీడీ మాథుర్‌లు అసోంసాల్లో పర్యటించింది. పరిస్థితిని సమీక్షించి తమ నివేదికను అమిత్‌షాకు సమర్పించనున్నారు. ‘అల్లర్ల విషయం పోలీసుల పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ బృందం పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. బీజేపీ బృందం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పర్యటిస్తుంది’అని ఓ సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. కాగా, పంచాయితీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, ఆ కారణంగా అల్లర్లు చెలరేగిన అసోంసాల్, రాణిగంజ్ ప్రాంతాల్లో పర్యటించే బీజేపీ బృందానికి భద్రత కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు తెలిపింది. గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి అసోంసాల్, రాణిగంజ్‌లోని అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ‘నేను శాంతి సందేశంలో ఇక్కడకు వచ్చాను. ప్రజలకు సామరస్యంగా ఉండాలని, ఒకరినొకరు గౌరవించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని గవర్నర్ చెప్పారు. శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. దీంతో ఆ రెండు నగరాల్లోనూ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసి, 144 సెక్షన్ విధించారు. -
నేటి నుంచి ‘రత్నగిరి’పై శ్రీరామనవమి వేడుకలు
అన్నవరం : రత్నగిరిపై గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు మంగళవారం నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించినప్పటి నుంచి క్షేత్ర పాలకుడిగా శ్రీరాముడు వ్యవహరిస్తుండడంతో ఏటా ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరి రామాలయంలో సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం విశేషం. శ్రీరామ నవమి వేడుకల షెడ్యూల్.. ∙ఏప్రిల్ 4న ఉదయం 6 గంటల నుంచి శ్రీరామునికి పట్టాభిషేకం. సాయంత్రం నాలుగు గంటలకు సీతారాములను వధూవరులను చేస్తారు. ∙ఏప్రిల్ 5న ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణం ∙ఏప్రిల్ 6న సీతారాములకు ఆస్థానసేవ. ∙ఏప్రిల్ 7న సాయంత్రం నాలుగు గంటలకు సీతారాముల వారి ఆలయంలో పండిత సదస్యం ∙ఏప్రిల్ 8, 9 తేదీల్లో సీతారాములకు ప్రత్యేక ఆస్థానసేవలు ∙ఏప్రిల్ 10న సాయంత్రం 4 గంటలకు సీతారాముల వనవిహారోత్సవం ∙ఏప్రిల్ 11న ఉదయం చక్రస్నానం, సాయంత్రం నాకబలి, దండియాడింపు ∙ఏప్రిల్ 12న రాత్రి 8 గంటలకు సీతారాములకు శ్రీపుష్పయాగమహోత్సవం