స్టేజి ప్రోగ్రాంలు ఇవ్వడం చాలా కష్టం
సినీ నటుడు సుమన్
కళాకారులకు సత్కారం
శ్రీరంగపట్నం : సినిమాల్లో యాక్షన్ చేయడం సులువేనని, స్టేజీ ప్రోగ్రాంలు ఇవ్వడం మాత్రం చాలా కష్టమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ సమక్షంలో కళాకారుల ప్రదర్శన, అభినందన సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, వివిధ వేషాలతో పలువురిని అలరిస్తున్న కళాకారులను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. శ్రీరంగపట్నం గ్రామం కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందిందన్నారు. తాను ఇప్పటి వరకూ 400 సినిమాల్లో నటించానని, ఇందుకు అభిమానులు, పెద్దల ఆశీర్వాదాలే కారణమని అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి మంచి చిత్రాల్లో నటించానని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని సుమన్ అన్నారు.
వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, కళాకారులకు ప్రభుత్వపరంగా అన్ని రాయితీలూ వచ్చేలా కృషి చేస్తానన్నారు. తాను ఆహ్వానించిన వెంటనే వచ్చిన సుమన్‌ను అభినందించారు. అంతకుముందు సుమన్‌కు గ్రామంలో వందలాది మంది స్వాగతం పలికారు. ఆలయ కమిటీ నాయకులు, కళాకారుల నాయకులు సూరిశెట్టి భద్రం, సూరిశెట్టి అప్పలస్వామి, మద్దాల రమణ, పెంటకోటి సూర్యనారాయణ, బొడ్డేటి కొండబ్బాయి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.