srivari seva
-
తిరుమలకు విపరీతంగా పెరిగిన రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు విపరీతంగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ మాసం ముగుస్తుండడంతో.. భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) కోసం 18 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం, 10) శ్రీవారిని 84,449 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 33,570గా ఉంది. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్లుగా లెక్క తేలింది. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి చెయ్యనున్నారు అర్చకులు. ఈ నెల18 నుండి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 17న అంకురార్పణ, 18 ధ్వజారోహణం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంతత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 22వ తేదీన గరుడ సేవ ఉండగా.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల్ని అనుమతించరు. ఇక బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిఫారసు లేఖలు రద్దు ఉంటుందని తెలియజేసింది టీటీడీ. అలాగే.. వాహనసేవలు తిలకించడానికి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. -
శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి నిర్ణయం వాయిదా
-
భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం..
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వాయిదా వేసింది. 14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని ముందుగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని టీటీడీ వాయిదా వేసింది. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్లు టీటీడీ ప్రకటించింది. చదవండి: జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపు సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే -
శ్రీవారి సేవల పేరిట ఘరానా మోసం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంలో అభిషేకాలు చేయిస్తానని నమ్మించి వృద్ధులను మోసం చేసిన వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు టౌన్‌కు చెందిన ఆనం రాజ్‌కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్నాడు. అమీర్‌పేట డివిజన్ శివ్‌భాగ్‌కు చెందిన సుకుమార్‌రెడ్డితో అతడికి పరిచయం ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతోనే తిరుపతిలో అభిషేక పూజలు, దంపతులకు శేషవస్త్రాలను దగ్గరుండి ఇప్పిస్తానని నమ్మించాడు. అభిషేక పూజకు రూ.2500, శేషవస్త్రాల బహుకరణకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన సుకుమార్ ముందుగా డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత అతను నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవచ్చని స్నేహితులు, బంధువులకు చెప్పడంతో మరో 15 మంది రాజ్‌కుమార్‌రెడ్డికి డబ్బులు చెల్లించారు. నెలలు గడుస్తున్నా దర్శనం చేయించకపోగా పత్తా లేకపోవడంతో సుకుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
నచ్చిన చోట శ్రీవారి ‘సేవ’
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తమవంతు సేవలందించాలనుకునే వారికి టీటీడీ సువర్ణావకాశం కల్పించింది. ఇకపై శ్రీవారి సేవకులు ఎవరైనా తమకిష్టమైన విభాగాల్లో దేవుడి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఈనెల 25 నుంచి ఆన్లైన్లో శ్రీవారి సేవకులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని టీటీడీ ఆదివారం ప్రకటించింది. తిరుమల కొండపై దేవుడి సేవ చేయాలన్న తలంపుతో వచ్చే వారిని శ్రీవారి సేవకులు అంటారు. ఏ రోజు ఎవరెవరు ఎక్కడెక్కడ స్వామివారి సేవ చేసుకోవాలో టీటీడీనే నిర్ణయిస్తుంది. అయితే ఎక్కువ మంది భక్తులు తమకు నచ్చిన చోట సేవలందించలేకపోయమాన్న బాధతో వెళ్లేవారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి సేవకులు తమకిష్టమొచ్చిన విభాగాల్లో సేవలు అందించే అవకాశాన్ని కల్పించనుంది. అన్నదానం, ఆరోగ్యశాఖ, నిఘా, భద్రత, కల్యాణకట్ట, వసతి విభాగాలతో పాటు హెల్ప్‌డెస్క్, తిరునామం సేవలను వీరికోసం అందుబాటులోకి తెచ్చింది. భక్తులు తమకు ఇష్టమైన సేవలను తామే ఎంచుకుని 3, 4, 7 రోజుల సేవలు చేసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ నూతన విధానాన్ని మే, జూన్ మాసాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
శ్రీవారి సేవలో ప్రముఖులు సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో రాష్ట్ర స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ.రమేష్, ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్బీఎల్.మిశ్రా, ఐపీఎస్ ముకేశ్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, సంగీత దర్శకుడు ఎస్ఎస్.తమన్ ఉన్నారు. వీరు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.