కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన అల్లర్ల పరిస్థితి అధ్యయనంపై నలుగురు సభ్యుల బీజేపీ ప్రతినిధి బృందం అసన్‌సోల్‌లో ఆదివారం పర్యటించింది. బాధిత ప్రాంతాల్లో పర్యటించి నివేదిక సమర్పించాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ప్రతినిధి బృందం సభ్యులైన ఓం మాధుర్, షాన్‌వాజ్ హుస్సేన్, రూపా గంగూలీ, బీడీ మాథుర్‌లు అసోంసాల్‌లో పర్యటించింది. పరిస్థితిని సమీక్షించి తమ నివేదికను అమిత్‌షాకు సమర్పించనున్నారు.
‘అల్లర్ల విషయం పోలీసుల పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ బృందం పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. బీజేపీ బృందం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పర్యటిస్తుంది’అని ఓ సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. కాగా, పంచాయితీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, ఆ కారణంగా అల్లర్లు చెలరేగిన అసోంసాల్, రాణిగంజ్ ప్రాంతాల్లో పర్యటించే బీజేపీ బృందానికి భద్రత కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు తెలిపింది. గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి అసోంసాల్, రాణిగంజ్‌లోని అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ‘నేను శాంతి సందేశంలో ఇక్కడకు వచ్చాను. ప్రజలకు సామరస్యంగా ఉండాలని, ఒకరినొకరు గౌరవించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని గవర్నర్ చెప్పారు.
శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. దీంతో ఆ రెండు నగరాల్లోనూ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసి, 144 సెక్షన్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment