మైనర్పై ఎమ్మెల్యే లైంగిక దాడి
పనాజీ: గోవాలో ఓ మైనర్ బాలికపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇదంతా కొంతమంది తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని ఆ వ్యక్తి ఆరోపించారు. ఈ ఏడాది మార్చి నెలలో సెయింట్ క్రూజ్ కు చెందిన అటానాసియో మోన్సిరేట్ అనే ఎమ్మెల్యే ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోవా ఎస్పీ ఎస్పీ కార్తిక్ కష్యప్ తెలిపాడు. ఎనిమిదేళ్ల కిందట.. ఈయన కుమారుడు కూడా ఓ జర్మనీకి చెందిన మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి.
గత ఏడాది ఈయనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అప్పటి నుంచి అసెంబ్లీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న మోన్సెరేట్.. గోవాలోని యునైటెడ్ గోవన్స్ డెమొక్రటిక్ పార్టీని పూర్తి స్థాయిలో తన చేతిలోకి తీసుకొని 2017 ఎన్నికల బరిలో దిగనున్నట్లు చెప్పాడు. 'ఓ మైనర్ బాలిక మార్చి నెలలో కనిపించకుండా పోయింది. పోలీసుల గాలింపులు జరపగా ఇటీవలె ఆ బాలిక దొరికింది. అనంతరం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించి వివరాలు సేకరించగా అసలు విషయం చెప్పింది. ఆమె ఆరోగ్య పరిస్థతిపై వివరాలు మాత్రం ప్రస్తుతం గోప్యత అవసరం' అని పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. అసలు తనకు ఏమీ తెలియదని, కావాలనే ఇరికిస్తున్నారని, విచారణ నుంచి తానేం తప్పించుకోవడం లేదని, కొన్ని పనుల వల్ల వేరే చోట ఉన్నానని, రేపు వచ్చి విచారణ ముందు హాజరవుతానని చెప్పాడు. ఆ బాలిక తన షోరూంలోనే పనిచేస్తుందని, డబ్బు దుర్వినియోగం చేయడం మూలంగా పనిలో నుంచి తొలగించానని ఆ కారణంగానే తనపై ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.