ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయాలి
కేంద్ర మంత్రికి శ్రీవాస్తవ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు భారీగా పడిపోయాయని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పూర్తిగా పడి పోయాయని, దీంతో ఆయా రాష్ట్రాల్లో తాగు నీటికి, సాగునీటికి కటకట ఏర్పడిందన్నారు. ఇటీవల నిర్వహించిన ఇరు రాష్ట్రాల సమా వేశాల్లో ప్రతినిధులు నీటి అవసరాలను వివరించారని, ఎగువన ఉన్న కర్ణాటక, మహా రాష్ట్రల్లోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్, ఉజ్జయిని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయని... దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తే తక్షణ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం సైతం అంతంతమాత్రంగానే ఉందన్నారు.