అసెంబ్లీ బరిలో 84మంది
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నామినేషన్ల ఘట్టం పరిసమాప్తమైంది. తుది పోరులో నిలిచిందెందరన్న లెక్క తేలింది. జిల్లా ఒక లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల పరిధిలో బుధవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో 10 మంది అభ్యర్థులు రంగంలో మిగలగా.. అసెంబ్లీ సెగ్మెంట్ల బరిలో మొత్తం 84 మంది తుది పోరుకు సై అన్నారు. ఈ నెల 19 వరకు నామినేషన్లు స్వీకరించగా లోక్‌సభకు 16, పది అసెంబ్లీ స్థానాలకు 151 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న వాటిని పరిశీలించి అనర్హమైన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. చివరిదైన ఉపసంహరణ ఘట్టంలో బుధవారం పలువురు అభ్యర్థులు రంగం నుంచి తప్పుకొన్నారు.
శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మొత్తం 16 మంది నామినేషన్లు వేశారు. తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం 10 మంది బరిలో నిలిచారు.
శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్నింటిని తిరస్కరించగా.. ఇంకొందరు ఉపసంహరించుకోవడంతో చివరికి 12 మంది మిగిలారు.
ఆమదాలవలస సెగ్మెంట్లో 14 మంది అభ్యర్థులు 36 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 9 మంది ఎన్నికల గోదాలో మిగిలారు.
రాజాంలో ఉపసహరణ అనంతరం 9 మంది ఎన్నికల బరిలో మిగిలారు.
నరసన్నపేటలో పది మంది నామినేషన్లు వేయగా ఒకటి తిరస్కరణకు గురైంది. మరో ఇద్దరు ఉపసంహరించకోగా ఏడుగురు బరిలో మిగిలారు.
టెక్కలిలో పది నామినేషన్లు దాఖలు కాగా రెండింటిని అధికారులు తిరస్కరించారు. ఇద్దరు రంగం నుంచి తప్పుకోవడంతో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పాలకొండలో ఏడుగురు నామినేషన్లు వేశారు. వీరిలో ఏ ఒక్కరూ ఉపసంహరించుకోకపోవడంతో వారంతా తుది పోరులో నిలిచారు.
పాతపట్నంలో ఏడుగురు నామినేషన్లు వేయగా ఒకరు తప్పుకోవడంతో చివరికి ఆరుగురు బరిలో నిలిచారు.
ఇచ్ఛాపురంలో చివరి రోజు ఏకంగా 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 9 మంది రంగంలో మిగిలారు.
పలాసలో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోగా 11 మంది రంగంలో మిగిలారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మొత్తం 21 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరస్కరణల, ఉపసంహరణల అనంతరం 8 మంది పోటీలో ఉన్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్లలో..
ఇచ్ఛాపురం 9
పలాస 11
టెక్కలి 6
పాతపట్నం 6
శ్రీకాకుళం 12
ఆమదాలవలస 9
ఎచ్చెర్ల 8
నరసన్నపేట 7
రాజాం 9
పాలకొండ 7
మొత్తం 84