నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరగనుంది. ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిశ్వరస్వామి దేవస్థానం అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు.