న్యాయవాది తీరుపై క్రైస్తవ ప్రచారకుల ఆందోళన
ప్రత్తిపాడు, న్యూస్‌లైన్ :న్యాయవాది తీరుకు నిరసనగా ప్రత్తిపాడులో క్రైస్తవ ప్రచారకులు, సంఘ సభ్యులు, ప్రజలు ఆదివారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. సెయింట్ జోసెఫ్స్ ఆస్పత్రి ఆవరణలో హెచ్ఐవీ బాధిత చిన్నారులకు వసతి గృహంగా వినియోగిస్తున్న భవనాన్ని మూసేస్తూ స్థానిక న్యాయవాది జనిపల్లి ప్రసాద్‌బాబు బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఇరువర్గాలకు మందడి స్థలాన్ని న్యాయవాది ఆక్రమించాడని క్రైస్తవ ప్రచారకులు ఆరోపిస్తున్నారు. వసతి గృహం కిటికీలు మూతపడడమే కాకుండా న్యాయవాది భవనంలోని వాడకం నీరు వసతిగృహంలోకి వస్తుందన్నారు. ఆక్రమణలు తొలగించాలని కోరిన తమను అసభ్యపదజాలంతో దూషించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి మదర్ సుపీరియర్ శోభ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
70 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఆస్పత్రి సిస్టర్స్‌ను, శోభను దూషించడం దారుణమని ఆర్సీఎం చర్చి కమిటీ సభ్యులు విమర్శించారు. చర్చి కమిటి అధ్యక్షుడు బి. మధుబాబు, ఉపాధ్యక్షుడు డేగల వసంత్, కార్యదర్శి ఎన్. బులిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కడుగుల నూకరాజు, మాజీ వార్డు సభ్యుడు కాకర ప్రకాష్, కిర్లంపూడి ఆర్సీఎం చర్చి సంఘ సభ్యులు బాతు అప్పారావు, బులిపే గోపి, కాకర రాజు తదితరులు న్యాయవాది ఇంటి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు ఈఆందోళన కొనసాగింది. తాను ఆక్రమణలకు పాల్పడలేదని న్యాయవాది ప్రసాద్‌బాబు చెబుతున్నారు. ప్రత్తిపాడు సీఐ టి. రామ్మోహన్‌రెడ్డి ఇరువర్గాలతో స్థానిక పోలీస్ స్టేషన్లో జరిపిన చర్చలు విఫలం కావడంతో చర్చి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ధర్నా కొనసాగించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఆందోళన సాగుతుందని స్పష్టం చేశారు. కాగా ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.